లండన్: వేలకోట్ల రూపాయలు ఎగవేసి విదేశానికి పారిపోయిన లిక్కర్‌కింగ్ విజయ్‌మాల్యాను తిరిగి దేశానికి రప్పించే క్రమంలో లండన్‌లో రెండవ రోజు వాదనలు కొనసాగాయి. లండన్ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ సందర్భంగా మాల్యా పై నగదు బదిలీ అభియోగాలకు మద్దతుగా ఎలాంటి ఆధారాలు లేవని డిఫెన్స్ వాదించింది. మాల్యా తరపు లాయర్ క్లారా మోంట్గోమెరీ మంగళవారం తన వాదనలను వినిపిస్తూ మాల్యాపై ఆరోపణలను సమర్ధించటానికి ఎటువంటి ఆధారం లేదన్నారు.
మాల్యా రుణాలు తీసుకుని మోసం చేశారన్న వాదనకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర సరైన సాక్ష్యాలు లేవని ఆమె పేర్కొన్నారు. సీపీఎస్ సమర్పించిన సాక్ష్యం విశ్వసనీయంగా లేదని వాదించారు. ఈ కేసు విచారణలో క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ భారత ప్రభుత్వం తరఫున వాదిస్తోంది. బుధవారం, శుక్రవారం సెలవు రోజులు కావడంతో తదుపరి విచారణ డిసెంబర్ 14కి వాయిదా పడింది.
కాగా వివిధ బ్యాంకులకు రూ. 9 వేల కోట్ల మోసం, అక్రమ నగదు లావాదేవీల ఆరోపణలు విజయ్ మాల్యాపై ఉండగా గత ఏడాది మార్చిలో దేశం విడిచి లండన్ వెళ్లిపోయాడు. ఈ ఏడాది ఏప్రిల్లో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు మాల్యాను అరెస్ట్ చేశారు. అనంతరం అతడు బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment