తెలంగాణ పట్టణ మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీయూఎఫ్‌ఐడీసీ) ఇంజనీర్‌గా పనిచేస్తోన్న ప్రవీణ్ చంద్రను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. కాంట్రాక్టర్‌కు రావలసిన నిధుల విడుదలకు లంచం వసూలు చేసినందుకు గానూ అదుపులోకి తీసుకున్నారు. వనపర్తిలో కాంట్రాక్టర్ కాంతారెడ్డి 2008 సంవత్సరంలో రూ.14.32 కోట్ల విలువైన సీసీ రోడ్లు, మురుగునీటి పారుదల పనులను ప్రారంభించి 2010లో పూర్తి చేశారు. ఆ పనులకు సంబంధించి రూ.13 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అందులో రూ.1.32 కోట్లు సాంకేతిక కారణాలతో ఆగిపోయాయి. ఆయన మరోసారి అభ్యర్థించగా మేలో నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.