కాంగ్రెస్ నేతల్లో కలవరం
Published Sun, Oct 13 2013 2:14 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM
సాక్షి, న్యూఢిల్లీ: జవాబుదారీ కమిషన్ ఏర్పాటు అంశం తెరపైకి రావడంతో కాంగ్రెస్ నాయకుల్లో కలవరం మొదలైందని బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు గోయల్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. పదిహేనేళ్ల పాలనలో చేసిన అవినీతి, కుంభకోణాలు ఎక్కడ బయటపడతాయోననే ఆందోళనలో వారున్నారని పేర్కొన్నారు. అందుకే ఆ పార్టీ నాయకులు జవాబుదారీ కమిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఎవరెన్ని అభ్యంతరాలు పెట్టినా కమిషన్ వేసి తీరతామని స్పష్టం చేశారు. తప్పుడు వాగ్దానాలు, విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీని అధికారంలో నుంచి తప్పించే సమయం కోసం ఓటర్లు వేచిచూస్తున్నారన్నారు.
విద్యుత్, విద్య, మంచినీటి సరఫరా తదితర అంశాల్లో ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్నారంటూ ఆయా శాఖల మంత్రులను దుయ్యబట్టారు. నగరంలో విద్యుత్ సరఫరాకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేస్తున్న నివేదికలన్నీ తప్పులతడకలేనన్నారు. వేలల్లో విద్యుత్ చార్జీలు వసూలు చేస్తూనే చౌకగా విద్యుత్ సరఫరా చేస్తున్నామంటూ పేర్కొనడం అసమంజసమన్నారు. తాము అధికారంలోకి వస్తే 30 శాతం మేర విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని పునరుద్ఘాటించారు. నగరంలోని 40 శాతం ప్రాం తాల ప్రజలకు ఢిల్లీ జల్ బోర్డు నీరు అందడం లేదని కాగ్ తన నివేదికల్లో పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల సంఖ్యలో 15 ఏళ్లలో ఎలాంటి మార్పూ రాలేదన్నారు. సీట్ల కొరత కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గోయల్ ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement