ఉద్యోగులకు భరోసా..సీపీఎస్‌ రద్దు | Employees Are Fight To Cancel The CPS | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు భరోసా..సీపీఎస్‌ రద్దు

Published Thu, Mar 21 2019 9:59 AM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM

Employees Are Fight To Cancel The CPS - Sakshi

సాక్షి, శ్రీకాకుళం అర్బన్‌: కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ పరిధిలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని ఇటు కేంద్రప్రభుత్వానికి, అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొత్తుకున్నా వినే వారే కరువయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యో గ, ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి జేఏసీగా ఏర్పడి రాజధాని అమరావతిలో పోరాటాన్ని తీవ్రతరం చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి కమిటీ వేసి చేతులు దులుపుకొంది. ఈ తరుణంలో ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట ఆశాకిరణంలా కనిపించారు. సీపీఎస్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా క్షుణ్ణంగా తెలుసుకుని వాటిపై అవగాహన ఏర్పరచుకున్నారు. ప్రజాసంకల్ప పాదయాత్ర శ్రీకా కుళం జిల్లాలో అడుగుపెట్టిన తర్వాత పలు చోట్ల సీపీఎస్‌ ఉద్యోగులు కలసి వారి సమస్యలను వినతిపత్రం రూపంలో అందజేశారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ రద్దు కోసం కృషి చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ ప్రకటన ఉద్యోగ వర్గాల్లో కొండంత మనోధైర్యం నింపింది. 


చెల్లింపుల్లో అక్రమాలు..!
సీపీఎస్‌ విధానాన్ని పీఎఫ్‌ఆర్‌డీఏ(పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ), ఎన్‌ఎస్‌డీఎల్‌(నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ లిమిటెడ్‌) సమన్వయంతో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నాయి. ఉద్యోగుల మూలవేతనం, కరువు భత్యంలో పింఛన్‌ కోసం మినహాయించిన 10శాతం మొత్తానికి సమానంగా ప్రభుత్వం అంతే మొత్తాన్ని మ్యాచింగ్‌ గ్రాంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానంలో చెల్లింపులు సక్రమంగా జరగడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రయివేట్‌ ఫండింగ్‌ ఏజెన్సీ ద్వారా షేర్‌ మార్కెట్‌లో పెట్టి లాభాల ఆధారంగా పింఛన్‌ అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. నష్టాలు వస్తే పింఛన్‌ ఎలా ఇస్తారన్న దానిపై స్పష్టత లేదు. జిల్లాలో 2004 తర్వాత సీపీఎస్‌ విధానంలో 10,600 మంది ఉపాధ్యాయ, ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 6వేల మంది ఉపాధ్యాయులు ఉండగా 4,600 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరి భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారుతుందన్న ఆందోళనలతో 12 ఏళ్ల తర్వాత సీపీఎస్‌ ఉద్యోగుల సంఘంగా ఏర్పడి నిరసనలు, దీక్షలు నిర్వహించారు. వీరికి సంఘీభావం తెలియజేస్తూ పలు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆం దోళన బాట పట్టాయి. 
 

నష్టమే ఎక్కువ..
సీపీఎస్‌ కారణంగా.. ఉద్యోగి పదవీవిరమణ పొందిన తర్వాత సామాజిక భద్రత ఉండదు. పింఛన్‌లో కొంత భాగాన్ని కమ్యూటేషన్‌ చేసుకునే సదుపాయం ఉండదు. ఉద్యోగులు సర్వీసులో మరణిస్తే కారుణ్య నియామకంతో పాటు కుటుంబానికి పింఛన్‌ ఇచ్చే సదుపాయం ఉండదు. 
 

రద్దు కోరుతూ పోరుబాట
సీపీఎస్‌ విధానం రద్దు కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. ఎప్పటికప్పుడు దీక్షలు, ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు చేస్తున్న న్యాయమైన పోరాటాలను రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం అణచివేత ధోరణికి పాల్పడింది. సీపీఎస్‌ రద్దు కోరుతూ గత ఏడాది ఆగస్టులో ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి ఉద్యోగ, ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపుతూ వారిని ఎక్కడికక్కడే అరెస్ట్‌లు చేయించి పోలీస్‌స్టేషన్‌కు తరలించడం, ముందస్తు హౌస్‌ అరెస్ట్‌లు, గృహనిర్భందాలకు పాల్పడింది. గత ఏడాది అక్టోబరు 2న ఆమరణ నిరాహార దీక్షకు దిగిన 26 మంది సీపీఎస్‌ ఉద్యోగులపై కేసులు బనాయించారు. వారిలో జిల్లాకు చెందిన వారు ఎనిమిది మంది ఉన్నారు. వీరంతా ప్రస్తుతం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. 


‘టక్కర్‌ కమిటీ’తో కాలయాపన..
సీపీఎస్‌ రద్దు పోరాటం ఉద్ధృతం కావడంతో గత్యంతరం లేని స్థితిలో మూడు నెలల వ్యవధిలో నివేదిక ఇవ్వాలనే నిబంధనతో మాజీ సీఎస్‌ టక్కర్‌ అధ్యక్షతన చంద్రబాబు ప్రభుత్వం ‘టక్కర్‌ కమిటీ’ వేసింది. ఈ కమిటీపై ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిటీలు కేవలం కాలయాపనకే తప్ప ప్రయోజనం శూన్యమని ధ్వజమెత్తుతున్నారు. చివరి క్యాబినెట్‌ సమావేశానికి మూడు రోజుల ముందే టక్కర్‌ కమిటీ నివేదిక ఇచ్చినా దానిని ప్రభుత్వం బహిర్గతం చేయకపోవడం గమనార్హం. టక్కర్‌ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని, చివరి క్యాబినెట్‌లో సీపీఎస్‌ రద్దు చేయాలని సీపీఎస్‌ ఉద్యోగులు ఎంతగా డిమాండ్‌ చేసినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులంతా బాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 


   అంశం                       పాత ఫింఛన్‌ విధానం           సీపీఎస్‌ విధానం
1. కమ్యూటేషన్‌               40శాతం                         ఉండదు
2. డెత్‌ పెన్షన్‌ సౌకర్యం       కుటుంబ పెన్షన్‌                ఉండదు
3. నెలవారీ పెన్షన్‌             50శాతం బేసిక్‌ పే             ఉండదు
4. పదవీవిరమణ              డీఏ ఇస్తారు                    ఉండదు
5. పీఎఫ్‌ అర్హత                 ఉంటుంది.                      ఉండదు
6. పీఎఫ్‌ లోన్‌                  ఉంటుంది.                      ఉండదు
7. హెల్త్‌కార్డు                    ఉంటుంది.                      ఉండదు
8. పెన్షన్‌ గ్యారెంటీ             ఉంటుంది                       ఉండదు
9. పెన్షన్‌ డిసైడ్‌ బై             ప్రభుత్వం                     పీఎఫ్‌ ఆర్‌డీఏ, షేర్‌మార్కెట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement