ముంపు బాధితులను ఆదుకుంటాం
Published Mon, Nov 4 2013 1:38 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్‌లైన్ : రాష్ట్రంలో తుపాను వల్ల నష్టపోయిన వారిని ఆదుకుంటామని రోడ్లు భవనాల శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఫై-లీన్ తుపాను, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ధ్వంసమైన ఆర్ అండ్ బీ రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ముంపు బాధితులకు బియ్యం, కిరోసిన్, దుస్తులు, వంట సామగ్రి కొనుగోలుకు ఆర్థిక సహాయం అందించడానికి ఉత్తర్వులు జారీ చేశామన్నారు. వర్షాల వల్ల ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నవారికి రూ.70 వేలతో పూర్తి సబ్బిడీపై గృహాలు మంజూరు చేస్తామన్నారు. రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి మరమ్మతు పనులపై ఈ నెల 12న నిపుణులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
మంత్రుల కమిటీకి వ్యతిరేకం
రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల కమిటీకి వ్యతిరేకమని మంత్రి తెలిపారు. శ్రీ కృష్ణ కమిటీ, అంటోని కమిటీల నివేదికలను బుట్టదాఖలు చేసినట్లే ఈ కమిటీ నివేదికను బుట్టదాఖలు చేస్తారని ఆయన అన్నారు. సీమాంధ్ర మంత్రులు ఈ కమిటీకి అభిప్రాయాలు చెప్పకూడదని తీర్మానించామని తెలిపారు.రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు మాట్లాడుతూ మోరంపూడి వద్ద ప్రమాదాలు నివారణకు, ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, రాజమండ్రి సీతానగరం, పురుషోత్తపట్నం ఆర్ అండ్ బీ రోడ్లు మరమతుల పనులు చేపట్టాలని మంత్రిని కోరారు.
Advertisement