రాజురా గ్రామం
సాక్షి, కుభీర్(అదిలాబాద్): మండలంలోని రాజురా గ్రామం ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన గ్రామంగా ప్రసిద్ధి చెందింది. జుమ్డ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామంగా ఉన్న ఈ కుగ్రామంలో జనాభా 300లు ఉండగా 200 ఓటర్లు, రెండు వార్డులు ఉన్నాయి. గ్రామంలో కేవలం ఎస్సీ, బీసీ వర్గాల ప్రజలు మాత్రమే ఉన్నారు. ఈ గ్రామం మండల కేంద్రమైన కుభీర్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఒక్కో ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉద్యోగులు
ఈ గ్రామంలో ఒక్కో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున ఉద్యోగులు ఉన్నారు. అటెండర్ స్థాయి ఉద్యోగుల నుంచి శాస్త్రవేత్తల వరకు ఉన్నారు. 95 శాతం మంది చదువుకున్న వారే సంతకాలు చేయడం రానివారు కేవలం 5 శాతం ఉంటారు.మొత్తం ఉద్యోగస్తులలో 8 మంది బీసీ వర్గానికి చెందిన వారు కాగా మిగిలిన వారు ఎస్సీ వర్గానికి చెందిన వారు. ఇందులో డాక్టర్లు 7గురు, ఉపాధ్యాయులు 6, ఆర్మీలో 3, ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు 2, ఎస్సైలు 2, సైంటిస్ట్ 2, విజిలెన్న్ అధికారి 1మిగిలిన వారు అటెండర్లు, ఆశ, అంగన్‌వాడీ, లెక్చరర్లు తదితర ఉద్యోగాలలో ఉన్నారు. చిక్కాల ప్రభు అనే రైతు ముగ్గురు కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. ఒకరు ఎక్సైజ్ ఎస్సై, ఒకరు ఏఅర్ ఎస్సై, మరొకరు తపాళ శాఖలో ఉన్నారు. ఆయన చిన్న కుమారుడు చిక్కాల విజయ్ ముందు కానిస్టేబల్ ఉద్యోగం రాగా అందులో చేరాడు.
6 నెలలు గడవగానే పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం రాగానే కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి అందులో చేరాడు. ఒక నెల రోజులు భైంసా రూరల్ మండలం మిర్జాపూర్‌లో పనిచేశారు. పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు ఏఅర్ ఎస్సై ఉద్యోగం వచ్చింది. రాగానే కార్యదర్శి ఉద్యోగానికి రాజీనామా చేసి ఏఅర్ ఎస్సైగా ఉద్యోగంలో చేరి ప్రస్తుతం అసిఫాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. సంజు అనే వ్యక్తి విజిలెన్స్ అధికారిగా ఉన్నారు.దామోదర్ అనే వ్యక్తి సైంటిస్ట్‌గా ఉన్నారు. మరో వ్యక్తి జి.అనిల్‌కుమార్ వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉన్నారు. గ్రామానికి చెందిన వ్యక్తి ప్రభాకర్ అదనపు కలెక్టర్‌గా ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు.ఈ గ్రామం వ్యవసాయానికి ప్రసిద్ధి చెందింది.
పెద్దల స్ఫూర్తితో ఉద్యోగం సాధించాను
మా గ్రామంలో నా కంటే ముందు చదివి ఉద్యోగం సాధించిన వయస్సులో పెద్దవారిని స్ఫూర్తిగా తీసుకొని కష్టపడి చదివి ఎక్సైజ్ ఎస్సైగా ఉద్యోగం సాధించాను. -చిక్కాల విలాస్, ఎక్సైజ్ ఎస్సై మంచిర్యాల
రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లేవాడిని
కష్టపడి చదివి ఉద్యోగం పొందాను. మా గ్రామంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లి 10వ తరగతి వరకు పూర్తి చేశాను. మా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. బురదలో నడిచి వెళ్తూ రెండు వాగులు దాటి కష్టపడి చదివి ఉద్యోగం సాధించాను. -జి.అనిల్‌కుమార్ వ్యవసాయ శాస్త్రవేత్త, ఆదిలాబాద్ రాజురా గ్రామం.
Comments
Please login to add a commentAdd a comment