సంతబొమ్మాళి మండలం రెయ్యిపేటలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉపాధ్యాయుడు కూసెట్టి కాంతారావు
సాక్షి, సంతబొమ్మాళి: ప్రతి నెలా ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటూ విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఓ ఉపాధ్యాయుడు అధికార పార్టీ సేవలో తరిస్తున్నాడు. మండలంలోని సంతబొమ్మాళి గ్రామానికి చెందిన కూసెట్టి కాంతారావు అనే ఉపాధ్యాయుడు శివరాంపురం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు అధికార పార్టీ నాయకుడిగా చెలామణి అవుతూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సోమవారం రాత్రి సంతబొమ్మాళి పంచాయతీ జగన్నాథపురం (రెయ్యిపేట), అంట్లవరం గ్రామాల్లో మంత్రి అచ్చెన్నాయుడు తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొని సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు కోరారు. పార్టీ కరపత్రాలను పంచిపెడుతూ టీడీపీని గెలిపించాలని ప్రచారం చేశారు. ఉపాధ్యాయుడి తీరుపై జనం మండిపడుతున్నారు. ఇలాంటి ఉపాధ్యాయుడి వల్ల మొత్తం విద్యావ్యవస్థకు చెడ్డపేరు వస్తోందని పలువురు వ్యాఖ్యానించారు. దీనిపై ఎన్నికల అధికారి స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment