ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం లో మంటలు
సాక్షి, చెన్నై :చెన్నై బీచ్ రైల్వే స్టేషన్‌నకు ఎదురుగా ఉన్న పురాతన భవనంలో ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం కొనసాగుతోంది. 200 ఏళ్ల నాటి ఈ భవనం మూడు అంతస్తులతో ఉంది. ఇక్కడ ఆ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పూర్తి రికార్డులు, ఫైళ్లు ఉన్నట్టు సమాచారం. శనివారం హాఫ్ వర్కింగ్ డే కావడంతో సిబ్బంది విధులను ముగించుకుని వెళ్లి పోయారు. సరిగ్గా 3.45 నిమిషాలకు ఆ భవనం రెండో అంతస్తు నుంచి పొగ రావ డం ఆ పరిసరాల్లోని వ్యాపారులు గుర్తించారు. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అప్పటికే ఆ భవనం నుంచి ఎవరో సమాచారం అందించారు. ఆగమేఘాలపై అగ్నిమాపక అధికారులు, సిబ్బంది అక్కడికి పరుగులు తీశారు. మంటలు క్రమంగా వ్యాపించడంతో రెండో అంతస్తును పూర్తిగా కబళించాయి. మూడో అంతస్తులోకి మంటలు విస్తరించడంతో సకాలంలో అగ్నిమాపక సిబ్బంది ప్రవేశించారు.
వీరోచితం : 20కు పైగా అగ్నిమాపక వాహనాలు, ఆరు కార్పొరేషన్ వాటర్ ట్యాంకర్లు అక్కడికి చేరుకున్నాయి. మంటలు అదుపులోకి తెచ్చేందుకు వీరోచితంగా శ్రమించాల్సి వచ్చింది. రెండో అంతస్తు గుండా, మూడో అంతస్తులోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో స్కై స్ప్రే వాహనాలు రెండింటిని తెప్పించారు. ఈ వాహనాల ద్వారా గాల్లో నుంచి మూడో అంతస్తులోకి నీటిని వెదజల్లారు. దీంతో ఆ భవనం పూర్తి స్థాయిలో మంటల్లో చిక్కకుండా అదుపులోకి తీసుకురాగలిగారు. అనంతరం మూడో అంతస్తు గుండా, రెండో అంతస్తులోకి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పెను ప్రమాదం నుంచి ఆ భవనాన్ని తప్పించారు. అక్కడి క్యాంటీన్లో ఉన్న సిలిండర్లను చాకచక్యంగా బయటకు తరలించేశారు. ఆ అంతస్తులో మంటలను అదుపులోకి తెచ్చేందుకు గంటన్నర పాటుగా శ్రమించాల్సి వచ్చింది. సుమారు 200 మంది అగ్నిమాపక సిబ్బంది వీరోచితంగా శ్రమించి మంటల్ని పూర్తిగా అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం తప్పినట్టు అధికారులు పేర్కొంటున్నారు. హాఫ్ వర్కింగ్ డే కావడంతో అందరూ ముందుగానే ఇళ్లకు వెళ్లిపోయారు. అందు వల్ల ఈ ప్రమాదం నుంచి అక్కడి సిబ్బంది బయట పడ్డారు. తమకు ఆ భవనం నుంచి సమాచారం అందించిన వాళ్లెవరన్న విషయమై అగ్నిమాపక సిబ్బంది ఆరా తీస్తున్నారు. అయితే పనులు ముగించుకుని మొదటి అంతస్తు గుండా కొందరు సిబ్బంది బయటకు వెళుతున్నప్పుడు ప్రమాదం జరిగినట్టు, వారే సమాచారం ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. మంటలు రెండు, మూడు అంతస్తులకు వెళ్లే మార్గంలో ఉన్న పాత ఫర్నిచర్, పాత సామాన్లు ఉన్న ప్రదేశంలో తొలుత చెలరేగినట్టుగా భావిస్తున్నారు. పెద్ద ఎత్తున రికార్డులు, ఫైళ్లు తగల బడ్డట్టు చెబుతున్నారు. ఎస్‌బీఐ వర్గాలు అక్కడికి చేరుకున్నాకే, పూర్తి స్థాయి నష్టం వివరాలు వెలుగు చూసే అవకాశం ఉంది.
ఆగిన ట్రాఫిక్: ఈ అగ్ని ప్రమాదంతో రాజాజీ సాలై, ప్యారీస్, కామరాజర్ సాలై పరిసరాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రాజాజీ సాలైను పూర్తిగా మూసి వేశారు. ఆ భవనం పరిసరాల్లో రెండు కిలో మీటర్ల వరకు ఎవరినీ అనుమతించ లేదు. ఎదురుగా బీచ్ రైల్వే స్టేషన్ ఉండడంతో, అక్కడి ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. సంఘటనా స్థలానికి జనం ఉరకలు తీయడంతో వారిని కట్టడి చేయడానికి స్పల్పంగా లాఠీలు ఝుళిపించాల్సిన పరిస్థితి నెలకొంది.
కొందరైతే తమ సెల్‌ఫోన్లలో అగ్నిప్రమాద దృశ్యాలను బంధిస్తూ కనిపించారు. చివరకు అగ్నిమాపక సిబ్బంది వీరోచిత శ్రమతో మంటలు పక్కనే ఉన్న భవనాలకు పాక లేదు. అయితే, ఈ ప్రమాదం కారణంగా ఆ పురాతన భవం పాక్షికంగా దెబ్బ తింది. రెండో అంతస్తులో గోడలు కుప్పకూలి ఉన్నాయి. మూడో అంతస్తులో ఓ భాగం దెబ్బతినడంతో ఆ భవనంలో ఎస్‌బీఐ కార్యాలయాన్ని ఇక మీదట నిర్వహించడం కష్టతరమే. మరోవైపు శనివారం చెన్నైకు కలిసిరానట్లుంది. ఎందుకంటే వరుసగా మూడు శనివారాలపాటు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత నెల 28 శనివారం మౌళివాకంలో బహుళ అంతస్తుల భవనం కుప్ప కూలింది.ఆ మరుసటి శనివారం అర్థరాత్రి కురిసిన వర్షంతో ఉప్పర పాళయంలో ప్రహరీ గోడ కూలింది. ఈ శనివారం ఎస్‌బీఐ భవనం మంటల్లో చిక్కడం గమనార్హం.