సోంపేట: కేంద్ర బలగాలతో మాట్లాడుతున్న ఎస్పీ వెంకటరత్నం
సాక్షి, సోంపేట: జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ ఎ.వెంకటరత్నం అన్నారు. సోంపేట పట్టణంలో మంగళవారంకేంద్ర బలగాలతో కలిసి కవాతు నిర్వహించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో కేంద్ర బలగాలతో సమావేశమై స్థానిక పరిస్థితులను వివరించారు. జిల్లా ప్రశాంతంగా ఉంటుందని, ఎక్కువ మంది యువత కేంద్ర బలగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. జిల్లాకు చెందిన వారే భారత మావోయిస్టు సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన సంగతిని గుర్తు చేశారు. ఒడిశా సరిహద్దు ప్రాంతం కావడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
1100 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు..
జిల్లాలో 2908 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామని, అందులో 1100 కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు. ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో 12 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని వివరించారు. సారా అక్రమ రవాణా, భారీ మొత్తంలో నగదు సరఫరాను అడ్డుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు బందోబస్తు కావాలని కోరుకుంటే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసాదరావు, కేంద్ర బలగాల కమాండెంట్ ప్రధాన్ చౌహాన్, సీఐ ఎం.తిరుపతిరావు, సోంపేట, మందస ఎస్‌ఐలు సీహెచ్ దుర్గా ప్రసాద్, నాగరాజు పాల్గొన్నారు. కేంద్ర బలగాల కవాతు శ్రీకాకుళం: నగరంలో కేంద్ర పోలీసు బలగాలు మంగళవారం కవాతు నిర్వహించాయి.
ఎస్పీ ఎ.వెంకటరత్నం జెండా ఊపి కవాతును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు నాలుగు కంపెనీల కేంద్ర బలగాలు వచ్చాయని చెప్పారు. కాశీబుగ్గ, పాలకొండ, శ్రీకాకుళంలలో వీటిని ఉంచామని, ఎన్నికలు సజావుగా జరిగేలా వీరు బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. కేంద్ర బలగాలకు నేతృత్వం వహిస్తున్న అధికారులు, సిబ్బందితో మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంత వాతావరణం ఉంటుందని, ప్రజలు సున్నితస్తులని పేర్కొన్నారు. ఇబ్బందులు ఏమైనా ఉంటే నేరుగా ఉన్నతాధికారులకు చెప్పవచ్చన్నారు. పోలీసు కార్యాలయం నుంచి ప్రారంభమైన కవాతు ఏడు రోడ్ల జంక్షన్ వరకు కొనసాగింది. ఏఎస్పీ టి.పనసారెడ్డి, డిఎస్పీ శ్రీనివాసచక్రవర్తి, ప్రసా ద్, సీఐలు మహేష్, ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment