VijayMallya
-
విజయ్‌మాల్యాపై అరెస్ట్ వారెంట్ జారీ
-
మాల్యాకు షాక్: అరెస్ట్ వారెంట్
సాక్షి, బెంగళూరు: వేలకోట్ల రూపాయల ఎగవేతదారుడు, వ్యాపారవేత్త విజయ్‌మాల్యాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కేసులో బెంగళూరులోని కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కోర్టు మాల్యాతోపాటు మరో 18మందికి ఈ వారెంట్ ఇష్యూ చేసింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఐఎఫ్ఓఓ) దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు ఈ చర్య తీసుకుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని దర్యాప్తు సంస్థ, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి పలు కంపెనీల చట్టాల ఉల్లంఘనలను గుర్తించింది. దీంతోపాటు తీవ్రమైన కార్పొరేట్ పాలన లోపాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో చోటుచేసుకున్న అక్రమాల మొత్తం భారీగా ఉండటంతో మాల్యా సహా అందరి నిందితులపై కోర్టు సీరియస్‌గా స్పందించింది. ఈ నేపథ్యంలోనే కంపెనీల చట్టాల ప్రకారం డిఫాల్టర్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా, మరో 18 మందికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అంతేకాకుండా, 19 సంస్థలపై "ప్రత్యేక నేర కేసు" నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీ తమ చార్జ్‌షీటులను దాఖలు చేశాయి. కాగా 9వేలకోట్ల రూపాయల మేర రుణాలను ఎగవేసిన మాల్యా లండన్‌కు పారిపోగా.. ఆయన్ను తిరిగి భారత్‌కు రప్పించేందుకు సంబంధించిన కేసు లండన్ కోర్టు విచారణలో ఉంది. -
మాల్యాపై ఆరోపణలకు సరైన సాక్ష్యాలు లేవు
లండన్: వేలకోట్ల రూపాయలు ఎగవేసి విదేశానికి పారిపోయిన లిక్కర్‌కింగ్ విజయ్‌మాల్యాను తిరిగి దేశానికి రప్పించే క్రమంలో లండన్‌లో రెండవ రోజు వాదనలు కొనసాగాయి. లండన్ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ సందర్భంగా మాల్యా పై నగదు బదిలీ అభియోగాలకు మద్దతుగా ఎలాంటి ఆధారాలు లేవని డిఫెన్స్ వాదించింది. మాల్యా తరపు లాయర్ క్లారా మోంట్‌గోమెరీ మంగళవారం తన వాదనలను వినిపిస్తూ మాల్యాపై ఆరోపణలను సమర్ధించటానికి ఎటువంటి ఆధారం లేదన్నారు. మాల్యా రుణాలు తీసుకుని మోసం చేశారన్న వాదనకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర సరైన సాక్ష్యాలు లేవని ఆమె పేర్కొన్నారు. సీపీఎస్ సమర్పించిన సాక్ష్యం విశ్వసనీయంగా లేదని వాదించారు. ఈ కేసు విచారణలో క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ భారత ప్రభుత్వం తరఫున వాదిస్తోంది. బుధవారం, శుక్రవారం సెలవు రోజులు కావడంతో తదుపరి విచారణ డిసెంబర్ 14కి వాయిదా పడింది. కాగా వివిధ బ్యాంకులకు రూ. 9 వేల కోట్ల మోసం, అక్రమ నగదు లావాదేవీల ఆరోపణలు విజయ్ మాల్యాపై ఉండగా గత ఏడాది మార్చిలో దేశం విడిచి లండన్ వెళ్లిపోయాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అరెస్ట్ చేశారు. అనంతరం అతడు బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. -
విజయ్ మాల్యా పాస్ పోర్టు రద్దు
బ్రిటన్‌లో ఉన్నట్లు భావిస్తున్న ‘ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారు’ విజయ్ మాల్యా మరింత ఇరుకున పడ్డారు. విజయ్ మాల్యా డబ్బు లావాదేవీల్లో చట్టాన్ని ఉల్లంఘించారని, కేసు విచారణకు సరిగా సహకరించడంలేదని ఈ నేపథ్యంలో మాల్యా పాస్ పోర్టు రద్దు చేస్తున్నట్టు ఆదివారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. సెక్షన్ 10(3)(సీ) అండ్(హెచ్) ఆఫ్ పాస్ పోర్ట్ ఆక్ట్ ప్రకారం విజయ్ మాల్యా పాస్ పోర్టు ను రద్దు చేశామని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మాల్యాను స్వదేశానికి రప్పించే డిపోర్టేషన్ ప్రక్రియ ప్రారంభించాలంటూ విదేశీ వ్యవహారాల శాఖను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఆశ్రయించింది. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు (ఆర్సీఎన్) వచ్చేలా సీబీఐ కి త్వరలోనే ఈడీ లేఖ రాయనుంది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కు తీసుకున్న రుణంలో మాల్యా 430 కోట్ల రూపాయల వరకూ విదేశాలకు మళ్ళించారన్నది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వాదన. మరోవైపు తొమ్మిదివేల కోట్ల బ్యాంకు రుణ కుంభకోణం కేసుకు సంబంధించి మాల్యాపై ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలిపింది. తన విదేశీ ఆస్తుల వివరాలను అడిగే అధికారం బ్యాంకులకు లేదని, తన భార్యా, పిల్లలు ఎన్నారైలు కావడంతో తన ఆస్తుల వివరాలను వెల్లడించక్కర లేదని మాల్యా ఇప్పటికే సుప్రీం కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. After having considered replies by @TheVijayMallya, MEA revokes his passport under S.10(3)(c) & (h) of Passports Act pic.twitter.com/Stb9rX63OV — Vikas Swarup (@MEAIndia) 24 April 2016 -
మాల్యా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
న్యూఢిల్లీ: బ్యాంకులకు రుణాల ఎగువేత కేసులో విచారణకు హాజరుకాకుండా ఇంగ్లండ్‌లో ఉంటున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ యజమాని, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం మాల్యా పాస్‌పోర్ట్‌ను సస్పెండ్ చేసింది. శుక్రవారం భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటించింది. మాల్యా డిప్లమాటిక్ పాస్ పోర్ట్‌ను 4 వారాల పాటు సస్పెండ్ చేసింది. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని, లేకుంటే పాస్ పోర్ట్‌ను తొలగిస్తామని హెచ్చరించింది. మల్యాను భారత్‌కు వెనక్కిరప్పించే చర్యల్లో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పాస్‌పోర్ట్ యాక్ట్, 1967 కింద మాల్యా పాస్ పోర్ట్‌ను రద్దు చేయాలని కోరుతూ ఈడీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. మాల్యా బ్యాంకుల వద్ద తీసుకున్న రూ.4,900 కోట్ల రుణం, దానికి అయిన వడ్డీ... మొత్తం కలుపుకొని రుణం రూ.9 వేల కోట్లకు చేరుకుంది. ఈ రుణాల సెటిల్ మెంట్ కు సంబంధించి 6 వేల కోట్లు రూపాయలు చెల్లించేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు.