అధికారం కోసం ఆరాటం
Published Sun, Oct 13 2013 2:24 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ: పదిహేనేళ్ల విరామం తర్వాత అధికారం దక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఆరాటపడుతోందని మంత్రులు హరూన్ యూసుఫ్, అర్విందర్‌సింగ్ లవ్లీ, రాజ్‌కుమార్ చౌహాన్‌లు ఆరోపించారు. శనివారం వారిక్కడ మీడియాతో మాట్లాడారు. అందులోభాగంగానే విద్యుత్, నీరు, పరిపాలన విషయంలో ప్రజలను పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. కాగా బీజేపీ సారథ్యంలోని మూడు కార్పొరేషన్ల మేయర వెంటబెట్టుకుని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలసిన గోయల్... అనంతరం ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ సర్కారు అవినీతిని వెలుగులోకి తీసుకొచ్చేందుకు జవాబుదారీ కమిషన్‌ను నియమించాలని కోరిన నేపథ్యంలో మంత్రులు పైవిధంగా స్పందించారు. లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలసి వినతిపత్రం ఇవ్వడంపైనా మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఏదోవిధంగా అధికారం దక్కించుకునేందుకు విజయ్ గోయల్ తీవ్రమైన ఆరోపణలకు దిగుతున్నారన్నారు. తమ సారథ్యంలోని కార్పొరేషన్లలో జవాబుదారీ కమిషన్‌ను నియమించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించిన బీజేపీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలవడమెందుకని వారు ప్రశ్నించారు. వారు ఇప్పటికే కమిషన్‌ను తప్పనిసరిగా నియమించి ఉండాల్సిందన్నారు.
పక్కదారి పట్టించేందుకే
తాము అధికారంలోకి వస్తే 30 శాతంమేర విద్యుత్ చార్జీలను తగ్గిస్తామంటూ బీజేపీ ప్రకటించడంలోని ఆంతర్యం ప్రజలను పక్కదారి పట్టించడమేనని మంత్రి హరూన్ యూసఫ్ ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ నాయకులు అమలుకు వీలుకాని హామీలు ఇస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం అనేకమంది విద్యుత్ సబ్సిడీ ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. తమ ప్రభుత్వం ఏనాడూ విద్యుత్ సంస్థలకు అండగా నిలవలేదన్నారు. ఢిల్లీ విద్యుత్ నియంత్రణ కమిషన్ (డీఈఆర్‌సీ) చార్జీలను నిర్ధారిస్తుందన్నారు. ఆ విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండబోదన్నారు. యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర పెరిగిందన్నారు. 2002లో యూనిట్ విద్యుత్ ధర రూ. 1.50 ఉండగా. 2012 నాటికి అది రూ. 1.80కి చేరుకుందన్నారు. విద్యుత్ వాడకం కూడా గణనీయంగా పెరిగిపోయిందనే విషయాన్ని గోయల్ గుర్తుంచుకోవాలన్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో విద్యుత్ వినియోగం మూడురెట్లు పెరిగిందన్నారు. గడచిన 15 ఏళ్ల కాలంలో తమ ప్రభుత్వం నీటి సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసిందన్నారు. ఇందుకోసం అనేక చర్యలు తీసుకుందన్నారు.
Advertisement
Advertisement