మాలతీ చందూర్ క్యాన్సర్ వ్యాధితో మరణం | Famous columnist and writer Malathi Chandur has died from cancer in a private hospital due to lung problem on Wednesday. | Sakshi
Sakshi News home page

మాలతీ చందూర్ క్యాన్సర్ వ్యాధితో మరణం

Published Thu, Aug 22 2013 1:24 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM

Famous columnist and writer Malathi Chandur has died from cancer in a private hospital due to lung problem on Wednesday.

అన్నానగర్, న్యూస్‌లైన్:బహుముఖ ప్రజ్ఞాశాలిగా, రచయిత్రిగా పేరుపొందిన మాలతీ చందూర్ ఇక లేరు. ఆమె బుధవారం సాయంత్రం క్యాన్సర్ వ్యాధితో మృతిచెందారు. 1930లో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నూజివీడులోని జ్ఞానాంబ, వెంకటేశ్వర్లు దంపతులకు ఆరవ సంతానంగా మాలతి జన్మిం చారు. నూజివీడులోనూ, ఏలూరులోనూ విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1947 మేనమామ అయిన చందూరి నాగేశ్వరావును పెళ్లి చేసుకున్నారు. అనంతరం మాలతి జీవితం గొప్ప మలుపు తిరిగింది. ఎన్‌ఆర్ చందూర్ స్వతహాగా పాఠకుడు, రచయిత, సంపాదకుడు కావడంతో ఆయన మాలతి దృష్టిని సాహిత్యం వైపునకు మరల్చి తొలి గురువు అయ్యారు. ఏలూరులోని సాహిత్య మండలితో ఉన్న ఆమెకున్న అనుబంధం సైతం మాలతిని సాహితీ రంగం వైపుకి మరలేలా చేసింది.
 
 ‘శరికం’ అనే నాటకంలో మాలతి ఒక పాత్రను కూడా పోషించారు. విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, చలం వంటి వారి పుస్తకాలను ఆమెను సంపూర్ణమైన రచనా వ్యాసాంగంలోనికి దించాయి. అందుకే ఆమె ‘పుట్టిన రోజులకు పుస్తకంను మాత్రమే బహుమతిగా ఇవ్వండి’ అంటూ ఒక కొత్త సంప్రదాయానికి తెరతీశారు. మాలతీ చందూర్ రాసిన పలు పుస్తకాల్లో మధుర స్మృతు లు, చంపకం, చెదపురుగులు, లావణ్య, ఏది గమ్యం - ఏది మార్గం?, రేణుకా దేవి ఆత్మకథ, క్షణికం, ఏమిటీ ఈ జీవితాలు?, రాగరక్తిమ, బ్రతక నేర్చిన జాణ, జయలక్ష్మీ - కృష్ణవేణి, వైశాఖి వంటివి ఉన్నాయి. ఇవి ప్రస్తుతం లభ్యం కావడం లేదు. 1950లో ఆమె రాసిన ఁరవ్వల దిద్దులురూ. అనే తొలి కథ ఆనంద వాణిలో ప్రచురితమైంది. భారతి మాస పత్రికలో లజ్ కార్నర్, నీరజ కథలు ప్రచురితమయ్యాయి. పాప, తనూ - నీరజ శానమ్మ, జాలీ, విలువెంత, ఏడు కొండలవాడా, జమున వంటి కథలు ఆమెను ఒక రచయిత్రిగా నిలిపాయి. మాలతి కథల్లో చెన్నై నగరం ప్రధాన ఇతివృత్తం కావడం గమనించదగిన విశేషం. 
 
 సుమధుర వంటలూ - కూరలు - పచ్చళ్లూ అనే పలు వంటల పుస్తకాలను కూడా ఆమె రచించారు. మహిళలకు మధుర జీవనం, అందాలు - అలంకారాలూ ఆమె మహిళల కోసం రాసిన పుస్తకాలు. ఉన్నత విద్యను అభ్యసించపోయినా పట్టుదలతో ఆంగ్లాన్ని అభ్యసించి అనేక రచనలను తెలుగులోకి అనువదించారు. మాలతీ చందూర్ ఆలిండియా రేడియో మద్రాసు - బి స్టేషన్ నుంచి ఎన్నో ప్రసంగాలు చేశారు. రెండేళ్ల క్రితం భర్త ఎన్‌ఆర్ చందూర్ రమణించడంతో ఆమె తన రచనా వ్యాసాంగాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఆ సమయాన్ని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ సేవా సంస్థలోని సేవా కార్యక్రమాలకు, అమరజీవి పొట్టి శ్రీరాములు సంఘం కార్యకలాపాలకు వెచ్చిస్తూ కాలం గడిపారు. ఆమె మరణంతో తెలుగు సాహితీ లోకం మరొక ధ్రువతారను కోల్పోయింది.
 
 నా తొలి గురువు
 సాహిత్యంలో మాలతి అమ్మ నాకు గురువు, దైవం. ఆమెతో మాట్లాడడమే ఒక గొప్ప వర్సిటీలో విద్య అభ్యసించడం లాంటిది. సాహితీ కార్యక్రమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండడమే కాక తెలుగు భాషా ఉన్నతికి తన వంతు కృషి చేశారు.
 - మాడభూషి సంపత్ కుమార్, మద్రాసు వర్సిటీ తెలుగు విభాగం
 
 పిల్లలతో ఆప్యాయంగా ఉండేవారు
 మాలతీ చందూర్ పిల్లలతో చాలా ఆప్యాయంగా ఉండేవారు. ఆమెతో నేను చేసిన ముఖాముఖి సాక్షి పత్రికలో ఁచదవండి బాగా చదవండిరూ. అనే టైటిల్‌తో ప్రచురితమైంది. అది అదృష్టంగా భావిస్తున్నాను. చదవడాన్ని వ్యసనంగా చేసుకోవాలన్న ఆమె మాటలు యువతకు స్ఫూర్తి దాయకం.  
 - డాక్టర్ సగిలి సుధారాణి, పరిశోధకురాలు
 
 అమ్మను కోల్పోయినట్టు ఉంది
 నాకు అమ్మ లాంటి వ్యక్తిని కోల్పోయినందుకు బాధగా ఉంది. ఆమెకు ఫ్యామిలీ డాక్టర్‌గా సేవ చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆమె లేని లోటు తీర్చలేనిది. అందరితోనూ కలివిడిగా ఉండేవారు. తన చుట్టూ ఉండే వారిని ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవారు. 
 - డాక్టర్ విజయకుమార్
 
 రచనల్లో కొత్త విషయాలు ఉంటాయి
 మాలతీ చందూర్ రచనలు కాసులు వంటివి. సాధారణమైన అంశాలను కూడా అసాధారణ ప్రతిభతో రాయడం ఆమెకే చెల్లింది. విషయం స్వల్పమే అయినా అందులో అనేకమైన కొత్త విషయాలు చెప్పడం ఆమె రచనల్లోని ప్రత్యేకత.
 - డాక్టర్ కాసల నాగభూషణం, వైష్ణవ కళాశాల,  తెలుగు ఆచార్యులు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement