- రైతు సంఘాల నిర్ణయం
- కలెక్టర్‌కు అల్టిమేటం
సాక్షి, చెన్నై : డెల్టాలోని జిల్లాల్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీకి దక్షిణ భారత నదుల అనుసంధాన అన్నదాతల సంఘం నిర్ణయించింది. తిరుచ్చి జిల్లా కలెక్టర్ పళని స్వామికి తమ గోడును వివరిస్తూ అల్టిమేటం ఇచ్చారు. నదుల అనుసంధానం, అకాల వర్షంతో నష్ట పోయిన రైతుల్ని ఆదుకోవాలని, కావేరి అభివృద్ధి మండలి ఏర్పాటు, కావేరి జలాల పరిరక్షణ, రుణాల మాఫీ తదితర డిమాండ్లతో దక్షిణ భారత నదుల అనుసంధాన అన్నదాతల సంఘం చలో అసెంబ్లీకి సిద్ధం అయింది. ఇది వరకు సచివాలయం ముట్టడికి యత్నించి కొన్ని రోజుల పాటుగా గృహ నిర్భందంలో ఉన్న ఈ సంఘం నేతలు ఇటీవల ఢిల్లీ వెళ్లి బిక్షాటనకు సిద్ధపడి అక్కడి పోలీసుల ఆగ్రహంతో ఇక్కడికి వెనక్కు తిరిగి రావాల్సి వచ్చింది.
ఈ పరిస్థితుల్లో ఆ సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను శనివారం తిరుచ్చి కలెక్టర్ పళని స్వామిని కలుసుకుని వినతి పత్రం సమర్పించారు. అందులో రాష్ర్టం కరువుతో అలమటిస్తున్నా , పట్టించుకునే వాళ్లు కరువయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ఏడాది కేంద్ర కరువు నివారణ బృందం డెల్టా జిల్లాల్లో పర్యటించి నివేదికను సిద్ధం చేసిందని వివరించారు. అయితే, ఆ నివేదికలో పేర్కొన్న అంశాలు ఇంత వరకు బహిర్గతం కాలేదని మండి పడ్డారు. వ్యవసాయ శాఖ కార్యదర్శిని కోరితే, తిరుచ్చి జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ రవిచంద్రన్‌ను అడిగి తీసుకోవాలని సూచించారన్నారు. అయితే, ఆయన తమను ఖాతరు చేయడం లేదని, అన్నదాతల గోడు ఆయనకు పట్టడం లేదని ఆరోపించారు.
తమ గోడును పట్టించుకోక పోగా, కోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కావేరి నదిలో మురికి నీరు కలవకుండా చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించినా, ఇంత వరకు అధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. పైన పేర్కొన్న డిమాండ్ల సాధన, అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టే విధంగా ఈనెల 24న అసెంబ్లీ సమవేశాల్ని పురస్కరించుకుని చలో అసెంబ్లీకి సిద్ధం అవుతున్నామని హెచ్చరించారు. సచివాలయం, అసెంబ్లీ పరిసరాల్లో రాస్తారోకోలతో తమ నిరసనను తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకు అన్నదాతలు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
చలో అసెంబ్లీ
Published Sun, Aug 16 2015 4:24 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
Advertisement
Advertisement