cogress part
-
బిజెపికి సీట్లు పెరిగినా ఓట్లు తగ్గాయి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌ను మట్టికరిపించడంతో పాటు బీజేపీ ఓటు బ్యాంకును కూడా కొల్లగొట్టింది. ఓట్ల దామాషా ప్రకారం చూస్తే పాలక పక్షం కాంగ్రెస్‌కే కాక ప్రతిపక్షంలో ఉన్న బీజేపీకి కూడా సెగచూపించినట్లు కనిపిస్తోంది. విధాన సభ ఎన్నికలలో బీజేపీకి ఇంత తక్కువ ఓట్లు ఇంతకు మునుపెన్నడూ రాలేదు. విధాన సభ ఎన్నికలలో బీజేపీకి సీట్ల సంఖ్య పెరిగినప్పటికీ ఓట్ల సంఖ్య తగ్గింది. మొత్తం ఓట్లలో 33.78 శాతం ఓట్లు బీజేపీ గెల్చుకొంది. గత అసెంబ్లీ ఎన్నికలలో 14 శాతం ఓట్లు పొందిన బీఎస్పీకి కూడా ఈసారి 9 శాతం ఓట్లతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. తొలిసారిగా శాసనసభ ఎన్నికలలో పోటీచేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి 30 శాతం ఓట్లు సాధించింది. 2008 ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి దాదాపు మూడు శాతం ఓట్లు తగ్గాయి. 1993 తొలి శాసనసభ ఎన్నికలలో బీజేపీ 42 .82 శాతం ఓట్లు దక్కించుకుని 49 సీట్లు గెలిచింది. 1998లో 15 సీట్లు గెలిచినప్పటికీ 35.58 శాతం ఓట్లు వచ్చాయి. 2003 ఎన్నికలలో 20 సీట్లు, 35.22 శాతం ఓట్లు వచ్చాయి. 2008 ఎన్నికలలో 36.83 శాతం ఓట్లతో 23 స్థానాలను గెలుచుకుంది. ఈసారి 33.78 ఓట్లు పొందింది. చిత్తుగా ఓటమి చవిచూసిన కాంగ్రెస్‌కు 24.40 శాతం ఓట్లు పొందింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌కు 15 శాతం ఓట్లు తగ్గాయి. 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ 40.30 ఓట్లు వచ్చాయి. -
సంచలన ఫలితాలు!
సాక్షి, న్యూఢిల్లీ:‘ఢిల్లీ ఓటర్లు వివేకవంతమైన తీర్పునిచ్చారు’.... ఫలితాల తర్వాత రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య ఇది. ‘మీరు ఇచ్చిన తీర్పు దేశ ప్రజలందరికీ ఆదర్శనీయం’... కౌంటింగ్ అనంతరం ప్రముఖుల పలుకు ఇది. మొత్తానికి కీలెరిగి వాత పెట్టినట్లుగా ఢిల్లీ ఓటరు వ్యవహరించారు. భారీ మెజార్టీని కట్టబెట్టకుండా కమలనాథులను కట్టడి చేసిన దిల్లీవాలా కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ ఆమ్ ఆద్మీకి ప్రతిపక్ష హోదాకు అవసరమైన మెజార్టీనిచ్చి మార్పు కోరుకుంటున్నట్లు దేశానికి చాటిచెప్పాడు. ఇక పాత విధానాలు, కుంభకోణాలు, అవినీతి వంటివి వినీ.. వినీ.. విసుగెత్తిందని, అందుకే మిమ్మల్ని ఇంటికి పంపుతున్నామని చెప్పేందుకు కాంగ్రెస్‌ను సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం చేశాడు. ఈ తీర్పు ద్వారా ఢిల్లీ ఓటరు ఎవరినెక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడన్నది సామాజిక కార్యకర్తల అభిప్రాయం. క్షణక్షణం ఉత్కంఠగా సాగిన కౌంటింగ్... విధానసభ ఎన్నికల కౌటింగ్ క్షణ క్షణం ఉత్కంఠరేపుతూ కొనసాగింది. రికార్డు స్థాయిలో నమోదైన పోలింగ్‌లో ఢిల్లీవాసులు ఇచ్చిన తీర్పు అధికార కాంగ్రెస్‌ను చిత్తు చేయగా, పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ కమలం వికసించినా విజయం ముంగిట్లో అడుగు దూరంలో ఆగిపోయింది. ఢిల్లీ ఎన్నికల బరిలోకి దిగినప్పటి నుంచి సంచలనాలకు మారుపేరుగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ విజయంలోనూ అంచనాలను తల్లకిందులు చేసింది. ఒకటి రెండు సీట్లు గెలుస్తారంటూ మొదలైన ఆప్ ప్రస్థానం చివరికి పదిహేనే ళ్ల కాంగ్రెస్ ముఖ్యమంత్రి పీఠాన్నే పెకిలించింది. అత్యధికంగా 28 స్థానాల్లో గెలుపొంది ఆశ్చర్యానికి లోనుచేసింది. పోరులో మొదటి నుంచే చేతులు ఎత్తేసిన కాంగ్రెస్ కేవలం ఎనిమిది స్థానాలే దక్కించుకుని చిత్తుచిత్తుగా ఓడిపోయింది. హేమాహేమీలైన నేతలు కూడా పరాజయంపాలయ్యారు. హోరాహోరీగా ఫలితాలు... ఢిల్లీ విధానసభ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఎవరెన్ని సర్వేలు నిర్వహించినా ఓ అంచనాకు రావడంలో నెలకొన్న సందిగ్ధత ఫలితాల అనంతరమూ కొనసాగుతోంది. తొమ్మిది జిల్లాల్లో ఓట్ల లె క్కింపు కోసం కేటాయించిన మొత్తం 14 లెక్కింపు కేంద్రాల్లో ఆదివారం ఉదయం నుంచి ఓట్ల లె క్కింపు ప్రారంభమైంది. మిగతా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఢిల్లీలో కాస్త ఆలస్యంగా కౌంటింగ్ ప్రారంభమైంది. కేవలం 70 స్థానాలే ఉండడంతో కౌటింగ్ మొదలైన రెండు గంటల్లోనే బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు అర్థమైంది. అంతకంతకు సమయం పెరుగుతున్నా కొద్దీ కాంగ్రెస్‌పార్టీ పూర్తిగా ఢీలా పడుతూ వచ్చింది. అనూహ్యంగా దూసుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ 27 స్థానాలు గెలుచుకుంది. సాయంత్రం వరకు కొనసాగిన కౌంటింగ్‌లో బీజేపీ 33 స్థానాల్లో గెలుపొంది మొదటి స్థానంలో, 27 స్థానాల్లో గెలుపుతో ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. పదిహేనేళ్లుగా ఢిల్లీలో అధికారంలో ఉన్న హస్తం హవా మచ్చుకు కూడా కనిపించలేదు. కేవలం ఏడు స్థానాలతో కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకుంది. ఇక మిగిలిన రెండు స్థానాల్లో మాతియామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీయూ గెలుపొందగా, ముండ్కా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి రాంభీర్ షౌకీన్ గెలుపొందారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటికి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అనూహ్యమైన మెజార్టీతో గెలుపొందారు. మొదటి రెండు రౌండ్లలో కాస్త ఆధిక్యం కనబర్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ క్రమంగా ఓటమి దిశగా పయనించారు. 25 వేల ఓట్లతో న్యూఢిల్లీ నియోజకవర్గ ప్రజలు అరవింద్కేజ్రీవాల్ను గెలిపించారు. ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి డా.హర్షవర్ధన్ మరోమారు కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి సునాయాసంగా గెలుపొందారు. ఆమ్ఆద్మీపార్టీ కీలక నేత మనీష్సిసోయిడా పట్పర్గంజ్ నుంచి గెలుపొందారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 36 స్థానాలకు బీజేపీ మూడు అడుగుల దూరంలో ఆగింది. 33 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా 27 స్థానాలతో రెండో స్థానంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరికీ మద్దతు ఇవ్వం.. తీసుకోబోమంటూ ప్రకటించడం అధికారపీఠం ఎవరిదన్నదానిపై పీఠముడి పడింది. -
పితాని పాట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రచ్చబండ.. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమం. రాష్ట్ర సాం ఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా మార్చేశారు. నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న రచ్చబండ సభల్లో ప్రజల గురించి మాట్లాడటం, వారి సమస్యల్ని పట్టించుకోవడం మానేసి ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా సమస్యలల్ని పరిష్కరించిందేమీ లేకపోయినా ఆరోపణలతో హడావుడి చేస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జిల్లాలో పలుచోట్ల జరిగిన రచ్చబండ సభల్లో ఇదేరీతిన వ్యవహరించిన మంత్రి పితాని మంగళవారం తూర్పుగోదావరి జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్లి అక్కడ కూడా తన తిట్ల పురాణానికి తెరలేపారు. కాంగ్రెస్ పార్టీ కుదేలవడంతో రాబోయే ఎన్నికల్లో తన ఉనికి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడటంతో ఆయనలో అసహనం పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన ఎక్కడబడితే అక్కడ రాజకీయాలు మాట్లాడేస్తున్నారు. పక్కన జిల్లా ఉన్నతాధికారులను పెట్టుకుని మరీ రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. బుధవారం పెరవలిలో జరిగిన రచ్చబండ సభలో అదేపనిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా, వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనా విమర్శలు చేశారు. పనిలో పనిగా తెలుగుదేశంపైనా ఆరోపణలు చేశారు. తాను చేసిన ఆరోపణలు, విమర్శలను బలపర్చుకునేందుకు మధ్యమధ్యలో ప్రజల్ని ‘అవునా.. కాదా’ అని సభకొచ్చిన ప్రజలను అడిగారు. వారేమీ స్పందించకపోయినా తనపాటికి తాను మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. ఏలూరులో రచ్చబండ ప్రారంభ సభలోనూ ఇలాగే విమర్శలు గుప్పించారు. ఇలా రచ్చబండ కార్యక్రమాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడంపై నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తమ బాధలు తీర్చాలని ప్రజలు నిలదీస్తుంటే పట్టించుకోకుండా పితాని వ్యవహరిస్తున్న తీరుతో అధికారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యమ సమయంలో గప్‌చుప్ మొన్నటివరకూ సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరిగింది. మంత్రి పితాని ఎక్కడకు వెళ్లినా ప్రజలు నిలదీశారు. దీంతో అప్పట్లో ఆయన జిల్లాలో పర్యటనలను తగ్గించుకున్నారు. ఆ సమయంలో రాజకీయాలు మాట్లాడినా ఎవరూ వినే పరిస్థితులు లేకపోవడంతో మిన్నకుండిపోయూరు. కొద్దిరోజుల నుంచి ఉద్యమ ప్రభావం తగ్గడంతో ఆయన స్వరం మళ్లీ పెరిగింది. ఈ సమయంలోనే రచ్చబండ సభలు జరుగుతుండటంతో వాటిని పూర్తిగా తన రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు. సీఎం మెప్పు కోసం అగచాట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వీరవిధేయుడుగా మారిన పితాని ఆయన మెప్పు కోసం ఎక్కడికక్కతే అక్కడ రాజకీయాలు మాట్లాడేస్తున్నారు. సీఎంను అదేపనిగా పొగుడుతూ, ప్రత్యర్థులను తిడుతూ ముందుకెళుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ తదితర పథకాలు అందక జనం ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా సంక్షేమ పథకాలన్నీ నిరాటంకంగా అమలవుతున్నాయని ఢంకా బజాయించి మరీ అబద్ధాలు చెబుతున్నారు. ఏ ఒక్కరికీ మేలు జరగకపోయినా ముఖ్యమంత్రి ఘనతను, ఆయన ప్రవేశపెట్టిన పథకాలను కీర్తించడమే పనిగా పెట్టుకుని ముందుకెళుతున్నారు. పితాని భక్తికి మెచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఇటీవలే ఆయనకు ఆర్ అండ్ బీ శాఖ బాధ్యతలను అదనంగా అప్పజెప్పారు. దీంతో పితాని తన విధేయతను మరింతగా చాటుకునేందుకు రచ్చబండను వేదిక చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
అధికారం కోసం ఆరాటం
న్యూఢిల్లీ: పదిహేనేళ్ల విరామం తర్వాత అధికారం దక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఆరాటపడుతోందని మంత్రులు హరూన్ యూసుఫ్, అర్విందర్‌సింగ్ లవ్లీ, రాజ్‌కుమార్ చౌహాన్లు ఆరోపించారు. శనివారం వారిక్కడ మీడియాతో మాట్లాడారు. అందులోభాగంగానే విద్యుత్, నీరు, పరిపాలన విషయంలో ప్రజలను పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. కాగా బీజేపీ సారథ్యంలోని మూడు కార్పొరేషన్ల మేయర వెంటబెట్టుకుని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలసిన గోయల్... అనంతరం ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ సర్కారు అవినీతిని వెలుగులోకి తీసుకొచ్చేందుకు జవాబుదారీ కమిషన్‌ను నియమించాలని కోరిన నేపథ్యంలో మంత్రులు పైవిధంగా స్పందించారు. లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలసి వినతిపత్రం ఇవ్వడంపైనా మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఏదోవిధంగా అధికారం దక్కించుకునేందుకు విజయ్ గోయల్ తీవ్రమైన ఆరోపణలకు దిగుతున్నారన్నారు. తమ సారథ్యంలోని కార్పొరేషన్లలో జవాబుదారీ కమిషన్‌ను నియమించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించిన బీజేపీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలవడమెందుకని వారు ప్రశ్నించారు. వారు ఇప్పటికే కమిషన్‌ను తప్పనిసరిగా నియమించి ఉండాల్సిందన్నారు. పక్కదారి పట్టించేందుకే తాము అధికారంలోకి వస్తే 30 శాతంమేర విద్యుత్ చార్జీలను తగ్గిస్తామంటూ బీజేపీ ప్రకటించడంలోని ఆంతర్యం ప్రజలను పక్కదారి పట్టించడమేనని మంత్రి హరూన్ యూసఫ్ ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ నాయకులు అమలుకు వీలుకాని హామీలు ఇస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం అనేకమంది విద్యుత్ సబ్సిడీ ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. తమ ప్రభుత్వం ఏనాడూ విద్యుత్ సంస్థలకు అండగా నిలవలేదన్నారు. ఢిల్లీ విద్యుత్ నియంత్రణ కమిషన్ (డీఈఆర్సీ) చార్జీలను నిర్ధారిస్తుందన్నారు. ఆ విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండబోదన్నారు. యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర పెరిగిందన్నారు. 2002లో యూనిట్ విద్యుత్ ధర రూ. 1.50 ఉండగా. 2012 నాటికి అది రూ. 1.80కి చేరుకుందన్నారు. విద్యుత్ వాడకం కూడా గణనీయంగా పెరిగిపోయిందనే విషయాన్ని గోయల్ గుర్తుంచుకోవాలన్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో విద్యుత్ వినియోగం మూడురెట్లు పెరిగిందన్నారు. గడచిన 15 ఏళ్ల కాలంలో తమ ప్రభుత్వం నీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసిందన్నారు. ఇందుకోసం అనేక చర్యలు తీసుకుందన్నారు. -
కాంగ్రెస్ నేతల్లో కలవరం
సాక్షి, న్యూఢిల్లీ: జవాబుదారీ కమిషన్ ఏర్పాటు అంశం తెరపైకి రావడంతో కాంగ్రెస్ నాయకుల్లో కలవరం మొదలైందని బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు గోయల్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. పదిహేనేళ్ల పాలనలో చేసిన అవినీతి, కుంభకోణాలు ఎక్కడ బయటపడతాయోననే ఆందోళనలో వారున్నారని పేర్కొన్నారు. అందుకే ఆ పార్టీ నాయకులు జవాబుదారీ కమిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఎవరెన్ని అభ్యంతరాలు పెట్టినా కమిషన్ వేసి తీరతామని స్పష్టం చేశారు. తప్పుడు వాగ్దానాలు, విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీని అధికారంలో నుంచి తప్పించే సమయం కోసం ఓటర్లు వేచిచూస్తున్నారన్నారు. విద్యుత్, విద్య, మంచినీటి సరఫరా తదితర అంశాల్లో ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేస్తున్నారంటూ ఆయా శాఖల మంత్రులను దుయ్యబట్టారు. నగరంలో విద్యుత్ సరఫరాకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేస్తున్న నివేదికలన్నీ తప్పులతడకలేనన్నారు. వేలల్లో విద్యుత్ చార్జీలు వసూలు చేస్తూనే చౌకగా విద్యుత్ సరఫరా చేస్తున్నామంటూ పేర్కొనడం అసమంజసమన్నారు. తాము అధికారంలోకి వస్తే 30 శాతం మేర విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని పునరుద్ఘాటించారు. నగరంలోని 40 శాతం ప్రాం తాల ప్రజలకు ఢిల్లీ జల్ బోర్డు నీరు అందడం లేదని కాగ్ తన నివేదికల్లో పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల సంఖ్యలో 15 ఏళ్లలో ఎలాంటి మార్పూ రాలేదన్నారు. సీట్ల కొరత కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గోయల్ ఆవేదన వ్యక్తం చేశారు. -
డీసీసీ అధ్యక్షుడిని నేనే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా క్యామ మల్లేశ్ నియామకం చెల్లదని ఆ పార్టీ సీనియర్ నేత కేఎం ప్రతాప్ అన్నారు. మల్లేశ్‌ను డీసీసీ ఇన్చార్జి అధ్యక్షుడిగా పీసీసీ ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇన్చార్జిల నియామకాలు కొన్ని అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే జరుగుతాయని గుర్తు చేశారు. ఏఐసీసీ అనుమతిలేకుండానే మల్లేశ్ పేరును పీసీసీ ఖరారు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రతాప్ మాట్లాడారు. అధినాయకత్వం అనుమతి మేరకు పీసీసీ చీఫ్‌లు ఆయా జిల్లాల కమిటీలను ఖరారు చేస్తారని, రంగారెడ్డి జిల్లా విషయానికి వచ్చే సరికి.. అధిష్టానం ఆమోదం లేకుండానే మల్లేశ్‌ను నియమించి నట్లు పీసీసీ ఉపాధ్యక్షులు పరస్పర విరుద్ధ ప్రకటనలు జారీ చేసి పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెట్టారని అన్నారు. ఇప్పటికీ తానే డీసీసీ సారథినని, పార్టీ వ్యవహారాలపై అధిష్టానం కూడా తనతోనే ఉత్తర ప్రత్యుత్తరాలను కొనసాగిస్తోందని చెప్పుకొచ్చారు. పార్టీ మార్గదర్శకాలకు భిన్నంగా డీసీసీ ప్రెసిడెంట్‌గా మల్లేశ్ ప్రకటించుకుంటే... చట్టప్రకారం చర్యలు చేపడతానని ప్రతాప్ హెచ్చరించారు. -
ఎంపీ కనిపించడంలేదు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ :‘‘రాష్ట్ర విభజనను అడ్డుకుంటానంటూ బీరాలు పలికాడు.. టక్కుటమారాలతో మీడియాలో ప్రాచుర్యం పొందాడు.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముమ్మాటికీ ఒక్కటిగానే ఉంచుతుందని నమ్మబలికాడు.. ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు.. తీరా రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం పలికేసరికి పత్తాలేకుండాపోయాడు.. నమ్ముకున్న బెజవాడవాసుల ఆశలను వమ్ముచేసి ఢిల్లీ, హైదరాబాద్‌ల చుట్టూ తిరుగుతున్న ఆయన్ను పట్టి ప్రజలకు అప్పగించాలి.. పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయకుండా 16 రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న ఆయన ఆచూకీ తెలపండి’’ అంటూ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.. ఇది విజయవాడ నుంచి పరారై తిరుగుతున్న ఎంపీ లగడపాటి రాజగోపాల్ తీరుపై మండుతున్న సమైక్యాంధ్ర ఉద్యమకారుల గుండెచప్పుడు. మాటల గారడీ, సర్వేల జిమ్మిక్కులతో జనాన్ని బురిడీకొట్టించి కాలాన్ని నెట్టుకొస్తున్న రాజగోపాల్‌కు రాజకీయ సమాధి కడతామంటూ సమైక్యాంధ్ర రాజకీయ విద్యార్థి కో-కన్వీనర్ గాలి సూర్యనారాయణరెడ్డి సోమవారం ప్రకటించారు. అమ్మా రాజగోపాల్ కనిపించాడా.. అయ్యా లగడపాటి తారసపడ్డారా.. అంటూ విజయవాడ నగరంలోని ప్రధాన వీధుల్లో వెతుకుతూ అందరిదీ ఆరా తీస్తూ ఎంపీ తీరుపై మంగళవారం సరికొత్త నిరసనోద్యమం జరగనుంది. ఈ క్రమంలో విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయం నుంచి ఊరేగింపు జరిపేందుకు నిర్ణయించారు.