NDTV India ban
-
ఎల్లుండే నిషేధం.. సుప్రీంకు చానెల్!
ఎన్డీటీవీ ఇండియాపై ఒక రోజు నిషేధం విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆ చానెల్ యాజమాన్యం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాద దాడి సందర్భంగా దేశ రక్షణకు భంగం కలిగించేలా వార్తాప్రసారాలు చేశారని ఆరోపిస్తూ కేంద్రం హిందీ చానెల్ ఎన్డీటీవీపై ఒక రోజు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న (బుధవారం) ఒకరోజుపాటు చానెల్ ప్రసారాలను నిలిపివేయాలని కేంద్రం ఎన్డీటీవీ ఇండియాకు నోటీసులు జారీచేసింది. ఈ నిషేధానికి వ్యతిరేకంగా ఎన్డీటీవీ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు ఆ చానెల్ స్ట్రాటజీ డైరెక్టర్ సుపర్ణ సింగ్ ట్విట్టర్లో తెలిపారు. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి సందర్భంగా ఎన్డీటీవీ దేశ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టిందని, దీనిని ఉగ్రవాదులు ఉపయోగించుకొని ఉండివుంటే దేశభద్రత తీవ్ర పమాదంలో పడి ఉండేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ పేర్కొంది. దేశ భద్రత విషయమై ఓ చానెల్‌పై ఒకరోజు నిషేధం విధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్డీటీవీ యాజమాన్యం, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. -
ప్రెస్ క్లబ్ వద్ద జర్నలిస్టుల ర్యాలీ
హైదరాబాద్: సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్ వద్ద జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. మీడియాపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం జర్నలిస్టులు ప్రెస్‌క్లబ్ వద్ద ర్యాలీ తీశారు. ఈ ర్యాలీ పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఎన్డీటీవీపాటు మరో ప్రాంతీయ ఛానల్‌కు సంబంధించిన ప్రసారాలపై రెండు రోజుల పాటు కేంద్రప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెల్సిందే. -
ఉమ్మడి కమిటీ!
సాక్షి, చెన్నై : ఎన్డీటీవీకి ఒక రోజు నిషేదం సబబే అని కేంద్ర సమాచార, ప్రసారాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు సమర్థించుకున్నారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) వజ్రోత్సవాలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రత్యేక తపాల స్టాంప్‌ను విడుదల చేశారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 75వ వసంతంలోకి అడుగు పెట్టడాన్ని పురస్కరించుకుని రెండు రోజుల పాటు చెన్నై నందంబాక్కం ట్రేడ్ సెంటర్లో వజ్రోత్సవ వేడుకలకు చర్యలు తీసుకున్నారు. ఉదయం జరిగిన వేడుకకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా భవన నిర్మాణ రంగంలో ప్రగతి, నాణ్యత ప్రమాణాల గురించి, నగర, పట్టణీకరణ గురించి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. అలాగే ప్రత్యేక పోస్టల్ కవర్, బీఏపీ ప్లాటినం జూబ్లీ ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను చెన్నై నగర రీజియన్ పోస్టు మాస్టర్ జనరల్ బి.రాధిక చక్రవర్తి చేతుల మీదుగా అందుకున్న వెంకయ్యనాయుడు, వాటిని ఆవిష్కరించారు. ఇక, ఇండియన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి విశేష సేవలు అందించిన లార్సెన్ అండ్ టర్బో మాజీ వైస్ ప్రెసిడెంట్ కేవీ రంగస్వామి సత్కరించుకున్నారు. ఈ వేడుకలో ఆ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు అవినాష్ ఎం పాటిల్ ఉపాధ్యక్షులు (దక్షిణ రీజియన్ ) మోహన్ , చైర్మన్ వెంకటేషన్ , కార్యదర్శి ఎస్ రామ ప్రభులతోపాటు ఆ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో వెంకయ్యనాయుడు మాట్లాడారు.నిషేధం సబబే : భారత ఆర్మీ సాగించిన దాడుల వ్యవహారాలను బట్ట బయలు చేసిన ఎన్డీటీవీని 24 గంటల పాటు నిషేదించడం సబబేనని సమర్థించుకున్నారు. ఆర్మీ వ్యవహారాలను ,చాకచక్యంతో సాగిన దాడులను బయట పెడితే, తీవ్ర వాదులు అప్రమత్తం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. విధి విధానాలను చానళ్లు పాటించాలని సూచించారు. తాము కొత్తగా నిషేధం విధించ లేదని, గతంలో తీసుకున్న నిర్ణయాలను, విధించిన ఆంక్షల మేరకు తాజాగా అమలు చేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయంలోనే ఈ ఆంక్షలు, నిబంధనల రూపకల్పన సాగిందన్న విషయాన్ని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ గుర్తెరగాలని హితవు పలికారు. దేశ భద్రత విషయంలో, ప్రభుత్వ నిబంధనలకు లోబడి వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. -
అందుకోసమే ఎన్డీటీవీని నిషేధించాం!
-
అందుకోసమే ఎన్డీటీవీని నిషేధించాం!
న్యూఢిల్లీ: హిందీ న్యూస్ చానెల్ ఎన్డీటీవీ ఇండియాపై ఒకరోజు నిషేధం విధించడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ చానెల్‌పై నిషేధం విధించినట్టు పేర్కొంది. ‘ దేశ భద్రత, ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొనే ఆ చానెల్‌ను ఒకరోజు ప్రసారాలు నిలిపివేయాల్సిందిగా ఆదేశించాం’ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడి సందర్భంగా దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ప్రసారం చేశారంటూ.. అందుకు శిక్షగా వచ్చే బుధవారం ఒకరోజుపాటు ప్రసారాలు నిలిపివేయాలని ఎన్టీటీవీని కేంద్రం ఆదేశించింది. 2008 ముంబై దాడుల నేపథ్యంలో దేశభద్రతను ఉద్దేశించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇదివరకే ఉన్న నియమనిబంధనలు, సూత్రాల ఆధారంగా తీసుకున్న నిర్ణయమే కానీ, ఇది కొత్తగా తమ ప్రభుత్వం చేపడుతున్న చర్య కాదని వెంకయ్య అన్నారు. ఈ విషయంలో రాజకీయ ప్రేరణతోనే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన తప్పుబట్టారు. కాగా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్టీటీవీ తీవ్రంగా తప్పుబడుతోంది. ఎమర్జెన్సీ తర్వాత మీడియాపై ఇలాంటి ఆంక్షలు విధించడం ఇదే తొలిసారి అని ఎన్డీటీవీ యాజమాన్యం నిరసన తెలిపింది.