నీలి చిత్రాలు చూస్తూ పట్టుబడ్డ యువకులు
నీలి చిత్రాలు చూస్తూ పట్టుబడ్డ యువకులు
Published Sun, Oct 2 2016 9:59 AM | Last Updated on Wed, Apr 3 2019 4:43 PM
శ్రీకాకుళం సిటీ : బహిరంగ ప్రదేశాల్లో నీలి చిత్రాలను చూడడం నేరమని, అటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కె.భార్గవరావునాయుడు హెచ్చరించారు. తన కార్యాలయంలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆమదాలవలస మహిళకు సంబంధించిన నీలిచిత్రాలు ఎవరి సెల్‌ఫోన్లలో ఉన్నా తక్షణమే తొలగించాలని సూచించారు. నీలి చిత్రాలను వీక్షించడం, వేరొకరికి బదిలీ చేయడం వంటి పనులు చేయరాదన్నారు. ఆమదాలవలసకు చెందిన నీలి చిత్రాలను వీక్షించడమే కాకుండా నెట్ ద్వారా ఇతరులకు పంపించిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు.
శుక్రవారం రాత్రి ఒంటి గంట సమయంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నలుగురు వ్యక్తులు ఆటోలో కూర్చొని సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాలు చూస్తూ ఒకరి మెుబైల్ నుంచి మరొకరి మెుబైల్‌కు డౌన్‌లోడ్ చేస్తూ పట్టుబడినట్టు చెప్పారు. పట్టుబడిన వారిలో చిన్నబొందిలీపురానికి చెందిన కృష్ణ, మండలవీధికి చెందిన మోహనరావు, ఆదివారంపేటకు చెందిన నాని, తంగివానిపేటకు చెందిన అప్పన్న ఉన్నట్టు తెలిపారు.
వీరిపై ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ –2008 సెక్షన్ 153, 67, 67ఏ ప్రకారం వీరిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. వీరిని కోర్టులో హాజరు పరుస్తామని, సుమారు ఐదేళ్ల వరకు జైలుశిక్షతో పాటు జరిమాన విధించే అవకాశం ఉందన్నారు. సమావేశంలో సీఐలు దాడి మోహనరావు, ఆర్.అప్పలనాయుడు పాల్గొన్నారు.
Advertisement