మాల్యా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
న్యూఢిల్లీ: బ్యాంకులకు రుణాల ఎగువేత కేసులో విచారణకు హాజరుకాకుండా ఇంగ్లండ్లో ఉంటున్న కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ యజమాని, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం మాల్యా పాస్పోర్ట్ను సస్పెండ్ చేసింది. శుక్రవారం భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటించింది. మాల్యా డిప్లమాటిక్ పాస్ పోర్ట్ను 4 వారాల పాటు సస్పెండ్ చేసింది. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని, లేకుంటే పాస్ పోర్ట్‌ను తొలగిస్తామని హెచ్చరించింది. మల్యాను భారత్కు వెనక్కిరప్పించే చర్యల్లో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
పాస్‌పోర్ట్ యాక్ట్, 1967 కింద మాల్యా పాస్ పోర్ట్ను రద్దు చేయాలని కోరుతూ ఈడీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. మాల్యా బ్యాంకుల వద్ద తీసుకున్న రూ.4,900 కోట్ల రుణం, దానికి అయిన వడ్డీ... మొత్తం కలుపుకొని రుణం రూ.9 వేల కోట్లకు చేరుకుంది. ఈ రుణాల సెటిల్ మెంట్ కు సంబంధించి 6 వేల కోట్లు రూపాయలు చెల్లించేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు.