2014లో రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానం
Published Wed, Oct 30 2013 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
కోలారు, న్యూస్‌లైన్ :వచ్చే ఏడాది(2014)లో రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కోలారు తాలూకాలోని నరసాపురం పారిశ్రామిక వాడలో స్కానియా ఇండియా కంపెనీని ఆయన మంగళవారం ప్రారంభించి, ప్రసంగించారు. నూతన పారిశ్రామిక విధానం అమలు వల్ల పరిశ్రమలకు మరిన్ని సౌకర్యాలు, రాయితీలు అందుతాయని అన్నారు. పారిశ్రామిక వేత్తలను ఆకర్షించే ఉద్దేశ్యంతో ఈ విధానానికి తెరలేపనున్నట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇతర దేశాల పారిశ్రామిక వేత్త లు ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు వల్ల రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పారు. తుమకూరులో 12వేల ఎకరాల్లో పారిశ్రామిక మండలిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని, ఇదే విధంగా కోలారు, గుల్బర్గా జిల్లాల్లో కూడా పారిశ్రామిక మండళ్లు ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు.
ఆటోమోటివ్ ఉత్పత్తుల్లో దేశంలో కర్ణాటక నాల్గవస్థానంలో ఉందని తెలిపారు. కరువు జిల్లా వాసులను ఆదుకోవాలన్న లక్ష్యంతో కోలారు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపన కోసం భూములను ఇచ్చిన రైతు కుటుంబాలలో ఒకరికి ఆయా ఫ్యాక్టరీల్లో తప్పనిసరిగా ఉద్యోగం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కేహెచ్ మునియప్ప, రాష్ట్ర మంత్రులు రామలింగారెడ్డి, యూటీ ఖాదర్, ఎమ్మెల్యే వర్తూరు ప్రకాష్, ఎమ్మెల్సీ నజీర్ అహమ్మద్, స్కానియా ఇండియా కంపెనీ సీఈఓ మార్టిన్ లూండ్‌స్టెడ్, ఎండీ అండెర్స్ గ్రూండ్ స్ట్రోమర్, స్వీడన్ రాయబారి హెరాన్డ్ సోన్‌బర్గ్ పాల్గొన్నారు.
విపక్షాల ప్రశ్నలకు తగిన సమాధానమిస్తాం
అసెంబ్లీ సమావేశాల్లో విపక్షాలు సంధించే ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇస్తామని సీఎం సిద్ధరామయ్య అన్నారు. స్కానియా ఇండియా కంపెనీ ప్రారంభోత్సవం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సంతోష్ లాడ్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించకుంటే అసెంబ్లీ కార్యకలాపాలను అడ్డుకుంటామన్న బీజేపీ హెచ్చరికపై ఆయన పై విధంగా స్పందించారు. ప్రజా ప్రభుత్వ వ్యవస్థలో అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ బెంగళూరు పర్యటన సందర్భంగా గట్టి భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. వర్తూరు చెరువు నుంచి వృథా అవుతున్న నీటిని నరసాపురం, వేమగల్ పారిశ్రామిక వాడలకు అందించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు చెప్పారు.
Advertisement
Advertisement