ఎవరికివారే యమునా తీరే అన్న చందంగా తయారైంది జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఎనిమిది నియోజకవర్గాల్లో సైకిల్ ముక్కలు..ముక్కలుగా విడిపోయింది. జిల్లా కేంద్రం ఒంగోలు మొదలు పశ్చిమాన ఉన్న యర్రగొండపాలెం నియోజకవర్గం వరకూ అన్ని ప్రాంతాల్లో గ్రూపు తగాదాలతో సతమతమవుతోంది. పైకి అందరూ కలసినట్టుగా బిల్డప్ ఇస్తున్నా అంతర్గతంగా ఒకరంటే ఒకరికి పడక రగిలిపోతున్నారు. ఆ పార్టీ అధినేత వచ్చి వెళ్లినా పరిస్థితిలో ఎలాంటి మార్పు కానరాలేదు.
సాక్షిప్రతినిధి, ఒంగోలు: జిల్లాలోని తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. నూతనంగా ఏర్పాటైన జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి టీడీపీ పార్టీ ముక్కలు... ముక్కలుగా విడిపోయింది. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల తీరు ఎవరి దారి వారిదే అన్నట్లు తయారైంది. కొన్ని నియోజవర్గాల్లో పార్టీని ముందుకు నడిపే నాయకుడే కరువయ్యాడంటే జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎంతదయనీయంగా ఉందో అవగతమవుతుంది. టీడీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో మూడు రోజుల పాటు పర్యటించినా జిల్లా పార్టీలోని నాయకుల మధ్య ఉన్న విభేదాలను సరిదిద్దలేకపోయారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తీవ్రస్థాయిలో ఉన్నా వాటిని చంద్రబాబు సరిదిద్దకపోవడం విచారకరమని సొంత పార్టీ కేడరే నిరుత్సాహం వ్యక్తం చేయడం గమనార్హం. పార్టీలోని నేతలు విడిపోయినా, పార్టీ పరువు గంగలో కలిసిపోతున్నా, చంద్రబాబు పార్టీలో అంతా బాగుంది అన్నట్లు బిల్డప్ ఇస్తూ జిల్లాలో మూడు రోజులు గడిపారు. జిల్లా పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే కొందరు పెత్తందార్లు మిగతా వర్గాల నేతలను విస్మరించటం వల్ల ప్రతి నియోజకవర్గంలో వర్గాల వారీగా పార్టీ చీలిపోయింది.
జిల్లా పర్యటన సందర్భంగా చంద్రబాబు తొలుత గిద్దలూరు నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ఆదిలోనే హంసపాదు అన్న చందంగా నేతల మధ్య విభేదాల ఫలితంగా తొలిరోజు సభ అట్టర్ ప్లాప్ అయింది. మూడు ముక్కలుగా విడిపోయి ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నారు. వైఎస్సార్‌సీపీ జెండాపై ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు డబ్బు మూటలకు ఆశపడి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పచ్చ కండువా కప్పుకున్న ముత్తుముల అశోక్ రెడ్డిది ఒక గ్రూపు. రెండో గ్రూపు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకురాలు పిడతల సాయి కల్పనా రెడ్డి. ఇక ముచ్చటగా మూడో గ్రాపు పెట్టెల నారాయణ యాదవ్‌ది. చంద్రబాబు వచ్చినప్పుడు పిడతల సాయి కల్పనా రెడ్డి అసలు ఆయనను కలవనే లేదు. అధినేత వస్తుంటే కనీసం సమాచారం ఇవ్వకుండా అవమానించారంటూ పార్టీ నేతలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దామచర్ల జనార్దన్ ఆమెను కలిసేందుకు ప్రయత్నించినా నిరాకరించినట్టు తెలిసింది.
యర్రగొండపాలెంలో అయితే సైకిల్ పార్టీ నాలుగు ముక్కలైంది. సీనియర్ నాయకుడు డాక్టర్ మన్నే రవీంద్ర వర్గం ప్రధానంగా ఉండగా ఎరిక్షన్ బాబు, పాలపర్తి డేవిడ్ రాజు, గత ఎన్నికల్లో ఓటమి పాలైన బూదాల అజితరావుది మరో గ్రూపుగా ఎవరిదారి వారిదన్నట్లు వ్యవహరిస్తూ పోతున్నారు. పక్క నియోజకవర్గంలో పార్టీ అధినేత స్వయంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటుంటే ఇక్కడ ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు చేపట్టడం గమనార్హం. పార్టీలో కుమ్ములాటలు పక్కనపెట్టిన చంద్రబాబు యర్రగొండపాలెంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న దళితులపై వాళ్ల పార్టీ నాయకులు, కార్యకర్తల చేత రాళ్ల దాడి చేయించే పనికి పూనుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. ఇక దర్శి నియోజకవర్గంలో అయితే పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. పార్టీ కేడర్‌కు మార్గం చూపే నాయకుడే కరువయ్యాడు.
దర్శి పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న పమిడి రమేష్ ఆ బాధ్యతలకు కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. చివరకు ఇన్‌చార్జ్ పదవికి, పార్టీ సభ్యత్వానికి సైతం సోమవారం రాజీనామా చేయటంతో ఆ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. గతంలో ఆ పార్టీలో ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా చేసిన శిద్దా రాఘవరావు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ తరువాత దర్శి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన కదిరి బాబూరావు సైతం పచ్చ జెండాను కిందపడేసి వైఎస్సార్‌సీపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో దర్శిలో టీడీపీని ముందుకు నడిపే నాయకుడే కరువయ్యాడు. దీంతో ఇక్కడి పరిస్థితి మరీ దారుణంగా మారింది.
సంతనూతలపాడు నియోజకవర్గంలో కూడా నాయకత్వ లోపం స్పష్టంగా కనపడుతోంది. మాజీ ఎమ్మెల్యే విజయకుమార్‌ను ఆ నియోజకవర్గంలో నాయకుడిగా పార్టీ కేడర్ గుర్తించటం లేదు. ఇక్కడ విజయకుమార్ సరిపోడు అని పార్టీ కేడర్ ఒక నిర్ణయానికి వచ్చారు. అందుబాటులో లేకుండా బయటే ఉంటుండడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండపి నియోజకవర్గంలో ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి తీరు పట్ల పార్టీలో కేడర్ కొంత గుర్రుగా ఉంది. కొంతమందిని దగ్గరకు తీసి మరికొంతమందిని పూర్తిగా విస్మరిస్తున్నాడన్న నైరాశ్యం కార్యకర్తల్లో నెలకొని ఉంది. కనిగిరి నియోజకవర్గంలో ఉగ్రనరసింహారెడ్డి వన్ మ్యాన్ షో నిర్వహిస్తూ సెకండ్ కేడర్‌ను పట్టించుకోవడంలేదని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం
చేస్తున్నారు.
బాలినేని దెబ్బకు దామచర్ల విలవిల...
జిల్లా కేంద్రం ఒంగోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి దెబ్బకు టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విలవిల్లాడుతున్నాడు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బాలినేని ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నారు. కరోనా సమయంలో తన సొంత డబ్బులు ఖర్చు చేసిమరీ ప్రజలకు, బాధితులకు సేవలందించారు. అదే సమయంలో దామచర్ల ఒంగోలు ముఖం కూడా చూడకుండా బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో తలదాచుకున్నారు. వరదల సమయంలో కూడా ప్రజల సమస్యలు పట్టించుకున్న పరిస్థితి లేదు. వీటికి తోడు దామచర్ల సోదరుడు సత్యతో విభేదాలు భగ్గుమంటున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో దామచర్ల జనార్దన్‌కు టీడీపీ టిక్కెట్టు కూడా దక్కే పరిస్థితి లేదని ఆ పార్టీలోని నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు.
బాలినేనిని ఎదుర్కోవాలంటే కొత్త అభ్యర్థి అయితే తప్ప టీడీపీకి వేరే గత్యంతరం లేదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన నూకసాని బాలాజీని దామచర్ల పూర్తిగా విస్మరించారన్న ఆరోపణలు ఉన్నాయి. దామచర్ల నిర్వహించే సమావేశాలకు కనీసం నూకసానిని పిలవటం కూడా లేదు. దీంతో నూకసాని పాత గుంటూరు రోడ్డులో నుంచి పార్టీ కార్యాలయాన్ని భాగ్యనగర్ మూడో లైన్‌కు మార్చుకున్నారు. టీడీపీ నాయకులను దామచర్ల భాగ్యనగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయానికి కూడా ఎవరూ వెళ్లొవద్దని ఆంక్షలు విధించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో నూకసాని బాలాజీ కార్యాలయం వెలవెలబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment