minister pithani satyanarayana
-
మంత్రి పితాని పాదయాత్రకు చుక్కెదురు
-
పితాని సెగ్మెంట్లో అంతర్గత కుమ్ములాటలు
ఆచంట: ముందొచ్చిన కొమ్ములకంటే వెనుకొచ్చిన చెవులు వాడి అన్న రీతిలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు నడుస్తుండడంతో ఆ పార్టీలో అసంతృప్తి చాపకింద నీరులా సాగుతోంది. వర్గ విభేదాలకు స్వస్తిచెప్పి ఐక్యతతో పని చేస్తున్నామని పైకి చెప్పుకుంటున్నా లోలోపల మాత్రం ఒకరి వెనుక మరొకరు గోతులు తీసే కార్యక్రమాలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా సాగించేస్తున్నారు. రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకర్గంలో కుమ్ములాటలపై తెలుగు తమ్ముళ్లు కలవరపడుతున్నారు. పితాని రాకతో తెరవెనక్కి సీనియర్లు టీడీపీ ఆవిర్భావం నుంచి 2009 డీలిమిటేషన్ ముందు వరకూ ఆచంట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగింది. డీలిమిటేషన్ తర్వాత పెనుగొండ నియోజకవర్గం రద్దయి ఆచంటలో విలీనమైంది. దీంతో నియోజకవర్గ స్వరూపమే కాదు, రాజకీయ సమీకరణలూ మారిపోయాయి. పితాని పెనుగొండ నుంచి వలస వచ్చి 2009లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2014లో ఆయన చివరి నిమిషంలో టీడీపీలోకి చేరడంతో ఆయన అనుచరులు కూడా ఆ పార్టీలో చేరారు. ఆచంట నుంచి రెండవసారి పోటీచేసి అతికష్టంమీద బయటపడ్డారు. పితాని మొదట్లో టీడీపీలో ఇమడడానికి కొంత ఇబ్బందిపడ్డా రాను రాను పార్టీలో పట్టు సాధించారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిందన్న ఆనందం తెలుగు తమ్ముళ్లకు ఎంతో కాలం నిలువలేదు. పథకాలు, లబ్ధిదారుల ఎంపిక, అభివృద్ధి పనులు, పార్టీ సంస్థాగత ఎన్నికలు తదితరాలలో పితాని ఆయన అనుచరుల హవా కొససాగింది. దీంతో పూర్వం నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తెలుగు తమ్ముళ్లకు పెత్తనం చెలాయించే అవకాశం లేకపోయింది. పార్టీ అధికారంలో ఉన్నా అందలం దక్కని పరిస్థితి ఏర్పడింది. దీంతో దగాపడ్డ తెలుగుతమ్ముళ్లలో అంతర్మధనం మొదలైంది. కొంత కాలంపాటు పార్టీకి తెలుగు తమ్ముళ్లు తెరవెనక్కి వెళ్లిపోయారు. తదనంతరం అధినేత ఆదేశాల మేరకు పితానితో కలిసిపోయారు. అయితే మనుషులు కలి సారే తప్ప వారి మనసులు మాత్రం కలవడంలేదు. సీనియర్ నేతపై చిన్నచూపు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యకలాపాలన్నీ ఆచంటలోని గొడవర్తి రామారావుకు చెందిన గంధర్వమహల్ (పెద్దమేడ) నుంచే సాగేవి. ఆయన నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. పార్టీ ఆయనకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించింది. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌తోపాటు, ఇతర పదవులు కట్టబెట్టింది. ఆయన మరణంతో కుమారుడు గొడవర్తి శ్రీరాములు రంగప్రవేశం చేసి పార్టీలో పట్టు సాధించారు. రెండుసార్లు గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగారు. పితాని అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరికతో గొడవర్తి కుటుంబం ఆధిపత్యానికి చెక్ పడింది. మొదట్లో పితానిని వ్యతిరేకించిన గొడవర్తి శ్రీరాములు కూడా తదనంతరం పార్టీ అధినేత ఆదేశాల మేరకు పితానితో చేతులు కలిపారు. దీంతో పెద్దమేడకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని భావించారు. కానీ నేడు పార్టీలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. పితానికి మాత్రం పార్టీ మంత్రి పదవి కట్టబెడితే సీనియర్ నేత గొడవర్తికి కనీసం నామినేటెడ్ పోస్టు కూడా దక్కలేదు. దీంతో గొడవర్తి వర్గీయులు పైకి చెప్పుకోలేకపోయినా లోలోపల అ«ధినేతపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. గొడవర్తి అనుచరులు అడపాదడపా మాత్రమే పితాని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎంపీపీ వర్సెస్ సర్పంచ్‌లు ఇక అధికార పార్టీకే చెందిన ఎంపీపీ మేకా పద్మకుమారికి మండలంలోని సర్పంచ్‌లకు పొసగడం లేదు. సర్పంచ్‌లు ఎన్నికైన తర్వాత పితాని వర్గీయులుగా ముద్రపడ్డారు. ఎంపీపీ గొడవర్తి వర్గంగా ముద్రపడ్డారు. ఎంపీపీ కూడా కొంత కాలంపాటు మంత్రి పితానిని వ్యతిరేకించినా తర్వాత ఆయనతో కలిసి పనిచేస్తున్నారు. ఇటీవల ఎంపీడీఓకు ఎంపీపీకి అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. ఎంపీడీఓపై ఉన్నతాధికారికి ఫిర్యాదులు వెళ్లాయి. నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రికి తెలియకుండా నేరుగా ఎంపీడీఓపై ఫిర్యాదు చేయడాన్ని పలువురు నాయకులు ఎంపీపీని తప్పుబట్టారు. ఎంపీపీ ఎంపీడీవో పనితీరును వ్యతిరేకిస్తుంటే సర్పంచ్‌లు మాత్రం ఎంపీపీ తీరును వ్యతిరేకిస్తూ ఎంపీడీఓ పక్షాన నిలుస్తున్నారు. ఏది ఏమైనా అధికార పార్టీలో రోజు రోజుకు పెరుగుతున్న అసంతృప్తి, తెలుగు తమ్ముళ్ల మధ్య కుమ్ములాటలు ముందు ముందు పార్టీకి తీవ్ర నష్టమేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఎలక్ట్రానిక్ మీడియాతోనే సమస్య: మంత్రి
విజయవాడ: ఎలక్ట్రానిక్ మీడియాపై మంత్రి పితాని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఛానెల్స్ రేటింగ్ కోసమే మంత్రి లోకేష్ వ్యాఖ్యలను ప్రచారం చేస్తున్నాయి.. మాట్లాడే సమయంలో తప్పులు దొర్లడం సహజమని సమర్ధించారు. ప్రింట్ మీడియా తో ఎటువంటి ఇబ్బంది లేదంటూనే ఆయన ఎలక్ట్రానిక్ మీడియా తోనే సమస్య అంతా ఎదురవుతోందని చెప్పుకొచ్చారు. లోకేష్ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పెట్టి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. -
పర్యాటక కేంద్రంగా దొంగరావిపాలెం
దొంగరావిపాలెం (పెనుగొండ) : దొంగరావిపాలెంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. మంగళవారం దొంగరావిపాలెంలోజరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దొంగరావిపాలెం వద్ద లంకభూములు, గోదావరిలో నీటి నిల్వలు ఉండడంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇప్పటికే రూ.36 లక్షలతో పర్యాటక కేంద్ర పనులు ప్రారంభమయ్యాయన్నారు. బోటు షికారు, విశ్రాంతి ప్రాంతాల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. త్వరలోనే ఏటిగట్టు పొడవునా రెస్టారెంట్లు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షిస్తామన్నారు. రాబోయే రెండేళ్లలో దొంగరావిపాలెం పర్యాటకులతో కళకళలాడేవిధంగా నిర్మాణాత్మకమైన ప్రణాళిక అమలు చేయడం జరుగుతుందన్నారు. పర్యాటక కేంద్రాలైన దిండి, పెదమల్లం, దొంగరావిపాలెంలను అనుసంధానం చేయనున్నట్టు చెప్పారు. దీంతో యువతకు ఉపాధి సైతం దొరుకుతుందన్నారు. సమావేశంలో పెనుగొండ, ఆచంట ఏఎంసీ చైర్మన్లు సానబోయిన గోపాలకృష్ణ, ఉప్పలపాటి సురేష్‌బాబు, పీహెచ్సీ చైర్మన్ కేతా సత్తిబాబు, దొంగరావిపాలెం, సిద్ధాంతం సర్పంచ్‌లు పమ్మి మురళీ వెంకటేశ్వరరావు, బిరుదగంటి రత్నరాజు తదితరులు పాల్గొన్నారు. -
పితానికి సీఎం క్లాస్
ఏలూరు, న్యూస్‌లైన్ :సభలు, సమావేశాల్లో జాగ్రత్తగా మాట్లాడాలంటూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ శనివారం క్లాస్ తీసుకున్నారు. పెనుగొండ మండలం జగన్నాథపురంలో శుక్రవారం నిర్వహించినరచ్చబండ సభలో జిల్లా ఇన్చార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ‘మరో ముఖ్యమంత్రి’ అని మంత్రి పితాని సంబోధించిన నేపథ్యంలో ఆయనపై సీఎం కిరణ్ కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పితాని చేసిన వ్యాఖ్యను సభావేదికపై ఉన్నప్పుడు ముఖ్యమంత్రి తేలికగానే తీసుకున్నారు. సభ ముగిశాక పెనుగొండలోని మార్కెట్ కమిటీ కార్యాలయూనికి చేరుకున్న సీఎం శుక్రవారం రాత్రి అక్కడే బస చేసిన విషయం విదితమే. పితాని చేసిన వ్యాఖ్యలు పత్రికల్లో ప్రముఖంగా ప్రచురితం కావడంతో మంత్రి పితానిని ఉద్దేశించి ‘మరో ముఖ్యమంత్రి అనడం కరెక్ట్ కాదు. జాగ్రత్తగా మాట్లాడకపోతే ఇబ్బందులొస్తాయ్’ అంటూ శనివారం ముఖ్యమంత్రి చిరుకోపం ప్రదర్శించారని సమాచారం. -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
కొవ్వూరు, న్యూస్‌లైన్ :ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. కొవ్వూరు పీఎంఎంఎం హైస్కూల్లో బుధవారం నిర్వహించిన మండల, పట్టణ రచ్చబండ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మూడో విడత రచ్చబండలో 18 లక్షల మందికి రేషన్ కార్డులు, 14 లక్షల మందికి ఇళ్ల మంజూరు పత్రాలు అందించామని చెప్పారు. మొదటి విడత రచ్చబండలో 6 లక్షల మందికి, రెండో విడతలో 14 లక్షల మందికి రేషన్ కార్డులు అందించామన్నారు. మొదటి విడతలో 3 లక్షల మందికి, రెండో విడతలో 5 లక్షల మందికి, మూడో విడతలో 9 లక్షల మందికి పింఛన్లు అందించినట్టు తెలిపారు. ఇందిరమ్మ కలల్లో భాగంగా రాష్ట్రంలో 4.98 లక్షల మంది ఎస్సీలకు, 5.15లక్షల మంది ఎస్టీలకు 50 యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకున్న వారి బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 50 వేల మందికి, జిల్లాలో 2,020 మందికి బంగారుతల్లి పథకం అమలు చేస్తున్నట్టు చెప్పారు. కొవ్వూరు, నిడదవోలు ఆర్టీసీ డిపోలను పునరుద్ధరించేందుకు కృషిచేస్తున్నామన్నారు.కొవ్వూరులోని వెంకమ్మ చెరువు వద్ద రోడ్డు మలుపులను సరిచేసే ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే టీవీ రామారావు మాట్లాడుతూ ఇక్కడకు వచ్చిన వారందరికి లబ్ధి చేకూరుతుందా లేదా అని సభకు హాజరైన జనాన్ని ఉద్దేశించి ప్రశ్నించగా పథకాలు అందడం లేదని 80 శాతం మందికిపైగా చేతులెత్తడంతో వేదికపై ఉన్న వారంతా నోళ్లెళ్లబెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముదునూరి నాగరాజు మాట్లాడుతూ అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం లబ్ధిదారులకు మంత్రి పితాని, ఎమ్మెల్యే రామారావు మంజూరు పత్రాలను అందజేశారు. టీడీపీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి సూరపనేని చిన్ని, ఏఎంసీ చైర్మన్ బూరుగుపల్లి వీర్రాఘవులు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు ఆత్కూరి దొరయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పితాని పాట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రచ్చబండ.. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమం. రాష్ట్ర సాం ఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా మార్చేశారు. నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న రచ్చబండ సభల్లో ప్రజల గురించి మాట్లాడటం, వారి సమస్యల్ని పట్టించుకోవడం మానేసి ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజా సమస్యలల్ని పరిష్కరించిందేమీ లేకపోయినా ఆరోపణలతో హడావుడి చేస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జిల్లాలో పలుచోట్ల జరిగిన రచ్చబండ సభల్లో ఇదేరీతిన వ్యవహరించిన మంత్రి పితాని మంగళవారం తూర్పుగోదావరి జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్లి అక్కడ కూడా తన తిట్ల పురాణానికి తెరలేపారు. కాంగ్రెస్ పార్టీ కుదేలవడంతో రాబోయే ఎన్నికల్లో తన ఉనికి ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడటంతో ఆయనలో అసహనం పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన ఎక్కడబడితే అక్కడ రాజకీయాలు మాట్లాడేస్తున్నారు. పక్కన జిల్లా ఉన్నతాధికారులను పెట్టుకుని మరీ రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. బుధవారం పెరవలిలో జరిగిన రచ్చబండ సభలో అదేపనిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా, వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనా విమర్శలు చేశారు. పనిలో పనిగా తెలుగుదేశంపైనా ఆరోపణలు చేశారు. తాను చేసిన ఆరోపణలు, విమర్శలను బలపర్చుకునేందుకు మధ్యమధ్యలో ప్రజల్ని ‘అవునా.. కాదా’ అని సభకొచ్చిన ప్రజలను అడిగారు. వారేమీ స్పందించకపోయినా తనపాటికి తాను మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. ఏలూరులో రచ్చబండ ప్రారంభ సభలోనూ ఇలాగే విమర్శలు గుప్పించారు. ఇలా రచ్చబండ కార్యక్రమాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడంపై నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. తమ బాధలు తీర్చాలని ప్రజలు నిలదీస్తుంటే పట్టించుకోకుండా పితాని వ్యవహరిస్తున్న తీరుతో అధికారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యమ సమయంలో గప్‌చుప్ మొన్నటివరకూ సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరిగింది. మంత్రి పితాని ఎక్కడకు వెళ్లినా ప్రజలు నిలదీశారు. దీంతో అప్పట్లో ఆయన జిల్లాలో పర్యటనలను తగ్గించుకున్నారు. ఆ సమయంలో రాజకీయాలు మాట్లాడినా ఎవరూ వినే పరిస్థితులు లేకపోవడంతో మిన్నకుండిపోయూరు. కొద్దిరోజుల నుంచి ఉద్యమ ప్రభావం తగ్గడంతో ఆయన స్వరం మళ్లీ పెరిగింది. ఈ సమయంలోనే రచ్చబండ సభలు జరుగుతుండటంతో వాటిని పూర్తిగా తన రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు. సీఎం మెప్పు కోసం అగచాట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వీరవిధేయుడుగా మారిన పితాని ఆయన మెప్పు కోసం ఎక్కడికక్కతే అక్కడ రాజకీయాలు మాట్లాడేస్తున్నారు. సీఎంను అదేపనిగా పొగుడుతూ, ప్రత్యర్థులను తిడుతూ ముందుకెళుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ తదితర పథకాలు అందక జనం ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా సంక్షేమ పథకాలన్నీ నిరాటంకంగా అమలవుతున్నాయని ఢంకా బజాయించి మరీ అబద్ధాలు చెబుతున్నారు. ఏ ఒక్కరికీ మేలు జరగకపోయినా ముఖ్యమంత్రి ఘనతను, ఆయన ప్రవేశపెట్టిన పథకాలను కీర్తించడమే పనిగా పెట్టుకుని ముందుకెళుతున్నారు. పితాని భక్తికి మెచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఇటీవలే ఆయనకు ఆర్ అండ్ బీ శాఖ బాధ్యతలను అదనంగా అప్పజెప్పారు. దీంతో పితాని తన విధేయతను మరింతగా చాటుకునేందుకు రచ్చబండను వేదిక చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. -
ముంపు బాధితులను ఆదుకుంటాం
కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్‌లైన్ : రాష్ట్రంలో తుపాను వల్ల నష్టపోయిన వారిని ఆదుకుంటామని రోడ్లు భవనాల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఫై-లీన్ తుపాను, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ధ్వంసమైన ఆర్ అండ్ బీ రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ముంపు బాధితులకు బియ్యం, కిరోసిన్, దుస్తులు, వంట సామగ్రి కొనుగోలుకు ఆర్థిక సహాయం అందించడానికి ఉత్తర్వులు జారీ చేశామన్నారు. వర్షాల వల్ల ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నవారికి రూ.70 వేలతో పూర్తి సబ్బిడీపై గృహాలు మంజూరు చేస్తామన్నారు. రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి మరమ్మతు పనులపై ఈ నెల 12న నిపుణులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మంత్రుల కమిటీకి వ్యతిరేకం రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల కమిటీకి వ్యతిరేకమని మంత్రి తెలిపారు. శ్రీ కృష్ణ కమిటీ, అంటోని కమిటీల నివేదికలను బుట్టదాఖలు చేసినట్లే ఈ కమిటీ నివేదికను బుట్టదాఖలు చేస్తారని ఆయన అన్నారు. సీమాంధ్ర మంత్రులు ఈ కమిటీకి అభిప్రాయాలు చెప్పకూడదని తీర్మానించామని తెలిపారు.రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు మాట్లాడుతూ మోరంపూడి వద్ద ప్రమాదాలు నివారణకు, ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, రాజమండ్రి సీతానగరం, పురుషోత్తపట్నం ఆర్ అండ్ బీ రోడ్లు మరమతుల పనులు చేపట్టాలని మంత్రిని కోరారు.