
సాక్షి, విశాఖ : శ్రీకాకుళం జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పలికెలపాటి కృష్ణ వర్మ (53) మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనారోగ్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని సన్నిహితులు చెబుతుండగా.. అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ షణ్ముఖరావు తెలిపిన వివరాలివి.. బీచ్‌రోడ్డులోని బీచ్ రాయల్ అపార్టుమెంట్‌లో భార్య నీలిమ, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు.
నిన్న (శుక్రవారం) ఉదయం 10 గంటలకు ఆయన భార్య నీలిమ చిన్న కుమారుడికి అనారోగ్యంగా ఉండటంతో పెద్ద కుమారుడితో కలిసి ఆస్పత్రికి వెళ్లారు. ఆ సమయంలో కృష్ణ వర్మ ఒక్కరే ఇంట్లో ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తిరిగి వచ్చే సరికి ఆయన మెడకు తీగ చుట్టుకుని బాల్కానీలో విగత జీవిగా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించగా అప్పటికే కృష్ణవర్మ మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. (శ్రీకాకుళం డీఎస్పీ ఆత్మహత్య)
అనారోగ్యంతో ఆత్మహత్య?: బాల్కానీలోని తీగపై దుస్తులు ఆరేసే క్రమంలో తీగ మెడకు చుట్టుకుని కృష్ణ వర్మ మరణించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై సన్నిహితుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణ వర్మ కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు సమాచారం. పరిస్థితి విషమించడంతో రెండు నెలలుగా సెలవుపై ఇంట్లోనే ఉంటున్నారు. వైద్యుల వివరణ మేరకు తన ఆరోగ్యం దిగజారుతున్నట్టు భావించిన ఆయన.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.
29 ఏళ్ల సర్వీసుల్లో ఎన్నో పదవులు: కృష్ణ వర్మది విజయనగరం జిల్లా పూసపాటి రేగ. విధుల్లో భాగంగా విశాఖలో నివాసముంటున్నారు. 1991లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికైన ఆయన సీఐగా అనకాపల్లి, గాజువాక, త్రీటౌన్, నగర ఏసీబీ స్టేషన్లలో పనిచేశారు. భీమిలి జోన్ ట్రాఫిక్ ఏసీపీగా విధులు నిర్వర్తించారు. భార్య ఏయూలోని వృక్షశాస్త్ర విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేశారు. ఓ కుమారుడు ఇంజినీరింగ్, మరొకరు ఇంటర్ చదువుతున్నారు. కృష్ణవర్మ కుటుంబ సభ్యులను డీఐజీ ఎల్‌కేవీ రంగారావు, శ్రీకాకుళం ఎస్పీ అమ్మిరెడ్డిలు పరామర్మించారు. శనివారం కృష్ణ వర్మ అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment