సంచలన ఫలితాలు!
Published Sun, Dec 8 2013 11:54 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ:‘ఢిల్లీ ఓటర్లు వివేకవంతమైన తీర్పునిచ్చారు’.... ఫలితాల తర్వాత రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య ఇది. ‘మీరు ఇచ్చిన తీర్పు దేశ ప్రజలందరికీ ఆదర్శనీయం’... కౌంటింగ్ అనంతరం ప్రముఖుల పలుకు ఇది. మొత్తానికి కీలెరిగి వాత పెట్టినట్లుగా ఢిల్లీ ఓటరు వ్యవహరించారు. భారీ మెజార్టీని కట్టబెట్టకుండా కమలనాథులను కట్టడి చేసిన దిల్లీవాలా కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ ఆమ్ ఆద్మీకి ప్రతిపక్ష హోదాకు అవసరమైన మెజార్టీనిచ్చి మార్పు కోరుకుంటున్నట్లు దేశానికి చాటిచెప్పాడు. ఇక పాత విధానాలు, కుంభకోణాలు, అవినీతి వంటివి వినీ.. వినీ.. విసుగెత్తిందని, అందుకే మిమ్మల్ని ఇంటికి పంపుతున్నామని చెప్పేందుకు కాంగ్రెస్‌ను సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం చేశాడు. ఈ తీర్పు ద్వారా ఢిల్లీ ఓటరు ఎవరినెక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడన్నది సామాజిక కార్యకర్తల అభిప్రాయం.
క్షణక్షణం ఉత్కంఠగా సాగిన కౌంటింగ్...
విధానసభ ఎన్నికల కౌటింగ్ క్షణ క్షణం ఉత్కంఠరేపుతూ కొనసాగింది. రికార్డు స్థాయిలో నమోదైన పోలింగ్‌లో ఢిల్లీవాసులు ఇచ్చిన తీర్పు అధికార కాంగ్రెస్‌ను చిత్తు చేయగా, పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ కమలం వికసించినా విజయం ముంగిట్లో అడుగు దూరంలో ఆగిపోయింది. ఢిల్లీ ఎన్నికల బరిలోకి దిగినప్పటి నుంచి సంచలనాలకు మారుపేరుగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ విజయంలోనూ అంచనాలను తల్లకిందులు చేసింది. ఒకటి రెండు సీట్లు గెలుస్తారంటూ మొదలైన ఆప్ ప్రస్థానం చివరికి పదిహేనే ళ్ల కాంగ్రెస్ ముఖ్యమంత్రి పీఠాన్నే పెకిలించింది. అత్యధికంగా 28 స్థానాల్లో గెలుపొంది ఆశ్చర్యానికి లోనుచేసింది. పోరులో మొదటి నుంచే చేతులు ఎత్తేసిన కాంగ్రెస్ కేవలం ఎనిమిది స్థానాలే దక్కించుకుని చిత్తుచిత్తుగా ఓడిపోయింది. హేమాహేమీలైన నేతలు కూడా పరాజయంపాలయ్యారు.
హోరాహోరీగా ఫలితాలు...
ఢిల్లీ విధానసభ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఎవరెన్ని సర్వేలు నిర్వహించినా ఓ అంచనాకు రావడంలో నెలకొన్న సందిగ్ధత ఫలితాల అనంతరమూ కొనసాగుతోంది. తొమ్మిది జిల్లాల్లో ఓట్ల లె క్కింపు కోసం కేటాయించిన మొత్తం 14 లెక్కింపు కేంద్రాల్లో ఆదివారం ఉదయం నుంచి ఓట్ల లె క్కింపు ప్రారంభమైంది. మిగతా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఢిల్లీలో కాస్త ఆలస్యంగా కౌంటింగ్ ప్రారంభమైంది. కేవలం 70 స్థానాలే ఉండడంతో కౌటింగ్ మొదలైన రెండు గంటల్లోనే బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు అర్థమైంది. అంతకంతకు సమయం పెరుగుతున్నా కొద్దీ కాంగ్రెస్‌పార్టీ పూర్తిగా ఢీలా పడుతూ వచ్చింది. అనూహ్యంగా దూసుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ 27 స్థానాలు గెలుచుకుంది.
సాయంత్రం వరకు కొనసాగిన కౌంటింగ్‌లో బీజేపీ 33 స్థానాల్లో గెలుపొంది మొదటి స్థానంలో, 27 స్థానాల్లో గెలుపుతో ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. పదిహేనేళ్లుగా ఢిల్లీలో అధికారంలో ఉన్న హస్తం హవా మచ్చుకు కూడా కనిపించలేదు. కేవలం ఏడు స్థానాలతో కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకుంది. ఇక మిగిలిన రెండు స్థానాల్లో మాతియామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీయూ గెలుపొందగా, ముండ్‌కా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి రాంభీర్ షౌకీన్ గెలుపొందారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటికి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అనూహ్యమైన మెజార్టీతో గెలుపొందారు. మొదటి రెండు రౌండ్లలో కాస్త ఆధిక్యం కనబర్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ క్రమంగా ఓటమి దిశగా పయనించారు.
25 వేల ఓట్లతో న్యూఢిల్లీ నియోజకవర్గ ప్రజలు అరవింద్‌కేజ్రీవాల్‌ను గెలిపించారు. ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి డా.హర్షవర్ధన్ మరోమారు కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి సునాయాసంగా గెలుపొందారు. ఆమ్‌ఆద్మీపార్టీ కీలక నేత మనీష్‌సిసోయిడా పట్‌పర్‌గంజ్ నుంచి గెలుపొందారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 36 స్థానాలకు బీజేపీ మూడు అడుగుల దూరంలో ఆగింది. 33 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా 27 స్థానాలతో రెండో స్థానంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరికీ మద్దతు ఇవ్వం.. తీసుకోబోమంటూ ప్రకటించడం అధికారపీఠం ఎవరిదన్నదానిపై పీఠముడి పడింది.
Advertisement
Advertisement