బిజెపికి సీట్లు పెరిగినా ఓట్లు తగ్గాయి
Published Wed, Dec 11 2013 1:14 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌ను మట్టికరిపించడంతో పాటు బీజేపీ ఓటు బ్యాంకును కూడా కొల్లగొట్టింది. ఓట్ల దామాషా ప్రకారం చూస్తే పాలక పక్షం కాంగ్రెస్‌కే కాక ప్రతిపక్షంలో ఉన్న బీజేపీకి కూడా సెగచూపించినట్లు కనిపిస్తోంది. విధాన సభ ఎన్నికలలో బీజేపీకి ఇంత తక్కువ ఓట్లు ఇంతకు మునుపెన్నడూ రాలేదు. విధాన సభ ఎన్నికలలో బీజేపీకి సీట్ల సంఖ్య పెరిగినప్పటికీ ఓట్ల సంఖ్య తగ్గింది. మొత్తం ఓట్లలో 33.78 శాతం ఓట్లు బీజేపీ గెల్చుకొంది. గత అసెంబ్లీ ఎన్నికలలో 14 శాతం ఓట్లు పొందిన బీఎస్పీకి కూడా ఈసారి 9 శాతం ఓట్లతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది.
తొలిసారిగా శాసనసభ ఎన్నికలలో పోటీచేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి 30 శాతం ఓట్లు సాధించింది. 2008 ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి దాదాపు మూడు శాతం ఓట్లు తగ్గాయి. 1993 తొలి శాసనసభ ఎన్నికలలో బీజేపీ 42 .82 శాతం ఓట్లు దక్కించుకుని 49 సీట్లు గెలిచింది. 1998లో 15 సీట్లు గెలిచినప్పటికీ 35.58 శాతం ఓట్లు వచ్చాయి. 2003 ఎన్నికలలో 20 సీట్లు, 35.22 శాతం ఓట్లు వచ్చాయి. 2008 ఎన్నికలలో 36.83 శాతం ఓట్లతో 23 స్థానాలను గెలుచుకుంది. ఈసారి 33.78 ఓట్లు పొందింది. చిత్తుగా ఓటమి చవిచూసిన కాంగ్రెస్‌కు 24.40 శాతం ఓట్లు పొందింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌కు 15 శాతం ఓట్లు తగ్గాయి. 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ 40.30 ఓట్లు వచ్చాయి.
Advertisement
Advertisement