జైట్లీని ప్రాసిక్యూట్ చేయాలంది!
ఎస్‌ఎఫ్‌ఐఓ సిఫారసు చేసిందంటూ కీర్తి ఆజాద్ ఆరోపణ
♦ డీడీసీఏపై దర్యాప్తు నిలిపేయాలని కమిషనర్‌కు జైట్లీ లేఖ రాశారన్న ఆప్
♦ కేజ్రీవాల్, కీర్తి తదితరులపై పరువునష్టం దావాకు డీడీసీఏ నిర్ణయం
న్యూఢిల్లీ: ఢిల్లీ, జిల్లా క్రికెట్ సంఘం(డీడీసీఏ) వ్యవహారంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై దాడిని బుధవారం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బహిష్కృత బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ మరింత తీవ్రం చేశారు. సిండికేట్ బ్యాంక్ క్రికెట్ క్లబ్‌పై దర్యాప్తును నిలిపేయాలంటూ 2011లో డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అరుణ్ జైట్లీ నాటి పోలీస్ కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చారని ఆప్ ఆరోపించింది. జైట్లీని ప్రాసిక్యూట్ చేయాలంటూ ఎస్‌ఎఫ్‌ఐఓ దర్యాప్తు నివేదిక సిఫారసు చేసిందని కీర్తి ఆజాద్ వెల్లడించారు. నిరాధార ఆరోపణలు చేస్తూ అప్రతిష్ట పాలు చేస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కీర్తి ఆజాద్, పలువురు ఆప్ నేతలపై పరువునష్టం దావా వేయాలని నిర్ణయించినట్లు డీడీసీఏ పేర్కొంది.
డీడీసీఏ అవకతవకలకు సంబంధించి జైట్లీపై విచారణకు తీవ్ర స్థాయి నేరాల దర్యాప్తు కార్యాలయం(ఎస్‌ఎఫ్‌ఐఓ) దర్యాప్తు నివేదిక సిఫారసు చేసిందని కీర్తి ఆజాద్ పేర్కొన్నారు. గత మూడేళ్లుగా ఆ సిఫారసు అమలు కాలేదన్నారు. కుమారుడికి క్రికెట్ టీంలో స్థానం కావాలంటే తన కోరిక తీర్చాలన్న డీడీసీఏ అధికారి ఉదంతాన్ని కేజ్రీవాల్ వెల్లడించడంపై స్పందిస్తూ.. అలాంటివి డీడీసీఏలో సాధారణమేనని, తాను 2007లోనే అలాంటి అంశాలను లేవనెత్తానని పేర్కొన్నారు.
బీసీసీఐపై పర్యవేక్షణకు సంబంధించిన ఒక బిల్లును యూపీఏ హయాంలో తీసుకురావడానికి నాటి క్రీడాశాఖ మంత్రి అజయ్ మాకెన్ చేసిన ప్రయత్నాలను బీసీసీఐతో సంబంధాలున్న జైట్లీ, అనురాగ్ ఠాకూర్(ప్రస్తుతం బీజేపీ ఎంపీ, బీసీసీఐ కార్యదర్శి), రాజీవ్ శుక్లా, జ్యోతిరాదిత్య సింధియా, ఫారూఖ్ అబ్దుల్లా, ప్రఫుల్ పటేల్ తదితరులు అడ్డుకున్నారని ఆజాద్ ఆరోపించారు. బ్యాంక్ అకౌంట్లలో రూపాయి లేనివారు కూడా డీడీసీఏలో అధికారులుగా చేరాక కోటీశ్వరులయ్యారని, ఒక మ్యాచ్‌కు సెలెక్ట్ చేయడానికి రూ. 4 లక్షలు, ఒక సీజన్‌కైతే రూ. 10 లక్షలు వసూలు చేశారని ఆజాద్ దుయ్యబట్టారు.
జైట్లీపై ఆరోపణల జోరు పెంచుతూ..
2011లో ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీకే గుప్తాకు, స్పెషల్ కమిషనర్ రంజిత్ నారాయణ్‌కు జైట్లీ రాసిన రెండు లేఖలను ఆప్ విడుదల చేసింది. సిండికేట్ బ్యాంక్ క్రికెట్ క్లబ్ విషయంలో డీడీసీఏ ఎలాంటి తప్పు చేయలేదని, విచారణ పేరుతో పోలీసులు అనవసర వేధింపులకు గురి చేస్తున్నట్లుగా డీడీసీఏ అధికారులు భావిస్తున్నారని, అందువల్ల ఈ కేసు విషయంలో న్యాయంగా ఆలోచించి కేసును మూసేయాల్సిందిగా జైట్లీ కోరినట్లు ఆ లేఖల్లో ఉంది. తాజా రుజువుల తరువాతైనా జైట్లీ రాజీనామా చేయాలని ఆప్ నేత అశుతోష్ డిమాండ్ చేశారు. ఆప్, ఆజాద్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. పోలీసు అధికారులకు జైట్లీ లేఖ రాయడంలో తప్పేంటని పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు ప్రశ్నించారు.