సాక్షి, చెన్నై : ఎన్‌డీటీవీకి ఒక రోజు నిషేదం సబబే అని కేంద్ర సమాచార, ప్రసారాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు సమర్థించుకున్నారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) వజ్రోత్సవాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రత్యేక తపాల స్టాంప్‌ను విడుదల చేశారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 75వ వసంతంలోకి అడుగు పెట్టడాన్ని పురస్కరించుకుని రెండు రోజుల పాటు చెన్నై నందంబాక్కం ట్రేడ్ సెంటర్‌లో వజ్రోత్సవ వేడుకలకు చర్యలు తీసుకున్నారు.
ఉదయం జరిగిన వేడుకకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా భవన నిర్మాణ రంగంలో ప్రగతి, నాణ్యత ప్రమాణాల గురించి, నగర, పట్టణీకరణ గురించి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. అలాగే ప్రత్యేక పోస్టల్ కవర్, బీఏపీ ప్లాటినం జూబ్లీ ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను చెన్నై నగర రీజియన్ పోస్టు మాస్టర్ జనరల్ బి.రాధిక చక్రవర్తి చేతుల మీదుగా అందుకున్న వెంకయ్యనాయుడు, వాటిని ఆవిష్కరించారు.
ఇక, ఇండియన్ కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీకి విశేష సేవలు అందించిన లార్సెన్ అండ్ టర్బో మాజీ వైస్ ప్రెసిడెంట్ కేవీ రంగస్వామి సత్కరించుకున్నారు. ఈ వేడుకలో ఆ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు అవినాష్ ఎం పాటిల్ ఉపాధ్యక్షులు (దక్షిణ రీజియన్ ) మోహన్ , చైర్మన్ వెంకటేషన్ , కార్యదర్శి ఎస్ రామ ప్రభులతోపాటు ఆ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో వెంకయ్యనాయుడు మాట్లాడారు.నిషేధం సబబే : భారత ఆర్మీ సాగించిన దాడుల వ్యవహారాలను బట్ట బయలు చేసిన ఎన్డీటీవీని 24 గంటల పాటు నిషేదించడం సబబేనని సమర్థించుకున్నారు.
ఆర్మీ వ్యవహారాలను ,చాకచక్యంతో సాగిన దాడులను బయట పెడితే, తీవ్ర వాదులు అప్రమత్తం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. విధి విధానాలను చానళ్లు పాటించాలని సూచించారు. తాము కొత్తగా నిషేధం విధించ లేదని, గతంలో తీసుకున్న నిర్ణయాలను, విధించిన ఆంక్షల మేరకు తాజాగా అమలు చేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయంలోనే ఈ ఆంక్షలు, నిబంధనల రూపకల్పన సాగిందన్న విషయాన్ని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ గుర్తెరగాలని హితవు పలికారు. దేశ భద్రత విషయంలో, ప్రభుత్వ నిబంధనలకు లోబడి వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఉమ్మడి కమిటీ!
Published Sun, Nov 6 2016 2:39 AM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM
Advertisement