కథ కాదు.. కొల్లేరు వ్యథ!
కథ కాదు.. కొల్లేరు వ్యథ!
Published Mon, Nov 14 2016 4:02 PM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM
ఆక్రమణలతో చిక్కిశల్యమైన కొల్లూరు
అక్రమంగా కొనసాగుతున్న చేపల సాగు
జలమార్గం ద్వారా చేప పిల్లల రవాణా
మంత్రి కామినేని పేరు చెప్పి హల్‌చల్
మూడేళ్లకు పెంచిన లీజులు
కొల్లేరమ్మ.. కన్నీరు పెడుతోంది. అక్రమార్కులు చేస్తున్న గాయాలతో చిక్కిశల్యమైన కొల్లేరు తల్లి వ్యథ వర్ణనాతీతంగా మారింది. ఆపరేషన్ కొల్లేరును వెక్కిరిస్తూ ఆక్రమణల పర్వం మళ్లీ కొనసాగుతోంది. కొల్లేరు స్వచ్ఛతకు తూట్లు పొడిచేలా ఇక్కడ వ్యవహారం నడుస్తోంది. అక్రమంగా చేపల చెరువులను సాగు చేస్తున్నా ఎవ్వరికీ పట్టని పరిస్థితి నెలకొంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది.
కైకలూరు : కొల్లేరుకు అక్రమార్కుల చెర వీడడంలేదు. పేదల పేర్లు చెప్పి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. అక్రమంగా చేపల చెరువులు సాగు కొనసాగుతున్నా అటవీశాఖ అడ్డుకునే ధైర్యం చేయడం లేదు. పట్టపగలు అభయారణ్యంలో చెరువుల తవ్వకం, అటవీ అధికారులు సీజ్ చేసిన వాహనాన్ని దౌర్జన్యంగా తీసుకెళ్లడం, ఇష్టారాజ్యంగా వ్యర్థాలు వేయడం ఇటీవల కొల్లేరులో బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
అంతంలేని అక్రమాల పర్వం..
కొల్లేరు అభయారణ్యంలో ధ్వంసం చేసిన చేపల చెరువులతో పాటు ఇటీవల కొత్తగా తవ్విన వందలాది ఎకరాల్లో చేపల సాగు జరుగుతోంది. కైకలూరు మండలం పందిరిపల్లిగూడెంలో 1200 ఎకరాలు, శృంగవరప్పాడులో 1500, గుమ్మళ్లపాడులో 800 ఎకరాల్లో ధ్వంసం చేసిన చెరువుల్లో తిరిగి చేపల సాగుకు సిద్ధమవుతున్నారు. వీటిలో ఇప్పటికే గుమ్మళ్లపాడులో జీరో సైజు చేప పిల్లలను వదిలారు. మండవల్లి మండలం దయ్యంపాడు, చింతపాడు, కొవ్వాడలంక, పెనుమాకలంక, నందిగామలంక, కైకలూరు మండలం వడ్లకూటితిప్ప, పెంచికలమర్రు, చటాకాయి, నత్తగుళ్లపాడు గ్రామాల్లో అభయారణ్యలో సాగు కొనసాగుతోంది. గతంలో జీరో పాయింట్ చేపల సాగు ఏడు నెలలకు పాట పెట్టేవారు. ఇప్పుడు మూడేళ్లకు రూ.కోట్లలో పాట పెట్టారు.
జలమార్గం ద్వారా చేప పిల్లలు..
అక్రమ చెరువుల్లోకి చేప పిల్లల తరలింపునకు కొల్లేరులో జలమార్గాన్ని ఉపయోగిస్తున్నారు. ఆకివీడు, జంగంపాడు రేవుల నుంచి కొట్టాడ, కోటలంక, గుమ్మళ్లపాడు, సింగరాలతోటకు బోట్లలో చేప పిల్లలను తరలిస్తున్నారు. ఇందుకోసం పందిరిపల్లిగూడెం, గుమ్మళ్లపాడు వద్ద 11 పెద్ద బోట్లను సిద్ధం చేశారు. ఒక్కో బోటులో రెండున్నర టన్నుల చేప పిల్లలను తరలించవచ్చు. ఇవేకాకుండా 17 చిన్న బోట్లను సిద్ధం చేసుకున్నారు. రోడ్డు మార్గంలో ఏలూరు నుంచి శృంగవరప్పాడుకు చేప పిల్ల రవాణా అవుతోంది.
మంత్రి పేరు చెప్పి హల్‌చల్..
ఈ నెల 11న సీఎంతో జరిగిన కొల్లేరు సమావేశానికి ఓ చోట నాయకుడు వెళ్లాడు. అక్కడ నుంచి రాగానే ‘కొల్లేరులో ఎక్కడైనా సాగు చేసుకోవచ్చు.. సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కామినేని శ్రీనివాస్ అభయం ఇచ్చారు’ అంటూ నమ్మబలుకుతున్నాడు. అటవీ అధికారులకు ఇదే విషయం చెబుతున్నాడు. గతంలో అటవీ, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేయాలంటూ ఎకరానికి రూ.1500 వసూలు చేసి, స్వాహా చేశాడనే ఆరోపణలు ఆ చోటా నాయకుడిపై ఉన్నాయి. చెప్పగానే పార్టీ సమావేశాలకు లారీల్లో జనాలను తరలిస్తుండడంతో పాలకులు కూడా అతను ఎన్ని తప్పులు చేసినా వదిలేస్తున్నారనే భావన అందరిలో ఉంది. ఇప్పటికే ఆక్రమణలతో చిక్కిశల్యమైన కొల్లేరును కాపాడాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
చేప పిల్ల విడుదలను అడ్డుకుంటాం..
అభయారణ్యంగా గుర్తించిన కొల్లేరులో చేపల సాగు నిషేధం. కొల్లేరు ఆపరేషన్ సమయంలో కొట్టేసిన చేపల చెరువులకు గట్లు ఏర్పాటు చేసుకుని మళ్లీ చేపల సాగుకు సిద్ధమవుతున్నారనే సమాచారం అందింది. సిబ్బందిని ఇప్పటికే గస్తీ పెట్టాం. జంగంపాడు నుంచి చేప పిల్లలు జలమార్గం ద్వారా వచ్చే అవకాశం ఉండటంతో అటవీ శాఖ సిబ్బందిని నియమించాం. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం.
- జి.ఈశ్వరరావు, అటవీశాఖ డెప్యూటి రేంజ్ ఆఫీసరు, కైకలూరు
Advertisement
Advertisement