ఆచంట: ముందొచ్చిన కొమ్ములకంటే వెనుకొచ్చిన చెవులు వాడి అన్న రీతిలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు నడుస్తుండడంతో ఆ పార్టీలో అసంతృప్తి చాపకింద నీరులా సాగుతోంది. వర్గ విభేదాలకు స్వస్తిచెప్పి ఐక్యతతో పని చేస్తున్నామని పైకి చెప్పుకుంటున్నా లోలోపల మాత్రం ఒకరి వెనుక మరొకరు గోతులు తీసే కార్యక్రమాలు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా సాగించేస్తున్నారు. రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకర్గంలో కుమ్ములాటలపై తెలుగు తమ్ముళ్లు కలవరపడుతున్నారు.
పితాని రాకతో తెరవెనక్కి సీనియర్లు
టీడీపీ ఆవిర్భావం నుంచి 2009 డీలిమిటేషన్ ముందు వరకూ ఆచంట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగింది. డీలిమిటేషన్ తర్వాత పెనుగొండ నియోజకవర్గం రద్దయి ఆచంటలో విలీనమైంది. దీంతో నియోజకవర్గ స్వరూపమే కాదు, రాజకీయ సమీకరణలూ మారిపోయాయి. పితాని పెనుగొండ నుంచి వలస వచ్చి 2009లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2014లో ఆయన చివరి నిమిషంలో టీడీపీలోకి చేరడంతో ఆయన అనుచరులు కూడా ఆ పార్టీలో చేరారు. ఆచంట నుంచి రెండవసారి పోటీచేసి అతికష్టంమీద బయటపడ్డారు. పితాని మొదట్లో టీడీపీలో ఇమడడానికి కొంత ఇబ్బందిపడ్డా రాను రాను పార్టీలో పట్టు సాధించారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిందన్న ఆనందం తెలుగు తమ్ముళ్లకు ఎంతో కాలం నిలువలేదు. పథకాలు, లబ్ధిదారుల ఎంపిక, అభివృద్ధి పనులు, పార్టీ సంస్థాగత ఎన్నికలు తదితరాలలో పితాని ఆయన అనుచరుల హవా కొససాగింది. దీంతో పూర్వం నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తెలుగు తమ్ముళ్లకు పెత్తనం చెలాయించే అవకాశం లేకపోయింది. పార్టీ అధికారంలో ఉన్నా అందలం దక్కని పరిస్థితి ఏర్పడింది. దీంతో దగాపడ్డ తెలుగుతమ్ముళ్లలో అంతర్మధనం మొదలైంది. కొంత కాలంపాటు పార్టీకి తెలుగు తమ్ముళ్లు తెరవెనక్కి వెళ్లిపోయారు. తదనంతరం అధినేత ఆదేశాల మేరకు పితానితో కలిసిపోయారు. అయితే మనుషులు కలి సారే తప్ప వారి మనసులు మాత్రం కలవడంలేదు.
సీనియర్ నేతపై చిన్నచూపు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యకలాపాలన్నీ ఆచంటలోని గొడవర్తి రామారావుకు చెందిన గంధర్వమహల్ (పెద్దమేడ) నుంచే సాగేవి. ఆయన నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. పార్టీ ఆయనకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించింది. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌తోపాటు, ఇతర పదవులు కట్టబెట్టింది. ఆయన మరణంతో కుమారుడు గొడవర్తి శ్రీరాములు రంగప్రవేశం చేసి పార్టీలో పట్టు సాధించారు. రెండుసార్లు గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జిగా కొనసాగారు. పితాని అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరికతో గొడవర్తి కుటుంబం ఆధిపత్యానికి చెక్ పడింది. మొదట్లో పితానిని వ్యతిరేకించిన గొడవర్తి శ్రీరాములు కూడా తదనంతరం పార్టీ అధినేత ఆదేశాల మేరకు పితానితో చేతులు కలిపారు. దీంతో పెద్దమేడకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందని భావించారు. కానీ నేడు పార్టీలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. పితానికి మాత్రం పార్టీ మంత్రి పదవి కట్టబెడితే సీనియర్ నేత గొడవర్తికి కనీసం నామినేటెడ్ పోస్టు కూడా దక్కలేదు. దీంతో గొడవర్తి వర్గీయులు పైకి చెప్పుకోలేకపోయినా లోలోపల అ«ధినేతపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. గొడవర్తి అనుచరులు అడపాదడపా మాత్రమే పితాని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఎంపీపీ వర్సెస్ సర్పంచ్‌లు
ఇక అధికార పార్టీకే చెందిన ఎంపీపీ మేకా పద్మకుమారికి మండలంలోని సర్పంచ్‌లకు పొసగడం లేదు. సర్పంచ్‌లు ఎన్నికైన తర్వాత పితాని వర్గీయులుగా ముద్రపడ్డారు. ఎంపీపీ గొడవర్తి వర్గంగా ముద్రపడ్డారు. ఎంపీపీ కూడా కొంత కాలంపాటు మంత్రి పితానిని వ్యతిరేకించినా తర్వాత ఆయనతో కలిసి పనిచేస్తున్నారు. ఇటీవల ఎంపీడీఓకు ఎంపీపీకి అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. ఎంపీడీఓపై ఉన్నతాధికారికి ఫిర్యాదులు వెళ్లాయి. నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రికి తెలియకుండా నేరుగా ఎంపీడీఓపై ఫిర్యాదు చేయడాన్ని పలువురు నాయకులు ఎంపీపీని తప్పుబట్టారు. ఎంపీపీ ఎంపీడీవో పనితీరును వ్యతిరేకిస్తుంటే సర్పంచ్‌లు మాత్రం ఎంపీపీ తీరును వ్యతిరేకిస్తూ ఎంపీడీఓ పక్షాన నిలుస్తున్నారు. ఏది ఏమైనా అధికార పార్టీలో రోజు రోజుకు పెరుగుతున్న అసంతృప్తి, తెలుగు తమ్ముళ్ల మధ్య కుమ్ములాటలు ముందు ముందు పార్టీకి తీవ్ర నష్టమేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment