కేజ్రీవాల్‌కు కిరణ్ బేడీ నోటీసు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికలు కిరణ్ బేడీ, కేజ్రీవాల్‌ల వ్యక్తిగత పోరాటంగా మారిపోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎన్నికల ప్రచార పోస్టర్లపై తన ఫోటోను ప్రచురించి అవకాశవాదిగా చిత్రీకరించటాన్ని ఖండిస్తూ బీజేపీ సీఎం అభ్యర్థి బేడీ ఆప్ సీఎం అభ్యర్థి కేజ్రీవాల్‌కు లీగల్ నోటీసును పంపించారు. కేజ్రీవాల్ తన ఫోటోను తన అనుమతి లేకుండా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. తన ఫోటోను వాడటంపై, తనను అవకాశవాదిగా చిత్రీకరించడంపై సంజాయిషీ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఆప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీలో ఆటోల వెనుక పోస్టర్లు అతికించింది. ఈ పోస్టర్లలో కేజ్రీవాల్, బేడీల ఫోటోలను ముద్రించింది. కేజ్రీవాల్ ఫోటో కింద నిజాయితీపరుడు, బేడీ ఫోటో కింద అవకాశవాది అని రాసి ఉంది. నిజాయితీపరుడైన కేజ్రీవాల్ లేదా అవకాశవాదియైన బేడీలలో ఒకరిని ఎన్నుకోవలసిందిగా ఓటర్లకు సూచించే ఈ పోస్టర్ల పట్ల బీజేపీ మండిపడింది. పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ అబద్ధాలు ప్రచారం చేయటం ఆప్‌కు ఓ అలవాటుగా మారిందన్నారు. కేజ్రీవాల్‌పై చర్య తీసుకోవాలని ఈసీని కోరతామని బేడీ చెప్పారు.
‘కేజ్రీవాల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయండి’
మరోవైపు ఎన్నికల నియమావళిని కేజ్రీవాల్ ఉల్లంఘించారని, అందువల్ల ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఓటర్లకు లంచాలు ఇస్తున్నారంటూ పార్టీ ప్రతిష్టను కేజ్రీవాల్ దెబ్బతీశారని బీజేపీ ఆరోపించగా, నామినేషన్‌లో తప్పుడు చిరునామా ఇచ్చారని కాంగ్రెస్ ఆరోపించింది. రాహుల్ రోడ్ షో... కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఆరంభించారు. మంగళవారం దక్షిణ ఢిల్లీలో రోడ్ షో నిర్వహించారు. కాల్కాజీ, గోవింద్‌పురిల మీదుగా జరిగిన రోడ్ షోలో మాట్లాడుతూ ప్రధాని మోదీ మాటలు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారని, పనులు చేయడం లేదని ఆరోపించారు. దేశంలో ముగ్గురు నలుగురు పారిశ్రామిక వేత్తల పనులు మాత్రమే జరుగుతున్నాయన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తామని.. పేదలకు విద్యుత్తు, మంచినీటిని అతి తక్కువ ధరలకు అందిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.
కేజ్రీవాల్‌కు ఈసీ మందలింపు..
కేజ్రీవాల్‌ను ఎన్నికల సంఘం తీవ్రంగా మందలించింది. ఢిల్లీ ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్, బీజేపీల నుంచి లంచం తీసుకుని తన పార్టీకి ఓటేయాలని ఓటర్లను కోరడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని హెచ్చరించింది. పలు మార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ, పదే పదే ఆ విషయాన్ని ప్రస్తావించటం సరి కాదని స్పష్టం చేసింది. ఇలాంటి ప్రకటనలు పదే పదే చేస్తే తీవ్రమైన చర్య తీసుకోవలసి వస్తుందని తేల్చి చెప్పింది. బీజేపీ, కాంగ్రెస్‌ల ఫిర్యాదులపై ఈసీ కేజ్రీవాల్‌ను సంజాయిషీ కోరింది. ఆయన తన వివరణలో తన మాటల్ని సమర్థించుకున్నారు. ‘బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు ఇచ్చే డబ్బులను తిరస్కరించకండి. తీసుకోండి. ఓటు మాత్రం ఆప్‌కు వేయండి. ఈ సారి వాళ్లను ఫూల్స్ చేద్దాం’ అని కేజ్రీవాల్ ఓటర్లకు చెప్పడం తెలిసిందే.