governament employes
-
ఉద్యోగుల కోసం సీఎం జగన్ సాహసోపేత నిర్ణయం
-
ఫిట్మెంట్తో పాటు ఉద్యోగులకు సీఎం జగన్ మరో గుడ్‌న్యూస్
-
ఆ ఊరంతా ప్రభుత్వ ఉద్యోగులే
సాక్షి, కుభీర్(అదిలాబాద్): మండలంలోని రాజురా గ్రామం ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గ్రామంగా ప్రసిద్ధి చెందింది. జుమ్డ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామంగా ఉన్న ఈ కుగ్రామంలో జనాభా 300లు ఉండగా 200 ఓటర్లు, రెండు వార్డులు ఉన్నాయి. గ్రామంలో కేవలం ఎస్సీ, బీసీ వర్గాల ప్రజలు మాత్రమే ఉన్నారు. ఈ గ్రామం మండల కేంద్రమైన కుభీర్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక్కో ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉద్యోగులు ఈ గ్రామంలో ఒక్కో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున ఉద్యోగులు ఉన్నారు. అటెండర్ స్థాయి ఉద్యోగుల నుంచి శాస్త్రవేత్తల వరకు ఉన్నారు. 95 శాతం మంది చదువుకున్న వారే సంతకాలు చేయడం రానివారు కేవలం 5 శాతం ఉంటారు.మొత్తం ఉద్యోగస్తులలో 8 మంది బీసీ వర్గానికి చెందిన వారు కాగా మిగిలిన వారు ఎస్సీ వర్గానికి చెందిన వారు. ఇందులో డాక్టర్లు 7గురు, ఉపాధ్యాయులు 6, ఆర్మీలో 3, ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు 2, ఎస్సైలు 2, సైంటిస్ట్ 2, విజిలెన్న్ అధికారి 1మిగిలిన వారు అటెండర్లు, ఆశ, అంగన్వాడీ, లెక్చరర్లు తదితర ఉద్యోగాలలో ఉన్నారు. చిక్కాల ప్రభు అనే రైతు ముగ్గురు కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. ఒకరు ఎక్సైజ్ ఎస్సై, ఒకరు ఏఅర్ ఎస్సై, మరొకరు తపాళ శాఖలో ఉన్నారు. ఆయన చిన్న కుమారుడు చిక్కాల విజయ్ ముందు కానిస్టేబల్ ఉద్యోగం రాగా అందులో చేరాడు. 6 నెలలు గడవగానే పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం రాగానే కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి అందులో చేరాడు. ఒక నెల రోజులు భైంసా రూరల్ మండలం మిర్జాపూర్‌లో పనిచేశారు. పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు ఏఅర్ ఎస్సై ఉద్యోగం వచ్చింది. రాగానే కార్యదర్శి ఉద్యోగానికి రాజీనామా చేసి ఏఅర్ ఎస్సైగా ఉద్యోగంలో చేరి ప్రస్తుతం అసిఫాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. సంజు అనే వ్యక్తి విజిలెన్స్ అధికారిగా ఉన్నారు.దామోదర్ అనే వ్యక్తి సైంటిస్ట్‌గా ఉన్నారు. మరో వ్యక్తి జి.అనిల్‌కుమార్ వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉన్నారు. గ్రామానికి చెందిన వ్యక్తి ప్రభాకర్ అదనపు కలెక్టర్‌గా ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు.ఈ గ్రామం వ్యవసాయానికి ప్రసిద్ధి చెందింది. పెద్దల స్ఫూర్తితో ఉద్యోగం సాధించాను మా గ్రామంలో నా కంటే ముందు చదివి ఉద్యోగం సాధించిన వయస్సులో పెద్దవారిని స్ఫూర్తిగా తీసుకొని కష్టపడి చదివి ఎక్సైజ్ ఎస్సైగా ఉద్యోగం సాధించాను. -చిక్కాల విలాస్, ఎక్సైజ్ ఎస్సై మంచిర్యాల రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లేవాడిని కష్టపడి చదివి ఉద్యోగం పొందాను. మా గ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లి 10వ తరగతి వరకు పూర్తి చేశాను. మా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. బురదలో నడిచి వెళ్తూ రెండు వాగులు దాటి కష్టపడి చదివి ఉద్యోగం సాధించాను. -జి.అనిల్‌కుమార్ వ్యవసాయ శాస్త్రవేత్త, ఆదిలాబాద్ రాజురా గ్రామం. -
బదిలీల ఫీవర్
జిల్లాలో కొందరు అధికారులు, ఉద్యోగులకు బదిలీల జ్వరం పట్టుకుంది. గత టీడీపీ ప్రభుత్వంలో కీలకశాఖల్లో ఉండి టీడీపీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పనిచేసిన అధికారులు, ఉద్యోగులు మాత్రం బదిలీలు తప్పవని భావించి ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు కీలకశాఖ అధికారులు మాత్రం బదిలీల ఆందోళనలతో అధికారపార్టీ ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు దారులు వెతుకుతున్నారు. ప్రజాప్రతినిధుల సన్నిహితుల ద్వారా బదిలీలు నిలుపుకొనేందుకు ప్రయత్నాలు మమ్మురం చేశారు. అధికారులు, ఉద్యోగుల బదిలీలు కూడా పారదర్శకంగా చేయాలని, అవినీతి అధికారులకు స్థానచలనం తప్పదన్న సంకేతాలు ప్రభుత్వం నుంచి రావడంతో బదిలీల ప్రక్రియపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించనున్నారు. సాక్షి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. జిల్లాలో కూడా నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ పరిధిలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మంత్రి వర్గ విస్తరణలో కూడా జిల్లాకు చెందిన ఇద్దరు యువ ఎమ్మెల్యేలకు కీలక శాఖలు ఇచ్చారు. ఇప్పుడిప్పుడే కొత్త ప్రభుత్వం తనదైన మార్క్ పాలన సాగుతోంది. ఈ క్రమంలో జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును సమర్థవంతంగా చేసేందుకు కొత్త అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో అప్పటి అధికారపార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పాలన సాగించిన అధికార యంత్రాంగాన్ని బదిలీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రాధాన్యత లేని పోస్టుల్లో గడిపిన వారికి ప్రాధాన్యత ఉన్న పోస్టులు కేటాయించే అవకాశం ఉంది. కీలక శాఖల అధికారుల మార్పు జిల్లాలో పాలనా పరమైన విషయాల్లో కీలకంగా ఉండే పలు కీలక శాఖల అధికారులు, ఉద్యోగులను బదిలీలు చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, పురపాలక, నుడా, మైనింగ్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, జిల్లా పరిషత్ తదితర శాఖల్లో బదిలీలు జరుగుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ముందుగా గత ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉండి వన్‌సైడ్ పాలన సాగించిన అధికారులు, ఉద్యోగుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. నెల్లూరుఅర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా)పై తొలి వేటు పడనుంది. ఈ వారంలోనే నుడా వైస్ చైర్మన్‌తోపాటు కీలక పదవుల్లో ఉన్న అధికారులపై బదిలీ వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. గత రెండేళ్లలో నుడాలో భారీ అవినీతి చోటుచేసుకుంది. నుడా పాలకవర్గం చేతిలో కీలుబొమ్మల్లా మారిన అధికారులు అవినీతి, అక్రమాలకు రాచబాట వేశారు. దీంతో తొలి విడతలోనే వారిని పంపే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే నెల్లూరు నగరపాలక సంస్థతోపాటు పలు పురపాలక సంఘాల్లో కూడా బదిలీలపై దృష్టి సారించారు. గత ప్రభుత్వంలో మంత్రి నారాయణ సారథ్యంలో ఆయన కనుసన్నల్లో పనిచేసిన అధికారుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు చెప్పినట్లుగా అడ్డదిడ్డంగా పనులు చేసిన వారిని కూడా పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక మైనింగ్ శాఖలో తొలివేటు పడింది. టీడీపీ హయాంతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమెహన్రెడ్డికి తొత్తులా వ్యవహరించి సిలికా అక్రమ రవాణాకు రాచబాట వేయడమే కాక ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడిచిన మైనింగ్ ఏడీ రాజశేఖర్‌ను కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఐదేళ్ల టీడీపీ హయాంలో మైనింగ్ శాఖలో అక్రమాలు కోకొల్లలుగా జరిగినట్లు గుర్తించారు. రెవెన్యూ విభాగంలో కూడా బదిలీల ప్రక్రియ తప్పనిసరిగా ఉంటుంది. గత ప్రభుత్వ పెద్దలు జిల్లాలో తమకు అనుకూలంగా పనిచేసిన జిల్లాస్థాయి, డివిజన్‌స్థాయి అధికారులను బదిలీలపై రప్పించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిని కొనసాగిస్తే మాత్రం టీడీపీ పెద్దలతో వారికున్న సన్నిహితం, పరిచయాల వల్ల పాలనా పరమైన విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ క్రమంలో వారిని బదిలీ చేసి కొత్త టీంను ఏర్పాటు చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ పోలీసులు జిల్లాలో పోలీస్‌శాఖలో భారీ మార్పులు ఉండబోతున్నాయన్న సంకేతాలు రావడంతో డివిజన్, సర్కిల్‌స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ ప్రజాప్రతినిధులకు తొత్తుల్లా పనిచేయడమేకాక, పచ్చచొక్కా తొడిగిన పోలీసులకు మాత్రం బదిలీలు తప్పనిసరిగా ఉంటాయనే ప్రచారం ఉంది. దీంతో ప్రస్తుత అధికారపార్టీ చోటా, మోటా నేతలతో సంబంధాలు ఉన్న పోలీసులకు మాత్రం మరొకచోటికి స్థాన చలనం జరిగినా చాలన్నట్లుగా ప్రయత్నాలు మమ్మురం చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు షాడో ఎస్పీగా చెలామణి అవుతున్న అధికారి కనుసన్నల్లో సీఐల బదిలీలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల సమయంలో అధికారపార్టీ నేతలకు కొమ్ము కాసే అధికార యంత్రాంగాన్ని ఏరికోరి జిల్లాకు రప్పించి పోస్టింగ్‌లు ఇచ్చారు. అధికారం మార్పు రాగానే టీడీపీ పచ్చచొక్కా తొడిగిన పోలీస్ అధికారులు కూడా ప్రాధాన్యత లేని పోస్టుల్లో కూడా కేవలం స్థాన చలనం చేసి మరొకచోటికి పంపితే వన్‌సైడ్‌గా చేస్తామన్నట్లుగా ప్రజాప్రతినిధుల వద్ద మంత్రాంగంనడుపుతున్నారు. అయితే ప్రస్తుత ప్రజాప్రతినిధులు మాత్రం బదిలీల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. బదిలీల విషయంలో జాగ్రత్త వహించకుంటే ప్రభుత్వానికే చెడ్డపేరు వచ్చే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యేలు పలు జాగ్రతలు తీసుకుంటున్నారు. -
ఉద్యోగులకు భరోసా..సీపీఎస్ రద్దు
సాక్షి, శ్రీకాకుళం అర్బన్: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిధిలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. సీపీఎస్ విధానం రద్దు చేయాలని ఇటు కేంద్రప్రభుత్వానికి, అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొత్తుకున్నా వినే వారే కరువయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యో గ, ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి జేఏసీగా ఏర్పడి రాజధాని అమరావతిలో పోరాటాన్ని తీవ్రతరం చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి కమిటీ వేసి చేతులు దులుపుకొంది. ఈ తరుణంలో ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట ఆశాకిరణంలా కనిపించారు. సీపీఎస్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా క్షుణ్ణంగా తెలుసుకుని వాటిపై అవగాహన ఏర్పరచుకున్నారు. ప్రజాసంకల్ప పాదయాత్ర శ్రీకా కుళం జిల్లాలో అడుగుపెట్టిన తర్వాత పలు చోట్ల సీపీఎస్ ఉద్యోగులు కలసి వారి సమస్యలను వినతిపత్రం రూపంలో అందజేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ రద్దు కోసం కృషి చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ ప్రకటన ఉద్యోగ వర్గాల్లో కొండంత మనోధైర్యం నింపింది. చెల్లింపుల్లో అక్రమాలు..! సీపీఎస్ విధానాన్ని పీఎఫ్ఆర్డీఏ(పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ), ఎన్ఎస్డీఎల్(నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్) సమన్వయంతో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నాయి. ఉద్యోగుల మూలవేతనం, కరువు భత్యంలో పింఛన్ కోసం మినహాయించిన 10శాతం మొత్తానికి సమానంగా ప్రభుత్వం అంతే మొత్తాన్ని మ్యాచింగ్ గ్రాంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానంలో చెల్లింపులు సక్రమంగా జరగడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రయివేట్ ఫండింగ్ ఏజెన్సీ ద్వారా షేర్ మార్కెట్లో పెట్టి లాభాల ఆధారంగా పింఛన్ అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. నష్టాలు వస్తే పింఛన్ ఎలా ఇస్తారన్న దానిపై స్పష్టత లేదు. జిల్లాలో 2004 తర్వాత సీపీఎస్ విధానంలో 10,600 మంది ఉపాధ్యాయ, ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 6వేల మంది ఉపాధ్యాయులు ఉండగా 4,600 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరి భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందన్న ఆందోళనలతో 12 ఏళ్ల తర్వాత సీపీఎస్ ఉద్యోగుల సంఘంగా ఏర్పడి నిరసనలు, దీక్షలు నిర్వహించారు. వీరికి సంఘీభావం తెలియజేస్తూ పలు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆం దోళన బాట పట్టాయి. నష్టమే ఎక్కువ.. సీపీఎస్ కారణంగా.. ఉద్యోగి పదవీవిరమణ పొందిన తర్వాత సామాజిక భద్రత ఉండదు. పింఛన్లో కొంత భాగాన్ని కమ్యూటేషన్ చేసుకునే సదుపాయం ఉండదు. ఉద్యోగులు సర్వీసులో మరణిస్తే కారుణ్య నియామకంతో పాటు కుటుంబానికి పింఛన్ ఇచ్చే సదుపాయం ఉండదు. రద్దు కోరుతూ పోరుబాట సీపీఎస్ విధానం రద్దు కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. ఎప్పటికప్పుడు దీక్షలు, ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు చేస్తున్న న్యాయమైన పోరాటాలను రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం అణచివేత ధోరణికి పాల్పడింది. సీపీఎస్ రద్దు కోరుతూ గత ఏడాది ఆగస్టులో ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి ఉద్యోగ, ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపుతూ వారిని ఎక్కడికక్కడే అరెస్ట్‌లు చేయించి పోలీస్‌స్టేషన్‌కు తరలించడం, ముందస్తు హౌస్ అరెస్ట్‌లు, గృహనిర్భందాలకు పాల్పడింది. గత ఏడాది అక్టోబరు 2న ఆమరణ నిరాహార దీక్షకు దిగిన 26 మంది సీపీఎస్ ఉద్యోగులపై కేసులు బనాయించారు. వారిలో జిల్లాకు చెందిన వారు ఎనిమిది మంది ఉన్నారు. వీరంతా ప్రస్తుతం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. ‘టక్కర్ కమిటీ’తో కాలయాపన.. సీపీఎస్ రద్దు పోరాటం ఉద్ధృతం కావడంతో గత్యంతరం లేని స్థితిలో మూడు నెలల వ్యవధిలో నివేదిక ఇవ్వాలనే నిబంధనతో మాజీ సీఎస్ టక్కర్ అధ్యక్షతన చంద్రబాబు ప్రభుత్వం ‘టక్కర్ కమిటీ’ వేసింది. ఈ కమిటీపై ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిటీలు కేవలం కాలయాపనకే తప్ప ప్రయోజనం శూన్యమని ధ్వజమెత్తుతున్నారు. చివరి క్యాబినెట్ సమావేశానికి మూడు రోజుల ముందే టక్కర్ కమిటీ నివేదిక ఇచ్చినా దానిని ప్రభుత్వం బహిర్గతం చేయకపోవడం గమనార్హం. టక్కర్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని, చివరి క్యాబినెట్లో సీపీఎస్ రద్దు చేయాలని సీపీఎస్ ఉద్యోగులు ఎంతగా డిమాండ్ చేసినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులంతా బాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అంశం పాత ఫింఛన్ విధానం సీపీఎస్ విధానం 1. కమ్యూటేషన్ 40శాతం ఉండదు 2. డెత్ పెన్షన్ సౌకర్యం కుటుంబ పెన్షన్ ఉండదు 3. నెలవారీ పెన్షన్ 50శాతం బేసిక్ పే ఉండదు 4. పదవీవిరమణ డీఏ ఇస్తారు ఉండదు 5. పీఎఫ్ అర్హత ఉంటుంది. ఉండదు 6. పీఎఫ్ లోన్ ఉంటుంది. ఉండదు 7. హెల్త్‌కార్డు ఉంటుంది. ఉండదు 8. పెన్షన్ గ్యారెంటీ ఉంటుంది ఉండదు 9. పెన్షన్ డిసైడ్ బై ప్రభుత్వం పీఎఫ్ ఆర్డీఏ, షేర్‌మార్కెట్ -
ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగి
సాక్షి, సంతబొమ్మాళి: ప్రతి నెలా ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుంటూ విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఓ ఉపాధ్యాయుడు అధికార పార్టీ సేవలో తరిస్తున్నాడు. మండలంలోని సంతబొమ్మాళి గ్రామానికి చెందిన కూసెట్టి కాంతారావు అనే ఉపాధ్యాయుడు శివరాంపురం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు అధికార పార్టీ నాయకుడిగా చెలామణి అవుతూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సోమవారం రాత్రి సంతబొమ్మాళి పంచాయతీ జగన్నాథపురం (రెయ్యిపేట), అంట్లవరం గ్రామాల్లో మంత్రి అచ్చెన్నాయుడు తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొని సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు కోరారు. పార్టీ కరపత్రాలను పంచిపెడుతూ టీడీపీని గెలిపించాలని ప్రచారం చేశారు. ఉపాధ్యాయుడి తీరుపై జనం మండిపడుతున్నారు. ఇలాంటి ఉపాధ్యాయుడి వల్ల మొత్తం విద్యావ్యవస్థకు చెడ్డపేరు వస్తోందని పలువురు వ్యాఖ్యానించారు. దీనిపై ఎన్నికల అధికారి స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
‘ఉపాధి’ సిబ్బంది సమ్మె బాట
సంతమాగులూరు: సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ శాఖల ప్రభుత్వోద్యోగులు ఒక్కొక్కరుగా సమ్మె బాట పడుతున్నారు. ఇప్పటికే వెలుగు సిబ్బంది తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రోడ్డెక్కారు. దీంతో వెలుగు కార్యాలయాల్లో పనులన్నీ ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. వారి బాటలోనే ఉపాధి హామీ సిబ్బందీ నడవనున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూజనవరి 2వ తేదీ నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. జిల్లాలో 1500 మందికిపైగా సమ్మెలో పాల్గొననున్నట్లు జిల్లా ఉపాధి హామీ జేఏసీ చైర్మన్ కె.లక్ష్మి తెలిపారు. సమ్మె విజయవంతం చేసేందుకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధి సిబ్బంది ఆయా ఎంపీడీవోలకు సమ్మె నోటీసులు కూడా ఇచ్చారన్నారు. పదేళ్ల నుంచి పోరాటం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే సిబ్బంది రాత్రిపగళ్లు తేడా లేకుండా కష్టపడుతున్నా వారి కష్టానికి తగ్గ ఫలితం మాత్రం లేదు. పదేళ్ల నుంచి జీతాలు పెంచాలంటూ ధర్నాలు చేస్తున్నా, ఆందోళనలు చేపడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని వారు వాపోతున్నారు. ఈనెల 10న గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారాలోకేష్ ను కలిసి సమస్యను విన్నవించుకున్నా ఇంత వరకు పట్టించుకునే వారే లేరని దీంతో సమ్మె బాట పట్టాల్సి వస్తోందని వారు తెలిపారు. 2016 పీఆర్సీని అనుసరించి కేడర్ వారీగా జీతాలు పెంచాలని కోరుతున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే... ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని, సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం ఇస్తూ సీనియారిటీ ప్రతిపాదికను 2016 పీఆర్సీ అనుసరించి టైం స్కేల్ అమలు చేసి జీతాలు పెంచాలని వారు ప్రధానంగా కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో పాల్గొనేందుకు ఉపాధి సిబ్బంది సంసిద్ధులవుతున్నారు. జీతాలు పెంచకపోతే కుటుంబ పోషణ గడవాలన్నా కష్టతరంగా ఉందని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మేల్కొనాలని కోరుతున్నారు. ఎన్నికల కోడ్ వస్తే మా పరిస్థితి ఏంటి: ఏళ్ల తరబడి జీతాలు పెంచాలని కోరుతున్నా పట్టించుకోకపోవటంతో పాటు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశాలు ఉన్నందున ఈలోపు సమస్యలు పరిష్కరించకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంటుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉపాధి సిబ్బంది సమస్యలపై దృష్టి సారించాలని కోరుతున్నారు. ఎన్నికల కోడ్ వస్తే మళ్లీ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం వచ్చిందాకా ఎదురు చూడాల్సిందేనా అని వారు లబోదిబోమంటున్నారు. ఆందోళనలు ఉధృతం చేస్తాం ప్రభుత్వం దిగి వచ్చి సమ్మెలో పాల్గొనే లోపే మా డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాం. ఏళ్ల తరబడి వెట్టిచాకిరీ చేయిస్తున్నారే తప్ప ప్రభుత్వం నుంచి లబ్ధి పొందింది మాత్రం శూన్యం. జిల్లాలో ఉపాధి హామీ సిబ్బంది విధులు కష్టతరంగా ఉన్నా పని చేస్తున్నారు. ఆ కష్టాన్ని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – కె.లక్ష్మి జిల్లా ఉపాధి హామీ జేఏసీ చైర్మన్ -
మసబ్‌ట్యాంక్ టీయూఎఫ్ఐడీసీలో ఏసీబీ దాడులు
-
ఏసీబీ వలలో టీయూఎఫ్ఐడీసీ ఇంజనీర్
హైదరాబాద్ : తెలంగాణ పట్టణ మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీయూఎఫ్ఐడీసీ) ఇంజనీర్‌గా పనిచేస్తోన్న ప్రవీణ్ చంద్రను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. కాంట్రాక్టర్‌కు రావలసిన నిధుల విడుదలకు లంచం వసూలు చేసినందుకు గానూ అదుపులోకి తీసుకున్నారు. వనపర్తిలో కాంట్రాక్టర్ కాంతారెడ్డి 2008 సంవత్సరంలో రూ.14.32 కోట్ల విలువైన సీసీ రోడ్లు, మురుగునీటి పారుదల పనులను ప్రారంభించి 2010లో పూర్తి చేశారు. ఆ పనులకు సంబంధించి రూ.13 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అందులో రూ.1.32 కోట్లు సాంకేతిక కారణాలతో ఆగిపోయాయి. ఆయన మరోసారి అభ్యర్థించగా మేలో నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వాటి విడుదల అధికారం ప్రవీణ్ చంద్రకు ఉంది. తనకు రూ.10 లక్షలు లంచం ఇస్తేనే నిధులు వస్తాయంటూ మెలిక పెట్టారు. రూ.3 లక్షలు ఇవ్వగలనని కాంట్రాక్టర్ బేరమాడి సమాచారాన్ని ఏసీబీ అధికారులకు తెలిపారు. ఫోన్ చేసి రూ.2 లక్షలు ఇస్తానని, నిధులు విడుదలైన తర్వాత మరో లక్ష ఇస్తానని కాంట్రాక్టర్, ఇంజనీర్‌కు చెప్పారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు రూ.2 లక్షలు తీసుకుని మాసాబ్ ట్యాంక్‌కు వెళ్లారు. ఆ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ప్రవీణ్ చంద్రను అక్కడికక్కడే పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు మసాబ్ ట్యాంక్‌లోని ప్రవీణ్ కార్యాలయంలో దాడులు కొనసాగిస్తున్నారు. -
తిన్న సొమ్మును కక్కించరా...?
ఆసరా లబ్ధిదారులుగా ప్రభుత్వోద్యోగుల కుటుంబీకులు 2932 మందిగా గుర్తింపు రూ.4కోట్లపైనే సొమ్ము వారి జేబుల్లోకి... రికవరీ చేయడంపై అధికారుల ఉదాసీనత మెట్పల్లి: దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారిని ఆదుకునేందుకు చేపట్టిన ‘ఆసరా’ పథకంలో అవకతవకలు చోటుచేసుకున్నాయి. జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో వేలా సంఖ్యలో అనర్హులు లబ్ధిదారులుగా ఎంపికై పింఛన్ తీసుకుంటున్నారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబసభ్యులూ ఉన్నారు. ఉద్యోగులకు అందజేసిన ఆరోగ్య కార్డుల్లో పొందుపర్చిన వివరాల ఆధారంగా జిల్లాలో 2,932 మంది ఉద్యోగుల కుటుంబసభ్యులు ఉన్నట్లు తేలింది. దీంతో ఆ పింఛన్లను రద్దు చేసిన అధికారులు...తిన్న సొమ్మును మాత్రం రికవరీ చేయడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 నవంబర్ నుంచి ఆసరా పింఛన్లు అందిస్తోంది. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు కలుపుకుని మొత్తం 5,48,171 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా ప్రభుత్వం రూ.58.59కోట్లు చెల్లిస్తోంది. ఇందులో వికలాంగులకు రూ.1500, మిగతా వారికి రూ.1000 చొప్పున అందిస్తోంది. నిబంధనల ప్రకారం దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారే ఈ పింఛన్లు పొందడానికి అర్హులు. అయితే జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబసభ్యులు సైతం లబ్ధిదారులుగా ఉన్నారు. గుట్టురట్టు చేసిన ఆధార్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య సేవలందించడానికి ప్రభుత్వం హెల్త్‌కార్డులు జారీచేసింది. ఈ కార్డుల్లో ఉన్న వారి ఆధార్ నంబర్లను డీఆర్డీఏ అధికారులు ఆసరా జాబితాకు అనుసంధానం చేశారు. దీంతో జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు పొందుతున్న 2,932మంది ఉద్యోగుల కుటుంబీకులను గుర్తించి వాటిని నిలిపివేశారు. నెలకు రూ.30లక్షల పైనే... ఆసరా పథకం ప్రారంభం నుంచి ఈ ఏడాది జూలై వరకు ఉద్యోగుల కుటుంబీకులకు పింఛన్ సొమ్ము చెల్లించినట్లు తెలిసింది. గుర్తింపు ప్రక్రియను గత ఏప్రిల్ నుంచి మొదలుపెట్టిన అధికారులు... ఇప్పటివరకు రూ.1000 పింఛన్ తీసుకుంటున్న వారు 2602 మంది, రూ.1500 పింఛన్ పొందుతున్న వారు 330 మంది ఉన్నట్లు తేల్చారు. ప్రతి నెలా రూ.30.97లక్షల చొప్పున ఇంతవరకు రూ.4కోట్లకు పైగా సొమ్మును వారికి అందించినట్లు సమాచారం. అధికారుల నిర్లక్ష్యం... అసరా పింఛన్లు తీసుకుంటున్న ఉద్యోగుల కుటుంబీకులను గుర్తించి నిలిపివేసిన అధికారులు.. వారినుంచి సొమ్మును రికవరీ చేయడంలో జాప్యం ప్రదర్శిస్తున్నారు. ఇతర జిల్లాల్లో అధికారులు సంబంధిత ఉద్యోగులకు నోటీసులు జారీచేసి అందుకున్న సొమ్ము మొత్తాన్ని తిరిగి ప్రభుత్వ ఖాతాకు జమ చేయిస్తున్నారు. ఇక్కడి ఉన్నతాధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఒక్క మెట్పల్లి మున్సిపాలిటీలోనే 152 మందిని గుర్తించారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు లేకపోవడంతో వారినుంచి సొమ్మును రికవరీ చేయడం లేదని కమిషనర్ నర్సయ్య పేర్కొనడం గమనార్హం. రికవరీ చేస్తాం –అరుణశ్రీ, డీఆర్డీఏ పీడీ జిల్లావ్యాప్తంగా ఆసరా పింఛన్లు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబీకులను గుర్తించాం. ఇతర ప్రభుత్వ పథకాల అమలుపై దృష్టి సారించడంతో రికవరీలో జాప్యం ఏర్పడింది. తొందరలోనే ఎంపీడీవోలు, కమిషనర్ల ద్వారా ఉద్యోగులకు నోటీసులు జారీ చేస్తాం. అవసరమైతే అన్ని శాఖల జిల్లా ఉన్నతాధికారులకు సంబంధిత ఉద్యోగుల వివరాలు అందించి వారి ద్వారా సొమ్మును రికవరీ చేయిస్తాం.