లక్నో : అయోధ్య బాబ్రీ మసీదు స్థానంలో రామ మందిరాన్ని నిర్మించాలనే హిందూత్వ వాదుల కల ఇంకా వాస్తవ రూపం దాల్చనలేదు. ఈ లోపే ఢిల్లీలోని జామా మసీదును కూడా కూల్చివేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ పార్లమెంట్ సభ్యుడు సాక్షి మహారాజ్. ఉత్తరప్రదేశ్ ఉన్నావోలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సాక్షి మహారాజ్ ‘నేను రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు చెప్పిన మొదటి మాట అయోధ్య, మధుర, కాశీలు ఒక్కటై ఢిల్లీలోని జామా మసీదును కూల్చివేయాలని చెప్పాను. ఎందుకంటే హిందూ ఆలయాలను నాశనం చేసి వాటి అవశేషాల మీదనే జామా మసీదును నిర్మించారు. కావాలంటే అక్కడ తవ్వి చూడండి.. మసీదు కింద మీకు హిందూ ఆలయ ఆనవాలు కనిపిస్తాయి. ఒకవేళ అలా జరగకపోతే నన్ను ఉరి తీయండం’టూ సంచలన వ్యాఖ్యలు చేశారు సాక్షి మహారాజ్.
అంతేకాక మొఘలులు దేశంలోని హిందూ దేవాలయాలను కూల్చి వాటి స్థానంలో దాదాపు 3 వేల వరకూ మసీదులను నిర్మించారని ఆయన ఆరోపించారు. అయితే సాక్షి మహారాజ్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే ప్రథమం కాదు. గతంలో హిందూ మహిళలను ఉద్దేశిస్తూ ఎక్కువమంది పిల్లలను కని మన మతాన్ని కాపాడండంటూ పిలుపునివ్వడమే కాక.. మూక దాడుల్లో ముస్లింలను చంపడాన్ని కూడా సమర్థించారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో ఇప్పటికే పార్టీలన్ని అయోధ్య రామ మందిర నిర్మాణం గురించి మాట్లాడుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్, శివసేన పార్టీలు అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రారంభించే విధంగా ఆర్డినెన్స్‌ను పాస్ చేయాల్సిందిగా బీజేపీని డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment