పర్యాటక కేంద్రంగా దొంగరావిపాలెం
పర్యాటక కేంద్రంగా దొంగరావిపాలెం
Published Tue, Apr 4 2017 10:05 PM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM
దొంగరావిపాలెం (పెనుగొండ) : దొంగరావిపాలెంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. మంగళవారం దొంగరావిపాలెంలోజరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దొంగరావిపాలెం వద్ద లంకభూములు, గోదావరిలో నీటి నిల్వలు ఉండడంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇప్పటికే రూ.36 లక్షలతో పర్యాటక కేంద్ర పనులు ప్రారంభమయ్యాయన్నారు. బోటు షికారు, విశ్రాంతి ప్రాంతాల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. త్వరలోనే ఏటిగట్టు పొడవునా రెస్టారెంట్లు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకర్షిస్తామన్నారు. రాబోయే రెండేళ్లలో దొంగరావిపాలెం పర్యాటకులతో కళకళలాడేవిధంగా నిర్మాణాత్మకమైన ప్రణాళిక అమలు చేయడం జరుగుతుందన్నారు. పర్యాటక కేంద్రాలైన దిండి, పెదమల్లం, దొంగరావిపాలెంలను అనుసంధానం చేయనున్నట్టు చెప్పారు. దీంతో యువతకు ఉపాధి సైతం దొరుకుతుందన్నారు. సమావేశంలో పెనుగొండ, ఆచంట ఏఎంసీ చైర్మన్లు సానబోయిన గోపాలకృష్ణ, ఉప్పలపాటి సురేష్‌బాబు, పీహెచ్‌సీ చైర్మన్ కేతా సత్తిబాబు, దొంగరావిపాలెం, సిద్ధాంతం సర్పంచ్‌లు పమ్మి మురళీ వెంకటేశ్వరరావు, బిరుదగంటి రత్నరాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement