బీఎస్ఎన్ఎల్తో కలసి ఏపీలో ఫైబర్ గ్రిడ్!
విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పోస్టల్ డిపార్టుమెంట్కు 5 ఎకరాల భూమి కేటాయిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. బీఎస్ఎన్ఎల్తో కలసి రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. మంగళవారం విజయవాడలో ఏపీ తపాలా, టెలికం సర్కిల్ను కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, మనోజ్ సిన్హా, సుజనా చౌదరితో కలసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... విజయదశమి రోజు ఏ పని ప్రారంభించిన మంచి జరుగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యాలయాలు ఉన్న శాఖ పోస్టల్దే అని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ డిపార్టుమెంట్లో మనం నగదు దాచుకోవచ్చని చెప్పారు. అలాగే దేవాలయాల ప్రసాదాలను కూడా పోస్టల్ శాఖ వారు అందిస్తున్నారని గుర్తు చేశారు.
బీఎస్ఎన్ఎల్ మంచి సేవలు అందిస్తుందంటూ ఆ శాఖకు చంద్రబాబు కితాబు ఇచ్చారు. విజయవాడ, కర్నూలులో ప్రాంతీయ పోస్టల్, టెలికం సర్కిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దసరా పర్వదినం రోజున పోస్టల్ సర్కిల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... ఎన్ని భాషలు నేర్చుకున్న ప్రతి ఒక్కరు తప్పని సరిగా హిందీ నేర్చుకోవాలన్నారు. భారతదేశంలో పోస్టల్ శాఖ ప్రవేశించి 250 ఏళ్లు అయిందని గుర్తు చేశారు. పోస్టు ఆఫీస్ భవిష్యత్లో అందరికి మరింతగా ఉపయోగపడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి త్వరలో అన్ని శాఖలు రావాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ప్రతి కేంద్రమంత్రి ఎదో ఒకటి తెస్తున్నామని వెంకయ్య పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు కూడా ఎప్పుడు రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలని పరితపిస్తుంటారని పేర్కొన్నారు.
మరో కేంద్రమంత్రి జయంత్ సిన్హా మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో తపాల, టెలికాం సేవలు మరింత విస్తృతం అవుతాయన్నారు. ఈ రెండు సర్కిళ్ల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ కొత్త రూపు సంతరించుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమా, నారాయణ తదితరులు పాల్గొన్నారు.