తిన్న సొమ్మును కక్కించరా...?
-
ఆసరా లబ్ధిదారులుగా ప్రభుత్వోద్యోగుల కుటుంబీకులు
-
2932 మందిగా గుర్తింపు
-
రూ.4కోట్లపైనే సొమ్ము వారి జేబుల్లోకి...
-
రికవరీ చేయడంపై అధికారుల ఉదాసీనత
మెట్‌పల్లి: దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారిని ఆదుకునేందుకు చేపట్టిన ‘ఆసరా’ పథకంలో అవకతవకలు చోటుచేసుకున్నాయి. జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో వేలా సంఖ్యలో అనర్హులు లబ్ధిదారులుగా ఎంపికై పింఛన్ తీసుకుంటున్నారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబసభ్యులూ ఉన్నారు. ఉద్యోగులకు అందజేసిన ఆరోగ్య కార్డుల్లో పొందుపర్చిన వివరాల ఆధారంగా జిల్లాలో 2,932 మంది ఉద్యోగుల కుటుంబసభ్యులు ఉన్నట్లు తేలింది. దీంతో ఆ పింఛన్లను రద్దు చేసిన అధికారులు...తిన్న సొమ్మును మాత్రం రికవరీ చేయడం లేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2014 నవంబర్ నుంచి ఆసరా పింఛన్లు అందిస్తోంది. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు కలుపుకుని మొత్తం 5,48,171 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా ప్రభుత్వం రూ.58.59కోట్లు చెల్లిస్తోంది. ఇందులో వికలాంగులకు రూ.1500, మిగతా వారికి రూ.1000 చొప్పున అందిస్తోంది. నిబంధనల ప్రకారం దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారే ఈ పింఛన్‌లు పొందడానికి అర్హులు. అయితే జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబసభ్యులు సైతం లబ్ధిదారులుగా ఉన్నారు.
గుట్టురట్టు చేసిన ఆధార్
ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్య సేవలందించడానికి ప్రభుత్వం హెల్త్‌కార్డులు జారీచేసింది. ఈ కార్డుల్లో ఉన్న వారి ఆధార్ నంబర్లను డీఆర్డీఏ అధికారులు ఆసరా జాబితాకు అనుసంధానం చేశారు. దీంతో జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు పొందుతున్న 2,932మంది ఉద్యోగుల కుటుంబీకులను గుర్తించి వాటిని నిలిపివేశారు.
నెలకు రూ.30లక్షల పైనే...
ఆసరా పథకం ప్రారంభం నుంచి ఈ ఏడాది జూలై వరకు ఉద్యోగుల కుటుంబీకులకు పింఛన్ సొమ్ము చెల్లించినట్లు తెలిసింది. గుర్తింపు ప్రక్రియను గత ఏప్రిల్ నుంచి మొదలుపెట్టిన అధికారులు... ఇప్పటివరకు రూ.1000 పింఛన్ తీసుకుంటున్న వారు 2602 మంది, రూ.1500 పింఛన్ పొందుతున్న వారు 330 మంది ఉన్నట్లు తేల్చారు. ప్రతి నెలా రూ.30.97లక్షల చొప్పున ఇంతవరకు రూ.4కోట్లకు పైగా సొమ్మును వారికి అందించినట్లు సమాచారం.
అధికారుల నిర్లక్ష్యం...
అసరా పింఛన్లు తీసుకుంటున్న ఉద్యోగుల కుటుంబీకులను గుర్తించి నిలిపివేసిన అధికారులు.. వారినుంచి సొమ్మును రికవరీ చేయడంలో జాప్యం ప్రదర్శిస్తున్నారు. ఇతర జిల్లాల్లో అధికారులు సంబంధిత ఉద్యోగులకు నోటీసులు జారీచేసి అందుకున్న సొమ్ము మొత్తాన్ని తిరిగి ప్రభుత్వ ఖాతాకు జమ చేయిస్తున్నారు. ఇక్కడి ఉన్నతాధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఒక్క మెట్‌పల్లి మున్సిపాలిటీలోనే 152 మందిని గుర్తించారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు లేకపోవడంతో వారినుంచి సొమ్మును రికవరీ చేయడం లేదని కమిషనర్ నర్సయ్య పేర్కొనడం గమనార్హం.
రికవరీ చేస్తాం
–అరుణశ్రీ, డీఆర్‌డీఏ పీడీ
జిల్లావ్యాప్తంగా ఆసరా పింఛన్లు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబీకులను గుర్తించాం. ఇతర ప్రభుత్వ పథకాల అమలుపై దృష్టి సారించడంతో రికవరీలో జాప్యం ఏర్పడింది. తొందరలోనే ఎంపీడీవోలు, కమిషనర్‌ల ద్వారా ఉద్యోగులకు నోటీసులు జారీ చేస్తాం. అవసరమైతే అన్ని శాఖల జిల్లా ఉన్నతాధికారులకు సంబంధిత ఉద్యోగుల వివరాలు అందించి వారి ద్వారా సొమ్మును రికవరీ చేయిస్తాం.