కేజ్రీవాల్‌కు గుజరాత్ సర్కార్ ఝలక్
- ఆప్ సభ నిర్వహణకు అనుమతి నిరాకరణ
అహ్మదాబాద్: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. సూరత్‌లోని ఓ వేదిక వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించతలపెట్టిన కార్యక్రమానికి ఆనందిబెన్ సర్కార్ అనుమతి నిరాకరించింది. ఆ ప్రదేశంలో మరో చోట అయితే అనుమతి ఇస్తామని పేర్కొంది. దీంతో భగ్గుమన్న ఆప్ మొత్తంగా కేజ్రీవాల్ గుజరాత్ పర్యటనను రద్దు చేసింది.
వచ్చే నెల 9, 10 తేదీల్లో రెండురోజుల గుజరాత్ పర్యటనకు కేజ్రీవాల్ రానున్నట్టు ఆప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సౌరాష్ట్రలోని సోమనాథ ఆలయం దర్శనంతో ఈ పర్యటన ప్రారంభమవుతుందని, మార్గమధ్యలో ఆయన రైతులతో మాట్లాడుతారని ఆప్ ఇప్పటికే ప్రకటించింది. 10వ తేదీ సూరత్‌లో వ్యాపారులతో కేజ్రీవాల్ ముచ్చటిస్తారని తెలిపింది. అయితే, సూరత్‌లో తలపెట్టిన సమావేశానికి వేదిక విషయంలో గుజరాత్ సర్కార్ అనుమతి ఇవ్వకపోవడంతో ఈ పర్యటనను పూర్తిగా రద్దయింది. వచ్చే ఏడాది జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేస్తుందని కేజ్రీవాల్ ప్రకటించడంతో తమ పార్టీపై ఆనందిబెన్ సర్కార్ కక్షగట్టి వేధింపులకు పాల్పడుతుందని ఆప్ విమర్శిస్తుండగా.. పబ్లిసీటీ కోసమే ఆప్ ఇలా చేస్తున్నదని బీజేపీ చెప్తోంది.