ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
Published Thu, Nov 14 2013 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM
కొవ్వూరు, న్యూస్‌లైన్ :ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. కొవ్వూరు పీఎంఎంఎం హైస్కూల్లో బుధవారం నిర్వహించిన మండల, పట్టణ రచ్చబండ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మూడో విడత రచ్చబండలో 18 లక్షల మందికి రేషన్ కార్డులు, 14 లక్షల మందికి ఇళ్ల మంజూరు పత్రాలు అందించామని చెప్పారు. మొదటి విడత రచ్చబండలో 6 లక్షల మందికి, రెండో విడతలో 14 లక్షల మందికి రేషన్ కార్డులు అందించామన్నారు.
మొదటి విడతలో 3 లక్షల మందికి, రెండో విడతలో 5 లక్షల మందికి, మూడో విడతలో 9 లక్షల మందికి పింఛన్లు అందించినట్టు తెలిపారు. ఇందిరమ్మ కలల్లో భాగంగా రాష్ట్రంలో 4.98 లక్షల మంది ఎస్సీలకు, 5.15లక్షల మంది ఎస్టీలకు 50 యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకున్న వారి బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మందికి, జిల్లాలో 2,020 మందికి బంగారుతల్లి పథకం అమలు చేస్తున్నట్టు చెప్పారు. కొవ్వూరు, నిడదవోలు ఆర్టీసీ డిపోలను పునరుద్ధరించేందుకు కృషిచేస్తున్నామన్నారు.కొవ్వూరులోని వెంకమ్మ చెరువు వద్ద రోడ్డు మలుపులను సరిచేసే ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.
సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే టీవీ రామారావు మాట్లాడుతూ ఇక్కడకు వచ్చిన వారందరికి లబ్ధి చేకూరుతుందా లేదా అని సభకు హాజరైన జనాన్ని ఉద్దేశించి ప్రశ్నించగా పథకాలు అందడం లేదని 80 శాతం మందికిపైగా చేతులెత్తడంతో వేదికపై ఉన్న వారంతా నోళ్లెళ్లబెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముదునూరి నాగరాజు మాట్లాడుతూ అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం లబ్ధిదారులకు మంత్రి పితాని, ఎమ్మెల్యే రామారావు మంజూరు పత్రాలను అందజేశారు. టీడీపీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి సూరపనేని చిన్ని, ఏఎంసీ చైర్మన్ బూరుగుపల్లి వీర్రాఘవులు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు ఆత్కూరి దొరయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement