racchabanda program
-
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి రద్దు
గరిడేపల్లి (హుజూర్నగర్): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం లోకి రాగానే ధరణి పోర్టల్‌ను రద్దు చేసి రెవెన్యూ వ్యవ స్థను పటిష్టం చేస్తామని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. సోమవారం ఆయన సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహిం చారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ధరణి పోర్టల్ భూకబ్జాలకు, అక్రమాలకు అనుకూలంగా ఉందని, దీంతో పేదలకు న్యాయం జరగడం లేదని విమర్శించారు. 2023 జన వరి, ఫిబ్రవరి మధ్య అసెంబ్లీ రద్దవుతుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కచ్చి తంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, హుజూర్‌నగర్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ నుంచి హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి వరకు ఇసుక మాఫియా, మైన్స్, వైన్స్, కాంట్రాక్టర్లు, కమీషన్ల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో రాత్రి 3 గంటలకు కరెంట్ నిలుపు దల చేసి ఎలాంటి నోటీసులివ్వకుండా ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని మండిపడ్డారు. హుజూర్నగర్, మఠంపల్లి మండలాల్లో వందల ఎకరాల్లో భూములు ఆక్రమించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో కలెక్టర్, ఎస్పీ సమాధానం చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
కొవ్వూరు, న్యూస్‌లైన్ :ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. కొవ్వూరు పీఎంఎంఎం హైస్కూల్లో బుధవారం నిర్వహించిన మండల, పట్టణ రచ్చబండ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మూడో విడత రచ్చబండలో 18 లక్షల మందికి రేషన్ కార్డులు, 14 లక్షల మందికి ఇళ్ల మంజూరు పత్రాలు అందించామని చెప్పారు. మొదటి విడత రచ్చబండలో 6 లక్షల మందికి, రెండో విడతలో 14 లక్షల మందికి రేషన్ కార్డులు అందించామన్నారు. మొదటి విడతలో 3 లక్షల మందికి, రెండో విడతలో 5 లక్షల మందికి, మూడో విడతలో 9 లక్షల మందికి పింఛన్లు అందించినట్టు తెలిపారు. ఇందిరమ్మ కలల్లో భాగంగా రాష్ట్రంలో 4.98 లక్షల మంది ఎస్సీలకు, 5.15లక్షల మంది ఎస్టీలకు 50 యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకున్న వారి బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మందికి, జిల్లాలో 2,020 మందికి బంగారుతల్లి పథకం అమలు చేస్తున్నట్టు చెప్పారు. కొవ్వూరు, నిడదవోలు ఆర్టీసీ డిపోలను పునరుద్ధరించేందుకు కృషిచేస్తున్నామన్నారు.కొవ్వూరులోని వెంకమ్మ చెరువు వద్ద రోడ్డు మలుపులను సరిచేసే ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే టీవీ రామారావు మాట్లాడుతూ ఇక్కడకు వచ్చిన వారందరికి లబ్ధి చేకూరుతుందా లేదా అని సభకు హాజరైన జనాన్ని ఉద్దేశించి ప్రశ్నించగా పథకాలు అందడం లేదని 80 శాతం మందికిపైగా చేతులెత్తడంతో వేదికపై ఉన్న వారంతా నోళ్లెళ్లబెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముదునూరి నాగరాజు మాట్లాడుతూ అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం లబ్ధిదారులకు మంత్రి పితాని, ఎమ్మెల్యే రామారావు మంజూరు పత్రాలను అందజేశారు. టీడీపీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి సూరపనేని చిన్ని, ఏఎంసీ చైర్మన్ బూరుగుపల్లి వీర్రాఘవులు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు ఆత్కూరి దొరయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పితాని పాట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రచ్చబండ.. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమం. రాష్ట్ర సాం ఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా మార్చేశారు. నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న రచ్చబండ సభల్లో ప్రజల గురించి మాట్లాడటం, వారి సమస్యల్ని పట్టించుకోవడం మానేసి ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా సమస్యలల్ని పరిష్కరించిందేమీ లేకపోయినా ఆరోపణలతో హడావుడి చేస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జిల్లాలో పలుచోట్ల జరిగిన రచ్చబండ సభల్లో ఇదేరీతిన వ్యవహరించిన మంత్రి పితాని మంగళవారం తూర్పుగోదావరి జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్లి అక్కడ కూడా తన తిట్ల పురాణానికి తెరలేపారు. కాంగ్రెస్ పార్టీ కుదేలవడంతో రాబోయే ఎన్నికల్లో తన ఉనికి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడటంతో ఆయనలో అసహనం పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన ఎక్కడబడితే అక్కడ రాజకీయాలు మాట్లాడేస్తున్నారు. పక్కన జిల్లా ఉన్నతాధికారులను పెట్టుకుని మరీ రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. బుధవారం పెరవలిలో జరిగిన రచ్చబండ సభలో అదేపనిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా, వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనా విమర్శలు చేశారు. పనిలో పనిగా తెలుగుదేశంపైనా ఆరోపణలు చేశారు. తాను చేసిన ఆరోపణలు, విమర్శలను బలపర్చుకునేందుకు మధ్యమధ్యలో ప్రజల్ని ‘అవునా.. కాదా’ అని సభకొచ్చిన ప్రజలను అడిగారు. వారేమీ స్పందించకపోయినా తనపాటికి తాను మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. ఏలూరులో రచ్చబండ ప్రారంభ సభలోనూ ఇలాగే విమర్శలు గుప్పించారు. ఇలా రచ్చబండ కార్యక్రమాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడంపై నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తమ బాధలు తీర్చాలని ప్రజలు నిలదీస్తుంటే పట్టించుకోకుండా పితాని వ్యవహరిస్తున్న తీరుతో అధికారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యమ సమయంలో గప్‌చుప్ మొన్నటివరకూ సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరిగింది. మంత్రి పితాని ఎక్కడకు వెళ్లినా ప్రజలు నిలదీశారు. దీంతో అప్పట్లో ఆయన జిల్లాలో పర్యటనలను తగ్గించుకున్నారు. ఆ సమయంలో రాజకీయాలు మాట్లాడినా ఎవరూ వినే పరిస్థితులు లేకపోవడంతో మిన్నకుండిపోయూరు. కొద్దిరోజుల నుంచి ఉద్యమ ప్రభావం తగ్గడంతో ఆయన స్వరం మళ్లీ పెరిగింది. ఈ సమయంలోనే రచ్చబండ సభలు జరుగుతుండటంతో వాటిని పూర్తిగా తన రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు. సీఎం మెప్పు కోసం అగచాట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వీరవిధేయుడుగా మారిన పితాని ఆయన మెప్పు కోసం ఎక్కడికక్కతే అక్కడ రాజకీయాలు మాట్లాడేస్తున్నారు. సీఎంను అదేపనిగా పొగుడుతూ, ప్రత్యర్థులను తిడుతూ ముందుకెళుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ తదితర పథకాలు అందక జనం ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా సంక్షేమ పథకాలన్నీ నిరాటంకంగా అమలవుతున్నాయని ఢంకా బజాయించి మరీ అబద్ధాలు చెబుతున్నారు. ఏ ఒక్కరికీ మేలు జరగకపోయినా ముఖ్యమంత్రి ఘనతను, ఆయన ప్రవేశపెట్టిన పథకాలను కీర్తించడమే పనిగా పెట్టుకుని ముందుకెళుతున్నారు. పితాని భక్తికి మెచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఇటీవలే ఆయనకు ఆర్ అండ్ బీ శాఖ బాధ్యతలను అదనంగా అప్పజెప్పారు. దీంతో పితాని తన విధేయతను మరింతగా చాటుకునేందుకు రచ్చబండను వేదిక చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
రేపు సీఎం రాక
ఏలూరు, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 15వ తేదీన జిల్లాకు రానున్నారు. పోడూరు మండలం జగన్నాథపురంలో ఆచంట నియోజకవర్గ రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 15న మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి హెలికాప్టర్లో పెనుగొండ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జగన్నాథపురం వెళతారు. రచ్చబండ తర్వాత సాయంత్రం ఆరు గంటలకు పెనుగొండ ఏఎంసీ కార్యాలయానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆ తర్వాత రోజు పెనుగొండ నుంచి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. అయితే సీఎం పర్యటన షెడ్యూల్ అధికారికంగా ఇంకా వెల్లడి కాలేదు. ఒకవేళ 15న సీఎం రాకపోతే 16న ఆయన పర్యటన ఉంటుందని జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు.