ఎల్లుండే నిషేధం.. సుప్రీంకు చానెల్!
ఎల్లుండే నిషేధం.. సుప్రీంకు చానెల్!
Published Mon, Nov 7 2016 2:45 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
ఎన్డీటీవీ ఇండియాపై ఒక రోజు నిషేధం విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆ చానెల్ యాజమాన్యం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాద దాడి సందర్భంగా దేశ రక్షణకు భంగం కలిగించేలా వార్తాప్రసారాలు చేశారని ఆరోపిస్తూ కేంద్రం హిందీ చానెల్ ఎన్డీటీవీపై ఒక రోజు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న (బుధవారం) ఒకరోజుపాటు చానెల్ ప్రసారాలను నిలిపివేయాలని కేంద్రం ఎన్డీటీవీ ఇండియాకు నోటీసులు జారీచేసింది.
ఈ నిషేధానికి వ్యతిరేకంగా ఎన్డీటీవీ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు ఆ చానెల్ స్ట్రాటజీ డైరెక్టర్ సుపర్ణ సింగ్ ట్విట్టర్‌లో తెలిపారు. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి సందర్భంగా ఎన్డీటీవీ దేశ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టిందని, దీనిని ఉగ్రవాదులు ఉపయోగించుకొని ఉండివుంటే దేశభద్రత తీవ్ర పమాదంలో పడి ఉండేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ పేర్కొంది. దేశ భద్రత విషయమై ఓ చానెల్‌పై ఒకరోజు నిషేధం విధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్డీటీవీ యాజమాన్యం, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.
Advertisement