పితాని పాట్లు | problems which have accumulated in the villages racchabanda program | Sakshi
Sakshi News home page

పితాని పాట్లు

Published Thu, Nov 14 2013 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM

problems which have accumulated in the villages racchabanda program

సాక్షి ప్రతినిధి, ఏలూరు :  రచ్చబండ.. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమం. రాష్ట్ర సాం ఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా మార్చేశారు. నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న రచ్చబండ సభల్లో ప్రజల గురించి మాట్లాడటం, వారి సమస్యల్ని పట్టించుకోవడం మానేసి ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా సమస్యలల్ని పరిష్కరించిందేమీ లేకపోయినా ఆరోపణలతో హడావుడి చేస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జిల్లాలో పలుచోట్ల జరిగిన రచ్చబండ సభల్లో ఇదేరీతిన వ్యవహరించిన మంత్రి పితాని మంగళవారం తూర్పుగోదావరి జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్లి అక్కడ కూడా తన తిట్ల పురాణానికి తెరలేపారు.
 
 కాంగ్రెస్ పార్టీ కుదేలవడంతో రాబోయే ఎన్నికల్లో తన ఉనికి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడటంతో ఆయనలో అసహనం పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన ఎక్కడబడితే అక్కడ రాజకీయాలు మాట్లాడేస్తున్నారు. పక్కన జిల్లా ఉన్నతాధికారులను పెట్టుకుని మరీ రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. బుధవారం పెరవలిలో జరిగిన రచ్చబండ సభలో అదేపనిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైనా విమర్శలు చేశారు. పనిలో పనిగా తెలుగుదేశంపైనా ఆరోపణలు చేశారు. తాను చేసిన ఆరోపణలు, విమర్శలను బలపర్చుకునేందుకు మధ్యమధ్యలో ప్రజల్ని ‘అవునా.. కాదా’ అని సభకొచ్చిన ప్రజలను అడిగారు. వారేమీ స్పందించకపోయినా తనపాటికి తాను మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. ఏలూరులో రచ్చబండ ప్రారంభ సభలోనూ ఇలాగే విమర్శలు గుప్పించారు. ఇలా రచ్చబండ కార్యక్రమాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడంపై నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తమ బాధలు తీర్చాలని ప్రజలు నిలదీస్తుంటే పట్టించుకోకుండా పితాని వ్యవహరిస్తున్న తీరుతో అధికారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. 
 
 ఉద్యమ సమయంలో గప్‌చుప్
 మొన్నటివరకూ సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరిగింది. మంత్రి పితాని ఎక్కడకు వెళ్లినా ప్రజలు నిలదీశారు. దీంతో అప్పట్లో ఆయన జిల్లాలో పర్యటనలను తగ్గించుకున్నారు. ఆ సమయంలో రాజకీయాలు మాట్లాడినా ఎవరూ వినే పరిస్థితులు లేకపోవడంతో మిన్నకుండిపోయూరు. కొద్దిరోజుల నుంచి ఉద్యమ ప్రభావం తగ్గడంతో ఆయన స్వరం మళ్లీ పెరిగింది. ఈ సమయంలోనే రచ్చబండ సభలు జరుగుతుండటంతో  వాటిని పూర్తిగా తన రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు. 
 
 సీఎం మెప్పు కోసం అగచాట్లు
 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వీరవిధేయుడుగా మారిన పితాని ఆయన మెప్పు కోసం ఎక్కడికక్కతే అక్కడ రాజకీయాలు మాట్లాడేస్తున్నారు. సీఎంను అదేపనిగా పొగుడుతూ, ప్రత్యర్థులను తిడుతూ ముందుకెళుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ తదితర పథకాలు అందక జనం ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా సంక్షేమ పథకాలన్నీ నిరాటంకంగా అమలవుతున్నాయని ఢంకా బజాయించి మరీ అబద్ధాలు చెబుతున్నారు. ఏ ఒక్కరికీ మేలు జరగకపోయినా ముఖ్యమంత్రి ఘనతను, ఆయన ప్రవేశపెట్టిన పథకాలను కీర్తించడమే పనిగా పెట్టుకుని ముందుకెళుతున్నారు. పితాని భక్తికి మెచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఇటీవలే ఆయనకు ఆర్ అండ్ బీ శాఖ బాధ్యతలను అదనంగా అప్పజెప్పారు. దీంతో పితాని తన విధేయతను మరింతగా చాటుకునేందుకు రచ్చబండను వేదిక చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement