అందుకోసమే ఎన్డీటీవీని నిషేధించాం!
అందుకోసమే ఎన్డీటీవీని నిషేధించాం!
Published Sat, Nov 5 2016 3:01 PM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM
న్యూఢిల్లీ: హిందీ న్యూస్ చానెల్ ఎన్డీటీవీ ఇండియాపై ఒకరోజు నిషేధం విధించడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ చానెల్‌పై నిషేధం విధించినట్టు పేర్కొంది. ‘ దేశ భద్రత, ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొనే ఆ చానెల్‌ను ఒకరోజు ప్రసారాలు నిలిపివేయాల్సిందిగా ఆదేశించాం’ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడి సందర్భంగా దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ప్రసారం చేశారంటూ.. అందుకు శిక్షగా వచ్చే బుధవారం ఒకరోజుపాటు ప్రసారాలు నిలిపివేయాలని ఎన్టీటీవీని కేంద్రం ఆదేశించింది.
2008 ముంబై దాడుల నేపథ్యంలో దేశభద్రతను ఉద్దేశించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇదివరకే ఉన్న నియమనిబంధనలు, సూత్రాల ఆధారంగా తీసుకున్న నిర్ణయమే కానీ, ఇది కొత్తగా తమ ప్రభుత్వం చేపడుతున్న చర్య కాదని వెంకయ్య అన్నారు. ఈ విషయంలో రాజకీయ ప్రేరణతోనే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన తప్పుబట్టారు. కాగా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్టీటీవీ తీవ్రంగా తప్పుబడుతోంది. ఎమర్జెన్సీ తర్వాత మీడియాపై ఇలాంటి ఆంక్షలు విధించడం ఇదే తొలిసారి అని ఎన్డీటీవీ యాజమాన్యం నిరసన తెలిపింది.
Advertisement
Advertisement