పోటాపోటీ నిరసన
Published Tue, Feb 4 2014 10:45 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
తమ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ సీనియర్ నాయకుడు అరుణ్‌జైట్లీ నివాసం ఎదుట నిర్వహించిన ప్రదర్శన ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరు పార్టీల మధ్య తీవ్రవాగ్వాదం జరగడంతో పోలీసులు అందరినీ అదుపు చేయాల్సి వచ్చింది. ఆప్ ఎమ్మెల్యే మదన్‌లాల్ నివాసం ఎదుట బీజేపీ కార్యకర్తలు కూడా ఆందోళన చేశారు.
సాక్షి, న్యూఢిల్లీ:భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ నివాసం ఎదుట ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంగళవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. వీరి ఆందోళనను వ్యతిరేకించడానికి బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆప్ కార్యకర్తలు జైట్లీకి వ్యతిరేకంగా, బీజేపీ కార్యకర్తలు కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరుణ్ జైట్లీ తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్ని ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతున్నారని ఆరోపిస్తూ ఆప్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన ఆందోళనలో స్మృతి ఇరానీ, పర్వేశ్ వర్మ పాల్గొన్నారు. నిరసన ప్రదర్శన దృష్ట్యా అరుణ్ జైట్లీ నివాసం వద్ద పోలీసులు బారీ భద్రతా ఏర్పాట్లు చేసి బారికేడ్లు అమర్చారు.
దక్షిణ ఢిల్లీలోని కైలాష్‌కాలనీలోని జైట్లీ నివాసం ఎదుట మంగళవారం ఉదయం నాటకీయ పరిణామాలు కనిపించాయి. బారికేడ్లకు ఓ వైపున ఆప్ కార్యకర్తలు, మరో వైపున బీజేపీ కార్యకర్తలు ప్రదర్శనలు నిర్వహించారు. త మ ప్రభుత్వాన్ని కూల్చడానికి, తమ ఎమ్మెల్యేలను కొనడానికి హర్షవర్ధన్, అరుణ్ జైట్లీ, నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను బట్టబయలు చేయడానికి మంగళవారం నుంచి ‘పోల్ ఖోల్ అభియాన్’ను చేపట్టనున్నట్లు ఆప్ ప్రకటించింది.
ఇందులో భాగంగానే ఆప్ కార్యకర్తలు మంగళవారం ఉదయం జైట్లీ నివాసం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. వీరంతా జైట్లీ నివాసానికి చేరుకున్న కాసేపటికి బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చి కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు ప్రారంభించారు. అరుణ్ జైట్లీ బయటకు వచ్చి తనకు మద్దతు పకలడానికి వచ్చిన బీజేపీ కార్యకర్తలతో మాట్లాడారు. పాలనలో విఫలమైన కేజ్రీవాల్ సర్కారు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అసత్య, మోసపూరిత ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. జైట్లీ ఇంటి ఎదుట పరస్పర వ్యతిరేక నినాదాలతో ఆప్, బీజేపీ కార్యకర్తలు జరిపిన ప్రదర్శన దాదాపు రెండుగంటలకు పైగా కొనసాగింది. ఈ సందర్భంగా ఇరుపార్టీల కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. పోలీసులు ఆందోళనకారులను దూరంగా తీసుకెళ్లారు.
మదన్‌లాల్ నివాసం వద్ద బీజేపీ ఆందోళన
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మదన్‌లాల్ నివాసం వద్ద బీజేపీ కార్యకర్తలు మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆప్ సర్కారును కూల్చడం కోసం అరుణ్ జైట్లీ, నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో ఆరోపించడం తెలిసిందే. ‘ఎన్నికల ఫలితాలు వెలువడడానికి సరిగ్గా ఒరోజు ముందు అంటే.. డిసెంబర్ ఏడు అర్ధరాత్రి 12.30 గంటలకు నాకు ఐఎస్‌డీ కాల్ వచ్చింది.
మరుసటి ఉదయం అరుణ్‌జైట్లీతో మాట్లాడిస్తానని కాలర్ చెప్పాడు. నేను ‘షటప్’ అని ఫోన్ పెట్టేశాను. తరువాత రెండు రోజులకు.. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకమునుపు నన్ను సంప్రదించిన వ్యక్తి మళ్లీ మాట్లాడాడు. ఆప్‌కు ఎలాగూ మెజారిటీ లేదు కాబట్టి తమకు మద్దతు ఇస్తే అన్నీ ఇస్తామని అన్నాడు.తాజాగా పది రోజుల కిందట ఇద్దరు వ్యక్తులు నా దగ్గరికి వచ్చారు. వారిలో ఒకరు తనకు పరిచయస్తుడు. మరొకరు నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడు. తొమ్మిది మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని కూల్చేయాలని కోరాడు’ అని మదన్‌లాల్ వివరించారు. ఇందుకు ప్రతిఫలంగా తనను ముఖ్యమంత్రిని, మిగతావారిని మంత్రులను చేస్తానని ప్రతిపాదించాడని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కావాలనుకునేవారికి రూ.20 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చాడన్నారు.
Advertisement