రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం | Four killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం

Published Thu, Feb 27 2014 3:00 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

Four killed in road accident

కోలారు, న్యూస్‌లైన్ : రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ  ఘటన కోలారు-బంగారుపేట మార్గమధ్యంలో అణిగాన హళ్లి గేట్ వద్ద మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతులను బంగారుపేట తాలూకా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, బంగారుపేట గాంధీనగర పాఠశాల ఉపాధ్యాయుడు చంద్రశేఖరగౌడ (49), బంగారుపేట తాలూకా  ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు, గొల్లపల్లి పాఠశాల ఉపాధ్యాయుడు అప్పాజిగౌడ(45), ఉపాధ్యక్షుడు ఆర్‌సి సిద్దప్ప(54), కోశాధికారి, నక్కలహళ్లి పాఠశాల ఉపాధ్యాయుడు మోహన్(42)గా గుర్తించారు.

వీరితో పాటు ప్రయాణిస్తూ గాయపడిన నటరాజ్ ఆర్‌ఎల్‌జాలప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మార్చి 1న నిర్వహించనున్న బంగారుపేట తాలూకా ఉపాధ్యాయుల సమ్మేళనానికిరాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు, తదితరులను ఆహ్వానించడానికి వీరంతా కారులో బెంగుళూరుకు వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బండరాయిని, చెట్టును ఢీకొని బోల్తా పడింది. వాహనం నుజ్జునుజ్జు కావడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వాహనాన్ని నడుపుతున్న నాటరాజు మాత్రం గాయాలతో బయటపడ్డాడు. కేజీఎఫ్ ఎస్పీ రోహిణీ కటౌచ్, డీఎస్పీ వివేకానంద, ఎస్‌ఐ యోగానంద ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పరిమితికి మించి ఎక్కువ మంది ప్రయాణించడం, నిద్రమత్తు వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా  బంగారుపేట ఉన్నత పాఠశాల వద్ద మృతదేహాలను అంతిమ దర్శనం కోసం ఉంచారు. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు వచ్చి నివాళులర్పించారు. కోలారు ఎమ్మెల్యే వర్తూరు ప్రకాష్ బంగారుపేట ఎమ్మెల్యే నారాయణస్వామిలు తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement