బడ్జెట్‌లో రైతులకు ప్రాధాన్యత ఇవ్వండి
జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు
హెచ్.డి.కుమారస్వామి
బెంగళూరు: ఈ ఏడాది రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో రానున్న బడ్జెట్‌లో రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతుల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే సందర్భంగా శాసనసభలో ఆయన శనివారం మాట్లాడారు. రాష్ట్రంలో రోజూ ఇద్దరు, ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారని, అప్పులు తీర్చడం లేదనే సాకుతో జాతీయ బ్యాంకులు రైతులకు అప్పులు ఇవ్వడం లేదన్నారు. దీంతో రైతులు మళ్లీ అప్పుల కోసం ప్రైవేటు వ్యక్తుల దగ్గరికి వెళ్లాల్సి వస్తుందని అన్నారు. ప్రైవేటు వ్యక్తులకు అధిక వడ్డీలు చెల్లించలేక అప్పుల ఊబిలో కూరుకుపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కరువు పరిహారాన్ని రైతులకు అందజేసేందుకు జిల్లా అధికారులు ఏ మాత్రం ముందుకు రావడం లేదు.
ఆ డబ్బేదో వాళ్ల ఇంట్లోంచి తీసుకొచ్చి ఇస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఇక రైతులకు అప్పులు ఇవ్వడం పై కూడా రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదు. ఈ పరిస్థితి మారాలి. రానున్న రెండు నెలల్లో రాష్ట్రంలో తాగునీటి సమస్య కూడా తీవ్రతరమవుతుంది. అందువల్ల సరిహద్దు రాష్ట్రాలతో ఉత్తమ సంబంధాలను ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలో తాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయండి. ఇక ఇదే సందర్బంలో రాష్ట్రంలో పశువుల మేతకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోండి’ అని కుమారస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.