యువతి ఫేక్ నగ్న చిత్రాలు పోస్ట్ చేయడంతో..
చెన్నై: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. ఓ గుర్తు తెలియని యువకుడు చేసిన చిల్లరపనికి ఓ యువతి బలైంది. ఫేస్బుక్లో ఆమె ఫేస్తో నఖిలీ నగ్న చిత్రాలు పోస్ట్ చేయడంతో అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. వాస్తవానికి పోలీసులు వేగంగా స్పందించి ఉంటే ఆమె ప్రాణాలతో ఉండేదని ఈ ఘటన చూస్తే అర్థం చేసుకోవచ్చు. సాలెం జిల్లాలోని ఎలంపిల్లాయ్కు చెందిన 21 ఏళ్ల యువతి ఇటీవలె కెమిస్ట్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
గత వారం ఆమె స్నేహితులు ఫోన్ చేసి ఫేస్ బుక్లో మార్పింగ్ చేసిన తన నగ్న చిత్రాలు ఉన్నాయని చెప్పడంతో బాధితురాలు తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు వేగంగా పూర్తి చేసేందుకు పోలీసుకు తండ్రి ఒక కొత్త ఫోన్ కూడా కొన్నాడు. అయినా పట్టించుకోకపోవడంతో ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్పీ అదేశాల మేరకు బాలిక ఇచ్చిన ప్రాథమిక సమాచారంతో ఓ వ్యక్తిని పిలిచి దర్యాప్తు చేశారు. అతడు కాదని నిర్ధారించారు.
దీంతో పదిహేను రోజుల్లోగా అతడిని పట్టుకుంటామని హామీ ఇచ్చి ఇంటికి పంపించారు. అయితే, మరోసారి అదే ఫేస్ బుక్ మరో నగ్న ఫొటోను పోస్ట్ చేయడంతోపాటు ఆమె తండ్రి ఫోన్ నెంబర్ కూడా పెట్టారు. దీంతో భరించలేని ఆ బాలిక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై ఆమె తండ్రి స్పందిస్తూ పోలీసులు వేగంగా స్పందించి ఉంటే తన కూతురు బతికి ఉండేదని బోరుమన్నాడు. నిందితుడిని అరెస్టు చేసే వరకు తమ కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లబోమని ధర్నాకు దిగారు.