గందరగోళం... | 'Ganapathi' suicide | Sakshi
Sakshi News home page

గందరగోళం...

Published Tue, Jul 12 2016 2:00 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

'Ganapathi' suicide

ఉభయ సభలను కుదిపేసిన ‘గణపతి’ ఆత్మహత్య
 కేసును పక్కదారి పట్టిస్తున్నారు : శెట్టర్
మంత్రి కె.జె.జార్జ్ రాజీనామాకు విపక్షాల పట్టు

 
 
బెంగళూరు: మంగళూరు డీఎస్పీ ఎం.కె.గణపతి ఆత్మహత్య ఉదంతం ఉభయ సభలను కుదిపేసింది. గణపతి ఆత్మహత్యపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో నిలదీశాయి. సోమవారం ఉదయం ఉభయసభల కార్యకలాపాలు ప్రారంభం కాగానే బీజేపీ, జేడీఎస్‌లు డీఎస్పీ గణపతి ఆత్మహత్య విషయాన్ని సభల్లో చర్చకు తీసుకువచ్చాయి. ఆత్మహత్యకు ముందు గణపతి ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను పరిగణలోకి తీసుకొని మంత్రి కె.జె.జార్జ్‌ను తక్షణమే పదవి నుంచి తప్పించాలని శాసనసభతో పాటు శాసనమండలిలోనూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అంతేకాక ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లి తమ నిరసనను తెలియజేశాయి. దీంతో అటు శాసనసభ, ఇటు శాసనమండలిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.  శాసనసభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ డీఎస్పీ గణపతి ఆత్మహత్య విషయంపై చర్చకు అనుమతించాల్సిందిగా స్పీకర్ కె.బి.కోళివాడను కోరారు. ఇందుకు జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి సైతం గళం కలిపారు.


ఈ నేపథ్యంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ ప్రభుత్వం తరఫున లిఖిత  పూర్వక వివరణ ఇచ్చేందుకు సన్నద్ధం కాగా తమ అసమ్మతిని తెలియజేసిన ప్రతిపక్ష నేతలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసనకు దిగారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంలో సీఎం సిద్ధరామయ్య కలగజేసుకొని చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ముందుగా రాష్ట్ర హోం శాఖ మంత్రి ఈ విషయంపై స్వయం ప్రేరిత వివరణ ఇవ్వనున్నారని, అనంతరం చర్చకు తాము సిద్ధమని తెలిపారు. డీఎస్పీ గణపతి ఆత్మహత్య విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సైతం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. గణపతి ఆత్మహత్యపై తాము తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ....‘డీఎస్పీ గణపతి ఆత్మహత్య కేసును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గణపతిని ఓ మానసిక రోగిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో మరింత గందరగోళాన్ని సృష్టించేందుకే గణపతి తండ్రి, సోదరుడి వాంగ్మూలాలు తీసుకున్నారు. అయితే ఇవి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. తనకు ఏదైనా జరిగితే అందుకు బాధ్యులు మంత్రి కె.జె.జార్జ్ అని డీఎస్పీ గణపతి  చెప్పినప్పటికీ చర్యలు మాత్రం తీసుకోలేదు. సీఎం సిద్ధరామయ్య తనకు అత్యంత ఆప్తుడైన జార్జ్‌పై చర్యలు తీసుకునేందుకు మాత్రం ఒప్పుకోవడం లేదు’ అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.  పోలీసు శాఖలో బదిలీల దందా జరుగుతోందంటూ ఈ సందర్భంగా జగదీష్ శెట్టర్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. రూ.20-రూ.50 లక్షలు ఇచ్చి బదిలీలు చేయించుకుంటున్నారని, ఈ ప్రభుత్వంలో ఏదైనా అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయంటూ మండిపడ్డారు.

 
జార్జ్‌పై చర్యలు తీసుకోకపోతే  పోరాటం తప్పదు....

ఇక శాసనమండలిలో సైతం డీఎస్పీ గణపతి ఆత్మహత్య అంశం ప్రతిధ్వనించింది. ఉదయం శాసనమండలి కార్యకలాపాలు ప్రారంభం కాగానే  ప్రతిపక్ష నేత కె.ఎస్.ఈశ్వరప్ప డీఎస్పీ గణపతి ఆత్మహత్య విషయాన్ని చర్చకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘డీఎస్పీ గణపతి ఆత్మహత్య అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కె.జె.జార్జ్‌పై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, అరెస్ట్ చేయాలి. ఆయన్ను మంత్రి వర్గం నుంచి తప్పించాలి. లేదంటే బీజేపీ సభ లోపల, బయట కూడా పోరాటానికి సన్నద్ధమవుతుంది’ అని హెచ్చరించారు. గణపతిది ఆత్మహత్య కాదని, అది హత్య అని పేర్కొన్నారు. ఈ విషయంలో నిజానిజాలు బయటకు రాకుండా ఉండేందుకు గణపతి డెత్‌నోట్‌ను కూడా మాయం చేశారని ఆరోపించారు. అంతేకాక గణపతి డైరీ, ల్యాప్‌టాప్‌లోని విషయాలను సైతం డిలీట్ చేశారని పేర్కొన్నారు. జార్జ్ మంత్రి స్థానంలోనే కొనసాగితే సాక్ష్యాలను నాశనం చేసేందుకు ఆస్కారం ఉందని మండిపడ్డారు. అందువల్ల తక్షణమే జార్జ్‌ను మంత్రి పదవి నుంచి తప్పించి, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కె.ఎస్.ఈశ్వరప్ప డిమాండ్ చేశారు.

హత్య అనే అనుమానం!
కాగా, డీఎస్పీ గణపతి ఆత్మహత్య ఉదంతాన్ని సరిగ్గా పరిశీలిస్తే ఇది హత్యా అనే అనుమానం కలుగుతోందని గణపతి సోదరుడు ఎం.కె.మాచయ్య పేర్కొన్నారు. మడికెరిలోని అదనపు జేఎంఎఫ్‌సీ కోర్టులో ఇందుకు సంబంధించి ఓ ప్రైవేటు కంప్లైంట్‌ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా గణపతి సోదరుడు ఎం.కె.మాచయ్య మాట్లాడుతూ....‘గణపతి ఆత్మహత్య ఉదంతంపై మాకు అనుమానాలు కలుగుతున్నాయి. ఇది ఆత్మహత్యే అయి ఉంటే ఆ గదిలో కాల్పులు ఎందుకు జరుగుతాయి. గణపతి బస చేసిన గది కూడా అంత సురక్షితంగా లేదు. ఆ గదిలోని కిటికీ నుంచి ఓ వ్యక్తి లోనికి వచ్చి వెళ్లేలా పరిస్థితులు ఉన్నాయి. గణపతిని నేను చిన్నప్పటిని నుండి చూస్తున్నా. మేమిద్దరం కలిసే పెరిగాము. గణపతి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా కేసును సీబీఐకి అప్పగించాలి’ అని డిమాండ్ చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement