ఎల్.ఎన్.పేట: ఆదివారం పట్టుకున్న నగదుతో ఫ్లయింగ్‌స్క్వాడ్ అధికారి దామోదరరావు
సాక్షి, శ్రీకాకుళం: కరెన్సీ నోట్లు కట్టలు తెంచుకుంటున్నాయి. ఓట్లు కొనేం దుకు సరిహద్దులు దాటి మరీ జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. గెలుపే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓటర్లకు డబ్బుల పంపిణీకి సిద్ధమవుతున్నారు. పోలీసులు, రెవెన్యూ తనిఖీ, నిఘా బృందాల కళ్లుగప్పి భారీగా నగదును తరలిస్తున్నారు. పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రం నుంచి కూడా దొంగచాటుగా వీరు వివిధ మార్గాల్లో డబ్బు కట్టలను రప్పిస్తున్నారు. అధికారా న్ని అడ్డం పెట్టుకుని అడ్డదారుల్లో ఆ పార్టీ అభ్యర్థులకు, నాయకులకు చేరవేస్తున్నారు. ప్రధాన మార్గాలు, జాతీయ రహదారిపై నిఘా ఎక్కువగా ఉండడంతో లూప్‌లైన్లను ఎంచుకుంటున్నారు. పోలింగ్‌కు మరో రెండు వారాల సమయం ఉండగానే ఇప్పట్నుంచే ఓటర్లకు నగదు పంపిణీకి అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో కోడ్ అమలులోకి వచ్చి ముగిసే దాకా శ్రీకాకుళం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రూ.1.06 కోట్ల నగదు అధికారులకు పట్టుబడింది. కానీ ఈ ఎన్నికల్లో గడచిన 12 రోజుల్లోనే జిల్లాలో రూ.1.26 కోట్లు (రూ.1,26,92,781) దొరికింది. రానున్న 17 రోజుల్లో అధికార పార్టీ నేతలు ఇంకెన్ని కోట్ల రూపాయలను తరలించి పంపిణీ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఇంకా దొరక్కుండా టీడీపీ నాయకులు తరలించిన సొమ్ము ఎన్ని కోట్లు ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే వీరు ఓటర్లకు పంచడానికి ఒక్కో నియోజకవర్గంలో కోట్లాది రూపాయలను డంప్ చేసి ఉంచారు. ఇప్పుడు పొరుగున ఉన్న ఒడిశా నుంచి కార్లు, వ్యాన్లు, మోటారు సైకిళ్లపై ఎవరికీ అనుమానం రాకుండా జిల్లాలోకి నగదు ను తీసుకొస్తున్నారు. ప్రధాన రహదార్లపై నిఘా ఎక్కువగా ఉందన్న ఉద్దేశంతో మారుమూల ప్రాంత మార్గాల ద్వారా ఎవరికీ అనుమానం రాకుండా తరలిస్తున్నారు.
19 చెక్‌పోస్టుల ఏర్పాటు
అధికారులు జిల్లావ్యాప్తంగా 19 చోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఇవికాకుండా పలుచోట్ల పోలీసులు, రెవిన్యూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రేయింబవళ్లు వీరు వచ్చే పోయే వాహనాలను, వ్యక్తులను క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు.
పట్టుబడిన వాటిలో మచ్చుకు కొన్ని..
- ఈనెల 13న పోలాకి మండలం వనవిష్ణుపురంలో కారులో తరలిస్తున్న రూ.50 లక్షల నగదు పట్టివేత
- 16న వీరఘట్టం మండలం కడకెళ్లలో చెక్‌పోస్టు వద్ద రూ.84,310, కంచిలి వద్ద రూ.75 వేలు స్వాధీనం
- 17న నివగాం చెక్‌పోస్టు వద్ద రూ.2.99 లక్షలు, నరసన్నపేట బస్టాండు సమీపంలో రూ. 2.40 లక్షలు, లావేరు మండలం వెంకటాపురం జంక్షన్లో రూ.1.33 లక్షలు పట్టివేత
- 18న లావేరు మండలం వెంకటాపురంలో కారులో తరలిస్తున్న రూ.1.07 లక్షలు, నందిగాం మండలం కె.అగ్రహారం వద్ద బైకుపై తీసుకెళ్తున్న రూ.2.35 లక్షలు, పోలాకి మండలం వనవిష్ణుపురంలో రూ.69,445, రేగిడి మండలం బూరాడ వద్ద రూ.53,300 నగదు చిక్కింది.
- 19న ఇచ్ఛాపురం చెక్‌పోస్టు వద్ద రూ.14 లక్షలు, టెక్కలిపట్నంలో వాహనాలు తనిఖీ చేసినపుడు రూ.1.83 లక్షలు, సరుబుజ్జిలిలో స్క్వాడ్‌కు రూ.98.50 వేలు, ఎల్‌ఎన్‌పేట మండలం తురకపేట వద్ద రూ.27,500 లభ్యమైంది.
- మెళియాపుట్టి జంక్షన్లో రూ.83 వేలు, సోంపే ట మండలం కొర్లాంలో రూ.2.60 లక్షలు, పైడిభీమవరం వద్ద రూ.53,200, ఒడిశా నుంచి కారులో తరలిస్తున్న రూ.5.50 లక్షలు, ముచ్చింద్ర వద్ద ఒడిశా వైపు వెళ్తున్న కారులో రూ.3 లక్షలు, ఇచ్ఛాపురం బస్టాండులో రూ.4.30 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
- ఇంకా పొందూరు మండలం రాపాక వద్ద రూ.1.25 లక్షలు, పలాస మండలం పెసరపాడు వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్‌కు రూ.లక్ష పట్టుబడింది.
- 20న సోంపేట మండలం కొర్లాం హైవే చెక్‌పోస్టు వద్ద రూ.4,77,510 నగదు లభ్యమైంది.
- 22న వజ్రపుకొత్తూరు బెండిగేటు చెక్‌పోస్టు వద్ద రూ.1,62,151, నరసన్నపేట మండలం మడపాం వద్ద రూ.2,96,260, రేగిడి మండలం బూరాడ చెక్‌పోస్టు వద్ద రూ.86,100 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
- 23న ఇచ్ఛాపురం పురుషోత్తపురం వద్ద రూ.6 లక్షలు, పలాస మండలం తర్లకోట సమీపంలో రూ.2 లక్షలు, వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లిలో రూ.58,680, వసుంధర చెక్‌పోస్టు వద్ద రూ.4,27,210, సారవకోట మండలం బొంతుకూడలిలో రూ.79 వేలు, పోలాకి మండలం వనవిష్ణుపురంలో రూ.లక్ష అధికారులకు చిక్కింది.
Comments
Please login to add a commentAdd a comment