Krishna Varma
-
అనారోగ్యమా.. అనుమానాస్పదమా!
సాక్షి, విశాఖ : శ్రీకాకుళం జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పలికెలపాటి కృష్ణ వర్మ (53) మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనారోగ్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని సన్నిహితులు చెబుతుండగా.. అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ షణ్ముఖరావు తెలిపిన వివరాలివి.. బీచ్‌రోడ్డులోని బీచ్ రాయల్ అపార్టుమెంట్లో భార్య నీలిమ, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. నిన్న (శుక్రవారం) ఉదయం 10 గంటలకు ఆయన భార్య నీలిమ చిన్న కుమారుడికి అనారోగ్యంగా ఉండటంతో పెద్ద కుమారుడితో కలిసి ఆస్పత్రికి వెళ్లారు. ఆ సమయంలో కృష్ణ వర్మ ఒక్కరే ఇంట్లో ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తిరిగి వచ్చే సరికి ఆయన మెడకు తీగ చుట్టుకుని బాల్కానీలో విగత జీవిగా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించగా అప్పటికే కృష్ణవర్మ మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. (శ్రీకాకుళం డీఎస్పీ ఆత్మహత్య) అనారోగ్యంతో ఆత్మహత్య?: బాల్కానీలోని తీగపై దుస్తులు ఆరేసే క్రమంలో తీగ మెడకు చుట్టుకుని కృష్ణ వర్మ మరణించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై సన్నిహితుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణ వర్మ కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు సమాచారం. పరిస్థితి విషమించడంతో రెండు నెలలుగా సెలవుపై ఇంట్లోనే ఉంటున్నారు. వైద్యుల వివరణ మేరకు తన ఆరోగ్యం దిగజారుతున్నట్టు భావించిన ఆయన.. మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. 29 ఏళ్ల సర్వీసుల్లో ఎన్నో పదవులు: కృష్ణ వర్మది విజయనగరం జిల్లా పూసపాటి రేగ. విధుల్లో భాగంగా విశాఖలో నివాసముంటున్నారు. 1991లో సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికైన ఆయన సీఐగా అనకాపల్లి, గాజువాక, త్రీటౌన్, నగర ఏసీబీ స్టేషన్లలో పనిచేశారు. భీమిలి జోన్ ట్రాఫిక్ ఏసీపీగా విధులు నిర్వర్తించారు. భార్య ఏయూలోని వృక్షశాస్త్ర విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేశారు. ఓ కుమారుడు ఇంజినీరింగ్, మరొకరు ఇంటర్ చదువుతున్నారు. కృష్ణవర్మ కుటుంబ సభ్యులను డీఐజీ ఎల్‌కేవీ రంగారావు, శ్రీకాకుళం ఎస్పీ అమ్మిరెడ్డిలు పరామర్మించారు. శనివారం కృష్ణ వర్మ అంత్యక్రియలు నిర్వహించారు. -
శ్రీకాకుళం డీఎస్పీ ఆత్మహత్య
సాక్షి, విశాఖ : అనారోగ్య కారణాలతో ఓ పోలీస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణ వర్మ శుక్రవారం విశాఖ బీచ్ రోడ్డులోని తన నివాసంలో ఉరి వేసుకున్నారు. ఆయనకు ఇటీవలే హార్ట్ ఆపరేషన్ కూడా అయ్యింది. కృష్ణ వర్మ శ్రీకాకుళం జిల్లాలో దాదాపు పదేళ్లపాటు ఎస్ఐగా పని చేశారు. అనంతరం డీఎస్పీగా పదోన్నతి లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఈ ఘటనపై ఎంవీపీ పోలీస్ స్టేషన్ సీఐ షణ్ముఖరావు మాట్లాడుతూ.. ‘కృష్ణవర్మ ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్‌లో డీఎస్పీగా పని చేస్తున్నారు. ఆయన కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం వర్మ మృతి చెందిన సమాచారం అందింది. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. మృతదేహాన్ని కేజీహెచ్ మార్చరీకి తరలించారు. వర్మ ప్రమాదవశాత్తు మృతి చెందారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అనేది పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక తెలుస్తుంది’ అని తెలిపారు. -
250 కేజీల గంజాయి స్వాధీనం
ఆరుగురు అరెస్టు, ఇద్దరు పరారీ రోలుగుంట : అక్రమంగా తరలిస్తున్న 250 కిలోల గంజాయిని పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా ఇద్దరు పరారయ్యారు. కొత్తకోట సీఐ పి.వి.కృష్ణవర్మ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎం.కె.పట్నం- బి.బి.పట్నం మధ్యలో పక్షుల చెరువు టర్నింగ్లో శనివారం ఆరుగురు వ్యక్తులు ఎనిమిది గంజాయి బస్తాలతో వాహనం కోసం ఎదురు చూస్తున్నారు. రూట్‌వాచ్ చేస్తున్న పోలీసులు అనుమానంతో వారిని అదుపులోకి తీసుకొని, బస్తాలు పరిశీలించగా గంజాయి బయటపడింది. వారి నుంచి 250 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో రూ. 25 లక్షలుంటుందని అంచనా. పట్టుబడిన వారిలో రావికమతం మండల ం కిత్తంపేటకు చెందిన శేనాపతి పరమేశు, మున్నూరి అప్పారావు, బేతిన రాజారావు, మచ్చా అప్పారావు, రోలుగుంట మండలం బి.బి.పట్నంకు చెందిన మచ్చా అప్పారావు, పోతురాజు ఈశ్వరరావు ఉన్నారు. వారిని అరెస్టు చేసి రిమాండ్ తరలించామని సీఐ పి.వి.కృష్ణవర్మ తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నామన్నారు.