సమ్మె నోటీసు ఎంపీడీవోకు అందిస్తున్న ఉపాధి సిబ్బంది (ఫైల్)
సంతమాగులూరు: సమస్యల పరిష్కారం కోరుతూ వివిధ శాఖల ప్రభుత్వోద్యోగులు ఒక్కొక్కరుగా సమ్మె బాట పడుతున్నారు. ఇప్పటికే వెలుగు సిబ్బంది తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రోడ్డెక్కారు. దీంతో వెలుగు కార్యాలయాల్లో పనులన్నీ ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. వారి బాటలోనే ఉపాధి హామీ సిబ్బందీ నడవనున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూజనవరి 2వ తేదీ నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. జిల్లాలో 1500 మందికిపైగా సమ్మెలో పాల్గొననున్నట్లు జిల్లా ఉపాధి హామీ జేఏసీ చైర్మన్ కె.లక్ష్మి తెలిపారు. సమ్మె విజయవంతం చేసేందుకు జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధి సిబ్బంది ఆయా ఎంపీడీవోలకు సమ్మె నోటీసులు కూడా ఇచ్చారన్నారు.
పదేళ్ల నుంచి పోరాటం
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే సిబ్బంది రాత్రిపగళ్లు తేడా లేకుండా కష్టపడుతున్నా వారి కష్టానికి తగ్గ ఫలితం మాత్రం లేదు. పదేళ్ల నుంచి జీతాలు పెంచాలంటూ ధర్నాలు చేస్తున్నా, ఆందోళనలు చేపడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని వారు వాపోతున్నారు. ఈనెల 10న గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారాలోకేష్ ను కలిసి సమస్యను విన్నవించుకున్నా ఇంత వరకు పట్టించుకునే వారే లేరని దీంతో సమ్మె బాట పట్టాల్సి వస్తోందని వారు తెలిపారు. 2016 పీఆర్‌సీని అనుసరించి కేడర్ వారీగా జీతాలు పెంచాలని కోరుతున్నారు.
ప్రధాన డిమాండ్లు ఇవే...
ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని, సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం ఇస్తూ సీనియారిటీ ప్రతిపాదికను 2016 పీఆర్‌సీ అనుసరించి టైం స్కేల్ అమలు చేసి జీతాలు పెంచాలని వారు ప్రధానంగా కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో పాల్గొనేందుకు ఉపాధి సిబ్బంది సంసిద్ధులవుతున్నారు. జీతాలు పెంచకపోతే కుటుంబ పోషణ గడవాలన్నా కష్టతరంగా ఉందని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మేల్కొనాలని కోరుతున్నారు.
ఎన్నికల కోడ్ వస్తే మా పరిస్థితి ఏంటి:
ఏళ్ల తరబడి జీతాలు పెంచాలని కోరుతున్నా పట్టించుకోకపోవటంతో పాటు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశాలు ఉన్నందున ఈలోపు సమస్యలు పరిష్కరించకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంటుందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉపాధి సిబ్బంది సమస్యలపై దృష్టి సారించాలని కోరుతున్నారు. ఎన్నికల కోడ్ వస్తే మళ్లీ ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం వచ్చిందాకా ఎదురు చూడాల్సిందేనా అని వారు లబోదిబోమంటున్నారు.
ఆందోళనలు ఉధృతం చేస్తాం
ప్రభుత్వం దిగి వచ్చి సమ్మెలో పాల్గొనే లోపే మా డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాం. ఏళ్ల తరబడి వెట్టిచాకిరీ చేయిస్తున్నారే తప్ప ప్రభుత్వం నుంచి లబ్ధి పొందింది మాత్రం శూన్యం. జిల్లాలో ఉపాధి హామీ సిబ్బంది విధులు కష్టతరంగా ఉన్నా పని చేస్తున్నారు. ఆ కష్టాన్ని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – కె.లక్ష్మి జిల్లా ఉపాధి హామీ జేఏసీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment