వివాదాల గవర్నర్‌కు వీడ్కోలు
- ఇన్‌చార్జి గవర్నర్‌గా రోశయ్య
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఐదేళ్ల సేవల అనంతరం రాష్ర్ట గవర్నర్ హెచ్‌ఆర్. భరద్వాజ్ శనివారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ఇన్‌చార్జిగా వ్యవహరించనున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు నియమితులైన భరద్వాజ్, తొలి నుంచీ అధికార పార్టీలకు సింహ స్వప్నంలా తయారయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప, కొందరు మంత్రులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి విచారణకు అనుమతినిచ్చారు.
ఆది నుంచీ ఆయన చర్యలు వివాదాస్పదంగానే ఉన్నాయి. అసలు...బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికే యూపీఏ ప్రభుత్వం ఆయనను నియమించిందా...అనే ప్రశ్నలూ అప్పట్లో తలెత్తాయి. 2010 అక్టోబరులో 14 మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఐదుగురు స్వతంత్రులు యడ్యూరప్ప సర్కారుకు మద్దతును ఉపసంహరించుకున్నప్పుడు గవర్నర్ పాత్ర సర్వత్రా విమర్శల పాలైంది. అదే ఏడాది అక్టోబరు 12న సాయంత్రం ఐదు గంటలలోగా బల నిరూపణ చేసుకోవాలని యడ్యూరప్పకు హుకుం జారీ చేశారు.
అనంతరం యడ్యూరప్ప విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ముందు అప్పటి స్పీకర్ కేజీ. బోపయ్య ఫిరాయింపుల నిరోధక చట్టం కింద 19 మందిపై అనర్హత వేటు వేశారు. దీనిపై అగ్గి మీద గుగ్గిలమైన గవర్నర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ కేంద్రానికి సిఫార్సు చేశారు. అయితే కేంద్రంలోని యూపీఏ సర్కారు ఆయన సిఫార్సును బుట్ట దాఖలు చేసింది.
బల నిరూపణకు మరో అవకాశం ఇవ్వాలని సూచించింది. తదనంతరం యడ్యూరప్ప రెండో సారీ బలాన్ని నిరూపించుకున్నారు. ఇద్దరు న్యాయవాదులతో పాటు అనేక మంది యడ్యూరప్పపై లోకాయుక్త కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదులను దాఖలు చేశారు. ఆ సందర్భంగా విచారణకు అవసరమైన అనుమతిని గవర్నర్ మంజూరు చేశారు. అంతేకాకుండా చీటికి మాటికి ప్రభుత్వంపై, కొందరు మంత్రులపై ఆయన అదే పనిగా విమర్శలు గుప్పించే వారు.
తదనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఆయన విమర్శల వాడి తగ్గలేదు. కొందరు మంత్రుల పనితీరు బాగా లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ తరుణంలో కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ రాజ్ భవన్‌కు చేరుకుని గవర్నర్‌ను బుజ్జగించాల్సి వచ్చింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనను కలుసుకున్న సందర్భంలో కొందరు మంత్రుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘చూసీ చూడనట్లు వెళ్లండి’ అంటూ సీఎం ఆయనను అప్పట్లో అనునయించినట్లు సమాచారం. గవర్నర్‌గా ఉంటూనే కాంగ్రెస్ నాయకత్వంపై ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందే బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెబుతూ, కాంగ్రెస్...నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడుతోందని విమర్శించారు. కేంద్రంలో న్యాయ శాఖ మంత్రిగా సుదీర్ఘ అనుభవం గడించిన ఆయనతో ‘పెట్టుకోవడానికి’ ముఖ్యమంత్రులు కూడా జడిసే వారు. కోపమున్నప్పటికీ లోలోపల దిగుమింగుకునే వారు. తన ఐదేళ్ల హయాంలో ఆయన ముగ్గురు ముఖ్యమంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.