నకిలీ ఓటర్లకు చెక్
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే విధానానికి విఘాతం కలిగించే నకిలీ ఓటర్లకు చెక్ పెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజేష్‌లఖానీ ఆదేశించారు. ఓటర్ల జాబితాలోని నకిలీ ఓటర్లను వెంటనే తొలగింపునకు ప్రజలు, పార్టీ నేతలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.అసెంబ్లీ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉన్నతాధికారులకు ఈ నెల 8 నుంచి 14వ తేదీ వరకు శిక్షణా తరగతులను నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన అధికారులు జిల్లా స్థాయిలో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు శిక్షణనిస్తారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు శిక్షణ ముగిసినందున ఉన్నతాధికారులందరితో రాష్ట్ర ఎన్నికల అధికారి రాజేష్ లఖానీ నాలుగు విడతలుగా ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారనే గతంలో ప్రకటించి ఉన్నారు.
ఈ మేరకు మూడు దశల్లో సమావేశాలు ముగిసిపోగా చివరి సమావేశాన్ని చెన్నై రాజాఅన్నామలైపురంలో గురువారం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో చురుకుగా వ్యవహరించడం, ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా రక్షణ కల్పించడం, మూడేళ్ల కాలపరిమితి దాటిన అధికారులను బదీలీ చేయడం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజేష్‌లఖానీ మీడియాతో మాట్లాడుతూ నకిలీ ఓటర్లు ఉన్నట్లు ఫిర్యాదు అందాయని అన్నారు. ఒకే ఓటరు పేరు రెండుచోట్ల ఉన్నట్లయితే ఆన్‌లైన్ ద్వారా తొలగిస్తామని తెలిపారు. మృతి చెందిన వారి పేర్లను ఆన్‌లైన్ ద్వారానే తొలగిస్తున్నామని చెప్పారు. 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించే చర్యలు చేపట్టుతున్నామని అన్నారు.
నకిలీ ఓటర్ల తొలగింపునకు ప్రజలు, పార్టీ నేతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.నేతల ప్రచారానికి, వాహనాల అనుమతి, ఎన్నికల ఖర్చును నమోదు చేసేందుకు సరికొత్త విద్యుత్ యంత్రాన్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ యంత్రం వినియోగానికి చీఫ్ ఎలక్షన్ కమిషన్ అనుమతి కోరివున్నామని తెలిపారు. ఈ యంత్రం వినియోగంపై గురువారం నిర్వహించిన సమావేశంలో అధికారులకు శిక్షణనిచ్చినట్లు వివరించారు. కాంచీపురం, కడలూరు, తిరువళ్లూరు, విళుపురం, తిరువన్నామలై, వేలూరు, కృష్ణగిరి..ఈ 8 జిల్లాల నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ ఉన్నతాధికారులు, డీఆర్వోలు హాజరయ్యారు.