srikakulam dsp
-
అనారోగ్యమా.. అనుమానాస్పదమా!
సాక్షి, విశాఖ : శ్రీకాకుళం జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పలికెలపాటి కృష్ణ వర్మ (53) మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనారోగ్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని సన్నిహితులు చెబుతుండగా.. అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ షణ్ముఖరావు తెలిపిన వివరాలివి.. బీచ్‌రోడ్డులోని బీచ్ రాయల్ అపార్టుమెంట్లో భార్య నీలిమ, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. నిన్న (శుక్రవారం) ఉదయం 10 గంటలకు ఆయన భార్య నీలిమ చిన్న కుమారుడికి అనారోగ్యంగా ఉండటంతో పెద్ద కుమారుడితో కలిసి ఆస్పత్రికి వెళ్లారు. ఆ సమయంలో కృష్ణ వర్మ ఒక్కరే ఇంట్లో ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తిరిగి వచ్చే సరికి ఆయన మెడకు తీగ చుట్టుకుని బాల్కానీలో విగత జీవిగా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించగా అప్పటికే కృష్ణవర్మ మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. (శ్రీకాకుళం డీఎస్పీ ఆత్మహత్య) అనారోగ్యంతో ఆత్మహత్య?: బాల్కానీలోని తీగపై దుస్తులు ఆరేసే క్రమంలో తీగ మెడకు చుట్టుకుని కృష్ణ వర్మ మరణించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై సన్నిహితుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణ వర్మ కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు సమాచారం. పరిస్థితి విషమించడంతో రెండు నెలలుగా సెలవుపై ఇంట్లోనే ఉంటున్నారు. వైద్యుల వివరణ మేరకు తన ఆరోగ్యం దిగజారుతున్నట్టు భావించిన ఆయన.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. 29 ఏళ్ల సర్వీసుల్లో ఎన్నో పదవులు: కృష్ణ వర్మది విజయనగరం జిల్లా పూసపాటి రేగ. విధుల్లో భాగంగా విశాఖలో నివాసముంటున్నారు. 1991లో సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికైన ఆయన సీఐగా అనకాపల్లి, గాజువాక, త్రీటౌన్, నగర ఏసీబీ స్టేషన్లలో పనిచేశారు. భీమిలి జోన్ ట్రాఫిక్ ఏసీపీగా విధులు నిర్వర్తించారు. భార్య ఏయూలోని వృక్షశాస్త్ర విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేశారు. ఓ కుమారుడు ఇంజినీరింగ్, మరొకరు ఇంటర్ చదువుతున్నారు. కృష్ణవర్మ కుటుంబ సభ్యులను డీఐజీ ఎల్‌కేవీ రంగారావు, శ్రీకాకుళం ఎస్పీ అమ్మిరెడ్డిలు పరామర్మించారు. శనివారం కృష్ణ వర్మ అంత్యక్రియలు నిర్వహించారు. -
శ్రీకాకుళం డీఎస్పీ ఆత్మహత్య
సాక్షి, విశాఖ : అనారోగ్య కారణాలతో ఓ పోలీస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణ వర్మ శుక్రవారం విశాఖ బీచ్ రోడ్డులోని తన నివాసంలో ఉరి వేసుకున్నారు. ఆయనకు ఇటీవలే హార్ట్ ఆపరేషన్ కూడా అయ్యింది. కృష్ణ వర్మ శ్రీకాకుళం జిల్లాలో దాదాపు పదేళ్లపాటు ఎస్ఐగా పని చేశారు. అనంతరం డీఎస్పీగా పదోన్నతి లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఈ ఘటనపై ఎంవీపీ పోలీస్ స్టేషన్ సీఐ షణ్ముఖరావు మాట్లాడుతూ.. ‘కృష్ణవర్మ ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్‌లో డీఎస్పీగా పని చేస్తున్నారు. ఆయన కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం వర్మ మృతి చెందిన సమాచారం అందింది. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. మృతదేహాన్ని కేజీహెచ్ మార్చరీకి తరలించారు. వర్మ ప్రమాదవశాత్తు మృతి చెందారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అనేది పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక తెలుస్తుంది’ అని తెలిపారు. -
సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తం
సాక్షి, సోంపేట: జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ ఎ.వెంకటరత్నం అన్నారు. సోంపేట పట్టణంలో మంగళవారంకేంద్ర బలగాలతో కలిసి కవాతు నిర్వహించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో కేంద్ర బలగాలతో సమావేశమై స్థానిక పరిస్థితులను వివరించారు. జిల్లా ప్రశాంతంగా ఉంటుందని, ఎక్కువ మంది యువత కేంద్ర బలగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. జిల్లాకు చెందిన వారే భారత మావోయిస్టు సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన సంగతిని గుర్తు చేశారు. ఒడిశా సరిహద్దు ప్రాంతం కావడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 1100 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు.. జిల్లాలో 2908 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామని, అందులో 1100 కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు. ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో 12 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని వివరించారు. సారా అక్రమ రవాణా, భారీ మొత్తంలో నగదు సరఫరాను అడ్డుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు బందోబస్తు కావాలని కోరుకుంటే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసాదరావు, కేంద్ర బలగాల కమాండెంట్ ప్రధాన్ చౌహాన్, సీఐ ఎం.తిరుపతిరావు, సోంపేట, మందస ఎస్ఐలు సీహెచ్ దుర్గా ప్రసాద్, నాగరాజు పాల్గొన్నారు. కేంద్ర బలగాల కవాతు శ్రీకాకుళం: నగరంలో కేంద్ర పోలీసు బలగాలు మంగళవారం కవాతు నిర్వహించాయి. ఎస్పీ ఎ.వెంకటరత్నం జెండా ఊపి కవాతును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు నాలుగు కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయని చెప్పారు. కాశీబుగ్గ, పాలకొండ, శ్రీకాకుళంలలో వీటిని ఉంచామని, ఎన్నికలు సజావుగా జరిగేలా వీరు బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. కేంద్ర బలగాలకు నేతృత్వం వహిస్తున్న అధికారులు, సిబ్బందితో మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంత వాతావరణం ఉంటుందని, ప్రజలు సున్నితస్తులని పేర్కొన్నారు. ఇబ్బందులు ఏమైనా ఉంటే నేరుగా ఉన్నతాధికారులకు చెప్పవచ్చన్నారు. పోలీసు కార్యాలయం నుంచి ప్రారంభమైన కవాతు ఏడు రోడ్ల జంక్షన్ వరకు కొనసాగింది. ఏఎస్పీ టి.పనసారెడ్డి, డిఎస్పీ శ్రీనివాసచక్రవర్తి, ప్రసా ద్, సీఐలు మహేష్, ప్రసాద్ పాల్గొన్నారు. -
నీలి చిత్రాలు చూస్తూ పట్టుబడ్డ యువకులు
శ్రీకాకుళం సిటీ : బహిరంగ ప్రదేశాల్లో నీలి చిత్రాలను చూడడం నేరమని, అటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కె.భార్గవరావునాయుడు హెచ్చరించారు. తన కార్యాలయంలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆమదాలవలస మహిళకు సంబంధించిన నీలిచిత్రాలు ఎవరి సెల్ఫోన్లలో ఉన్నా తక్షణమే తొలగించాలని సూచించారు. నీలి చిత్రాలను వీక్షించడం, వేరొకరికి బదిలీ చేయడం వంటి పనులు చేయరాదన్నారు. ఆమదాలవలసకు చెందిన నీలి చిత్రాలను వీక్షించడమే కాకుండా నెట్ ద్వారా ఇతరులకు పంపించిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. శుక్రవారం రాత్రి ఒంటి గంట సమయంలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నలుగురు వ్యక్తులు ఆటోలో కూర్చొని సెల్ఫోన్లో నీలిచిత్రాలు చూస్తూ ఒకరి మెుబైల్ నుంచి మరొకరి మెుబైల్‌కు డౌన్లోడ్ చేస్తూ పట్టుబడినట్టు చెప్పారు. పట్టుబడిన వారిలో చిన్నబొందిలీపురానికి చెందిన కృష్ణ, మండలవీధికి చెందిన మోహనరావు, ఆదివారంపేటకు చెందిన నాని, తంగివానిపేటకు చెందిన అప్పన్న ఉన్నట్టు తెలిపారు. వీరిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ –2008 సెక్షన్ 153, 67, 67ఏ ప్రకారం వీరిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. వీరిని కోర్టులో హాజరు పరుస్తామని, సుమారు ఐదేళ్ల వరకు జైలుశిక్షతో పాటు జరిమాన విధించే అవకాశం ఉందన్నారు. సమావేశంలో సీఐలు దాడి మోహనరావు, ఆర్.అప్పలనాయుడు పాల్గొన్నారు.